ఈపీఎస్‌, ఓపీఎస్‌కే సర్వాధికారం

ABN , First Publish Date - 2021-01-10T13:42:51+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కూటమిని రూపొందించే అధికారం పార్టీ ఉప సమన్వయకర్త, సీఎం ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వానికి అప్పగిస్తూ ...

ఈపీఎస్‌, ఓపీఎస్‌కే సర్వాధికారం

కూటమిపై అన్నాడీఎంకే సర్వసభ్యమండలి నిర్ణయం 

16 తీర్మానాలకు ఆమోదం


చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కూటమిని రూపొందించే అధికారం పార్టీ ఉప సమన్వయకర్త,  సీఎం ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వానికి అప్పగిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహం రూపొందించే నిమిత్తం వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో శనివారం అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ, సర్వసభ్యమండలి సమావేశాలు జరిగాయి. పార్టీ  ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదన్‌ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం, పార్టీ సీనియర్‌ నాయకులు, రాష్ట్రమంత్రులు సహా సుమారు నాలుగువేలమంది పాల్గొన్నారు. ఉదయం 9గంటలకు జరగాల్సిన ఈ సమావేశం 11 గంటలకు ప్రారంభమైంది. తొలుత ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఉదయం 10.50 గంటలకు సభాస్థలికి చేరుకోగా ఆ తర్వాత పళనిస్వామి విచ్చేశారు. వారిద్దరికి   పూందమల్లి హైరోడ్డులో రోహిణి థియేటర్‌ నుంచి వానగరం వరకు దారి పొడవునా వేలసంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు.   ఇక సర్వసభ్య మండలి వేదికగా వున్న శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపం వద్ద వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుమికూడారు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ సర్వసభ్యమండలి సమావేశం ప్రారంభమైంది. మాజీ మంత్రి పి.వలర్మతి స్వాగతోపన్యాసం చేశారు. తొలుత దివంగత పార్టీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌ తీర్మానం ప్రతిపాదించారు. ఆ తర్వాత అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన కూటమిని రూపొందించే బాధ్యతను ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానం చేయగానే సర్వసభ్యమండలి సభ్యులంతా చప్పట్లతో తమ ఆమోదాన్ని వ్యక్తం చేశారు. 


స్టాలిన్‌కు వ్యతిరేకంగా తీర్మానం

ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా  ఖండన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎడప్పాడిపై డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్‌ పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేయడాన్ని గర్హిస్తూ ఈ తీర్మానం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం నిర్మించడంపై హర్షం ప్రకటిస్తూ  మరో తీర్మానం చేశారు. ఇదే రీతిలో మొత్తం 16 తీర్మానాలను సర్వసభ్య మండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.


సీఎం అభ్యర్థి ఎడప్పాడి

అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేయనున్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ సర్వసభ్య మండలి సమావేశం తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానానికి సభ్యులందరూ  ఆమోదం ప్రకటించారు. 


మార్గదర్శక కమిటీకి...

అన్నాడీఎంకేలో ఇటీవల 11 మంది సభ్యులతో ఏర్పాటైన మార్గదర్శక కమిటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సర్వసభ్య మండలి సమావేశంలో చేసిన తీర్మానానికి కూడా సభ్యులందరూ ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఈ కమిటీ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సూచనల మేరకు పార్టీ పటిష్ఠతకు దోహదపడాలని, అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలు సాగించాలని సర్వసభ్య మండలి సూచించింది.

Updated Date - 2021-01-10T13:42:51+05:30 IST