ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

ABN , First Publish Date - 2021-09-19T05:18:25+05:30 IST

హజ్రత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది. సాధారణ రోజుల్లోనే కాకుండా ఏడాదికోసారి నిర్వహించే ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకుంటారు.

ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

  • జహంగీర్‌ పీర్‌ దర్గా ప్రత్యేకత
  • కులమతాలకతీతంగా ప్రార్ధనలు 
  • రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు

హజ్రత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది. సాధారణ రోజుల్లోనే కాకుండా ఏడాదికోసారి నిర్వహించే ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకుంటారు. ఇక్కడే వంటావార్పు చేసి బాబాకు నైవేద్యాలను సమర్పిస్తారు. 

కొత్తూర్‌: మండల పరిధి ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గలహజ్రత్‌ జహంగీర్‌పీర్‌(జేపీ)దర్గా రాష్ట్రంలోనే పేరుగాంచింది. ఆహ్లాదం, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కులమతాలకు అతీతంగా ప్రజలు దర్గాదర్శనానికి రాష్ట్రంలోని నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గిరిజన కుటుంబాలు ఎడ్లబండ్లపై తరలివచ్చి దర్గాలో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత. సంపన్న రైతు కుటుంబాలు తమ ఇంటి ఇలవేల్పుగా బాబాను పూజిస్తుంటాయి. కాగా,ప్రతి ఏడాది మకర సంక్రాంతి తరువాత వచ్చే గురువారం నుంచి మూడు రోజుల పాటు దర్గా ఉర్సు ఘనంగా నిర్వహిస్తారు. దీనికి గాను వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్గాలో ప్రార్ధనలు చేస్తారు. 

ఆహ్లాదకరం

భక్తి భావంతో పాటు, ఆటపాటలతో భక్తులు ఇక్క డ సేద తీరుతుంటారు. దర్గా దర్శనం అనంతరం యువతీ, యువకులు పరిసరాల్లోని స్విమ్మింగ్‌ ఫూల్స్‌, రంగులరాట్నాలతో పాటు ఇతర ఆటవిడుపు ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా గడుపుతుంటారు. 

క్షౌరవృత్తిలో మహిళలు

సాధారణంగా ఆలయాల్లో పురుష నాయీ బ్రాహ్మణులు తలనీలాలు తీస్తారు. అయితే దర్గా వద్ద  మహిళలు తలనీలాలు తీయడం ఇక్కడి ప్రత్యేకత.  నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన పురుషులు దర్గాలో నియాజ్‌ ఊరేగింపు, ఇతర కార్యక్రమాలకు బ్యాండ్‌, భజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇన్ముల్‌నర్వకు చెందిన దాదాపు 20 నాయీబ్రాహ్మణ కుటుంబాలు దర్గాను నమ్ముకునితమ వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. 

ఆది, గురు వారాల్లో ...

జేపీ దర్గాను దర్శించుకునేందుకు భక్తులు అది, గురు వారాల్లో పెద్దయెత్తున తరలివస్తారు. దీంతో దర్గా ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అదివారం సెలవు కావడంతో భక్తుల తాకిడి అధికంగానే ఉంటుంది. 

దర్శనం తరువాతే ఎన్నికల ప్రచారం...

దర్గాను దర్శించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తే అంతా మంచి జరుగుతుందని కొందరు రాజకీయ నాయకులు భావిస్తుంటారు. ఉన్నతాధికారులు సైతం బాబాను దర్శించుకుని ఉద్యోగాల్లో కొలువుదీరుతుంటారు. సీఎం కేసీఆర్‌ పలుమార్లు జేపీ దర్గాను దర్శించుకున్నారు.

వాహనాలకు పూజలు

దర్గాను దర్శించుకునే భక్తులు తమ వాహనాలకు పూజలు చేయిస్తుంటారు. దర్గాలోని మొల్లలు వాహనాలకు పూజలు చేస్తుంటారు. 

కూరగాయలు, పండ్లకు ప్రసిద్ధి

దర్గా శివారు తండాలకు చెందిన గిరిజనులు వారు పండించిన కూరగాయాలు, పండ్లను దర్గా వద్ద విక్రయిస్తుంటారు. వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తుంటారు. 

మట్టి పాత్రలకు భలే గిరాకీ

జేపీ దర్గా పరిసరాల్లో విక్రయించే మట్టి పాత్రలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. జహంగీర్‌పీర్‌ బాబాకు సమర్పించే నైవేద్యాన్ని మట్టి పాత్రల్లోనే చేయడం ఇక్కడి సాంప్రదాయం. ఆచారంతో పాటు ఆరోగ్యం కూడా  బాగుంటుదనే నమ్మకంతో ప్రజలు ఇక్కడి మట్టి పాత్రలను కొనుగోలు చేస్తుంటారు. వేసవి కాలంలో వాటి గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన దాదాపు 50 కుమ్మరి కుటుంబాలు మట్టి పాత్రలను విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు. 

బాబా అంటే ఎంతో నమ్మకం

జహంగీర్‌పీర్‌ బాబా అంటే మా కుటుంబానికి ఎంతో నమ్మకం. 25 సంవత్సరాలుగా దర్గాకు వస్తున్నాం. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కందూరు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటాం. అనంతరం ఇక్కడే భోజనాలు చేస్తాం. 

- ఎం.డీ అక్బర్‌, చార్మినార్‌, హైదరాబాద్‌ 

చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు

జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించుకుంటే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. మా కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలను బాబా సన్నిధిలో నిర్వహించి కందూరు చేశాను. కుటుంబసభ్యులతో కలిసి దర్గాను దర్శించుకోవడం ఆనందంగా ఉంటుంది. 

- మేకల రాఘవేందర్‌యాదవ్‌, కొత్తూర్‌

కులమతాలకతీతంగా ప్రార్ధనలు 

కులమతాలకతీతంగా భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి బాబాను దర్శించుకుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు బాబాకు ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం ప్రచారాలు మొదలుపెడుతుంటారు. 

- సయ్యద్‌ యూసు్‌ఫఅలీ, ముజావర్‌

Updated Date - 2021-09-19T05:18:25+05:30 IST