‘మా నాన్న చనిపోయినా వెళ్లలేకపోయా.. ప్లీజ్.. మమ్మల్ని సొంతూళ్లకు పంపించండి..’

ABN , First Publish Date - 2020-04-09T17:22:40+05:30 IST

కూటికోసం.. కూలి కోసం.. కడుపు చేత పట్టుకుని వచ్చిన కూలీలకు కష్టం వచ్చింది. ఊరుకాని ఊరులో చేసేందుకు పనులు లేక.. ఆదుకునే నాథుడు లేక వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.

‘మా నాన్న చనిపోయినా వెళ్లలేకపోయా.. ప్లీజ్.. మమ్మల్ని సొంతూళ్లకు పంపించండి..’

బయట కరోనా భయం.. ఇంట్లో ఆకలి కేకలు

గుంటూరు జిల్లాలో అల్లాడుతున్న 70వేల మంది కూలీలు

నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులు..

పొలం పనులకు వచ్చిన కూలీలకు కష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం

దాతలు, రైతుల సాయంతోనే కాలం వెళ్లదీత


గుంటూరు, ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: కూటికోసం.. కూలి కోసం.. కడుపు చేత పట్టుకుని వచ్చిన కూలీలకు కష్టం వచ్చింది. ఊరుకాని ఊరులో చేసేందుకు పనులు లేక.. ఆదుకునే నాథుడు లేక వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ తమ పాలిట శాపంగా మారాయని వారంతా వాపోతున్నారు. సొంత ఊళ్లకు వెళ్లే దారిలేక .. ఇక్కడ పనులు లేక ఎంతో కొంత దాతలు ఇచ్చిన సాయంతో కాలం గడిపేస్తున్నారు. 


కరోనా రక్కసి వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో సరిహద్దులు మూ సివేయడంతో వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. జిల్లాలో సుమారు 70వేల మంది వలస కూలీలు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి విలవిల్లాడుతున్నారు. జిల్లాలో 45 మండలాల్లో మిరపసాగు చేస్తున్నారు. ఈ పనుల కోసం రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది కూలీలు వచ్చా రు.  పనులు దాదాపు పూర్తయ్యాయి. పల్లెల్లో ఉన్న అరకొర వ్యవసాయ పనులు చేసి కాలం గడిపేస్తున్నారు.  ఈ కూలీల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయాన్ని చేయలేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రైతులే వలస కూలీలకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాడికొండ మండల పరిధిలోని మిర్చి కోతల పనులకు కర్నూ లు జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 2,600 మంది కూలీలు వలస వచ్చారు.  లాక్‌డౌన్‌ ప్రకటించ టంతో కూలీల పరిస్ధితి దుర్భరంగా మారిపోయాయి. 


కార్మికుల వెతలు

బాపట్ల ప్రాంతంలో నిర్మాణ పనులు చేసేందుకు ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌ తదితర ప్రాంతాల నుంచి అనేకమంది కూలీలు ఇక్కడకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా అటు స్వరాష్ర్టానికి వెళ్ళలేరు. ఇక్కడ పనులు చేయటానికి లేవు. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్‌ ఇచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్నారు.  కొల్లూరు ఇటుక పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీలు పుట్టెడు కష్టాలను అనుభవిస్తున్నారు. ఉత్పత్తిని నిలిపి వేయాలని అధికారులు హుకుం జారీ చేయడం, వలస కూలీలకు భృతి కల్పించాలని ఆదేశాలు ఇవ్వ డంతో ఇటుక ఉత్పత్తిదారులపై అదనపు భారం పడుతోంది. నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలా ది కుటుంబాలు వలస వచ్చాయి.  అసలే గత పది నెలలుగా వరద, ఇసుక కొరత కారణంగా ఇటుక కొనే నాధుడు లేకుండా పోయాడని, ఆయా పరిణామాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని పరిశ్రమ యజమానులు అంటున్నారు. 


మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణంలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఒడిశా, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులు కూడా నిలిచిపోవడంతో పక్షం రోజులుగా వీరికి ఉపాధి లేకుండా పోయింది. ఇటుకల తయారీ కోసం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ చెందిన సు మారు 500 మంది, ఐదు నెలల క్రితం వినుకొండకు వలస వచ్చారు. నేడు వారి చేతిలో చిల్లి గవ్వలేదు.  సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో కర్నూలు, కృష్ణా, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు అధికంగా ఉన్నారు. 


తండ్రి చనిపోయినా..వెళ్ళలేకపోయా..: రాజేష్‌, ఛత్తీస్‌ఘడ్‌

బాపట్లలో పనుల కోసం వచ్చాను. లాక్‌డౌన్‌ కారణంగా నా తండ్రి చనిపోయినప్పటికీ ఇంటికి వెళ్ళి కడసారి చూపు చూసుకోలేకపోయాను. తోటివారు ఓదార్చి మనోధైర్యం కల్పించారు. 


ఇంటి వద్ద పిల్లలు వృద్ధులు ఉన్నారు..: బి.వీరేష్‌  

ఎమ్మిగనూరులో తమ ఇంట్లో వృద్దులు, చిన్నపిల్లలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడ వారు ఇబ్బందులు పడుతున్నారు. మాగ్రామం ఎప్పుడు వెళదామా అని ఎదురుచూస్తున్నాం. 


సొంత గ్రామాలకు పంపించండి: వీరన్న, కర్నూలు జిల్లా 

మూడు నెలల క్రితం మిర్చి కోతలకు  వచ్చాము. కోతల పనులు ముగిసాయి. పనులు లేవు. మా సొంత గ్రామాలకు మమ్మల్ని పంపించాలి. రోజుకు రూ.200 వరకు ఖర్చు అవుతుంది.

Updated Date - 2020-04-09T17:22:40+05:30 IST