ప్లాట్లు గల్లంతు

ABN , First Publish Date - 2021-03-05T06:15:53+05:30 IST

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. అధికారుల అవినీతి.. సామాన్యుల పాలిట శాపంలా మారాయి. ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్‌ శివారులో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు గల్లంతయ్యాయి. రియల్టర్లు ఈ స్థలాలను గద్దల్లా తన్నుకుపోయారు. తమ మాయాజాలంతో శ్రీరాంనగర్‌ కాలనీనే కనుమరుగు చేశారు. అవినీతి అధికారుల అండదండలతో ఆ స్థలాలకే డాక్యుమెంట్లను పుట్టించి కొత్త కాలనీని సృష్టించారు. మళ్లీ ప్లాట్లు వేసి దర్జాగా అమ్మేసుకున్నారు. కొన్నవారంతా అక్కడ ఇళ్లను నిర్మించేసుకున్నారు. ఈ ఆవేదనను దిగమింగుకుని తమ పాత ప్లాట్ల కోసం బాధితులు ఇంకా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్లాట్లు గల్లంతు
శ్రీరాంనగర్‌ కాలనీ స్థానంలో ఏర్పాటైన బీఎ్‌సఆర్‌ కాలనీ

35 ఏళ్ల క్రితం కొన్న స్థలాలు మాయం

రెవెన్యూ రికార్డుల మాయాజాలంతో కుచ్చుటోపి

అధికారుల చుట్టూ తిరిగినా బాధితులకు దక్కని న్యాయం

అమ్మిన రైతుల వద్దే కొనుగోలు చేసిన రియల్టర్లు

శ్రీరాంనగర్‌ కాలనీ స్థానంలో బీఎస్‌ఆర్‌ కాలనీ అవతరణ

కొత్తగా ప్లాట్లు కొని ఇళ్లు నిర్మించుకున్న ఉద్యోగులు

ఇంకా పాత ప్లాట్ల కోసం పోరాడుతూనే ఉన్న పండుటాకులు


ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం..  రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. అధికారుల అవినీతి.. సామాన్యుల పాలిట శాపంలా మారాయి. ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్‌ శివారులో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు గల్లంతయ్యాయి. రియల్టర్లు ఈ స్థలాలను గద్దల్లా తన్నుకుపోయారు. తమ  మాయాజాలంతో శ్రీరాంనగర్‌ కాలనీనే కనుమరుగు చేశారు. అవినీతి అధికారుల అండదండలతో  ఆ స్థలాలకే డాక్యుమెంట్లను పుట్టించి కొత్త కాలనీని సృష్టించారు. మళ్లీ ప్లాట్లు వేసి దర్జాగా అమ్మేసుకున్నారు. కొన్నవారంతా అక్కడ ఇళ్లను నిర్మించేసుకున్నారు. ఈ ఆవేదనను దిగమింగుకుని తమ పాత ప్లాట్ల కోసం బాధితులు ఇంకా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.


పటాన్‌చెరు, మార్చి 4 : అప్పట్లో వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి విక్రయించినా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రికార్డుల్లోకి ఎక్కలేదు. దీంతో రైతుల పేరిటనే ఆ భూములు ఉన్నాయి. ఇదే అదనుగా అవినీతికి అంకురార్పణ జరిగింది. రిజిస్ట్రేషన్‌ శాఖ చేసిన దస్తావేజులను పట్టించుకోకుండా రెవెన్యూ రికార్డుల ఆఽధారంగా అమ్మిన భూములకే తిరిగి పట్టాదారుల పాసు పుస్తకాలు ఇచ్చేశారు. వారి వద్ద భూముల కొనుగోలు చేసిన రియల్టర్లు రెవెన్యూ అధికారుల అండదండలతో భూములకు డాక్యుమెంట్లు పుట్టించారు. తిరిగి ప్లాట్లు వేసి మరో మారు అమ్మేసుకున్నారు. దీంతో ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన సామాన్యుల ప్లాట్లు గల్లంతయ్యాయి. బీరువాలో భద్రంగా దాచుకున్న డాక్యుమెంట్లు మాత్రం వారికి దక్కాయి. భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకునేందుకు కొన్న స్థలం మరొకరి పాలైంది. సుమారు 35ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లను దక్కించుకునేందుకు వృద్ధులైన పండుటాకులు న్యాయపోరాటం చేస్తున్నారు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఆశగా న్యాయం కోసం కనిపించిన వారినల్లా ఆశ్రయిస్తున్నారు. దశాబ్దకాలంగా న్యాయం కోసం వారు చేయని ప్రయత్నం లేదు. 


చిత్తు కాగితాలైన రిజిస్టర్‌ డాక్యుమెంట్లు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామంలో సర్వే నంబర్‌ 6, 7, 8, 9, 10లో 1983, 1984 ప్రాంతంలో సుమారు 12 ఎకరాల స్థలంలో జి.సూర్యనారాయణమూర్తి, సీతారాంరెడ్డి అనే రియల్‌ వ్యాపారులు రైతుల వద్ద జీపీవో తీసుకుని ప్లాట్లు చేసి విక్రయించారు. కొందరు ఉద్యోగులు, కార్మికులు ప్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి స్థలం ప్లాట్లు కొనుగోలు చేసిన వారి కబ్జాలోనే ఉంది. అప్పట్లో ఈ ప్రాంతం నివాసాలకు దూరంగా ఉండటంతో ఎవరూ ఇళ్లు నిర్మించుకోలేదు. 2000 సంవత్సరం తరువాత కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే రెవెన్యూ రికార్డులు ఖాస్రా, పహాణీ ప్రతుల్లో మాత్రం జీపీఏలు ఇచ్చి విక్రయించిన రైతుల పేరిటనే ఈ భూములున్నాయి. సాధారణంగా రెవెన్యూ సిబ్బంది విక్రయించిన భూములను ఏటా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పట్లో భూ విక్రయం జరిగినా రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డుల్లో ప్లాట్లుగా బదలాయించ లేదు. ఇదే అసలు సమస్యకు ప్రధానకారణమైంది. వాస్తవాలు పరిశీలించకుండా ఖాస్రా, పహాణీలో వస్తున్న రైతుల పేర్ల ఆధారంగా వారి వారసులకు పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ సిబ్బంది ఇచ్చేశారు. విపరీతమైన డిమాండ్‌ ఉన్న ఈ భూములను వారసుల నుంచి రియల్టర్లు 2011, 2012 ప్రాంతంలో పాత లేఅవుట్‌ స్థలంలో కొత్త లేఅవుట్‌ వేసి ప్లాట్లను విక్రయించారు. ఆ సమయంలో తమ ప్లాట్ల హద్దులను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న పాత ప్లాట్ల యజమానులు 2012లో శ్రీరాంనగర్‌ కాలనీ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ పేరుతో న్యాయపోరాటానికి దిగారు. హైదరాబాద్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు, సంగారెడ్డి జిల్లా కోర్టులను ఆశ్రయించారు. కోర్టులు ఇంజక్షన్‌ ఆర్డర్‌ను జారీ చేసినా ప్లాట్ల విక్రయం ఆగలేదు. మాధవరెడ్డి, రాఘవేంద్ర అనే రియల్‌ వ్యాపారులు బీఎ్‌సఆర్‌ కాలనీ పేరుతో ప్లాట్లను విక్రయించారు. పాత ప్లాట్ల ఓనర్ల వద్ద రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు ఉన్నా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన పంచాయతీ, రెవెన్యూ శాఖలు ప్లాట్ల యజమానులకు ఎలాంటి సహాయం చేయలేదు. పైగా అప్పటి సంగారెడ్డి ఆర్డీవో వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయడం గమనార్హం. 


ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా దక్కని ఫలితం

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న కిష్టారెడ్డిపేటలో అక్రమ లేఅవుట్‌కు అనుమతించడంతో పాటు పంచాయతీ నుంచి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, డీపీవోకు ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. ఒక వైపు దర్యాప్తు, విచారణ, నివేదికల పేరుతో కాలాయాపన చేస్తూ అధికారులు రియల్‌ వ్యాపారులకు వత్తాసు పలికారు. ఫలితంగా సదరు లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయంతో పాటు ఇళ్ల నిర్మాణం జరిగిపోయింది. పాత లావాదేవీలను పట్టించుకోకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు కొత్తగా వేసిన బీఎ్‌సఆర్‌ కాలనీలో బ్యాంకులోన్లు తీసుకుని ఇళ్లను కొన్నారు. తమ ప్లాట్లలో ఇళ్లను కట్టవద్దని అడ్డుకునే ప్రయత్నం చేయగా కొత్తగా కొనుగోలు చేసిన బీఎ్‌సఆర్‌ కాలనీ వాసులు వారిని అడ్డుకున్నారు. దీంతో దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు దక్కకుండా పోతున్నాయన్న ఆవేదన దిగమింగుకుని దాచుకున్న ప్లాట్ల దస్తావేజులను పట్టుకుని న్యాయ పోరాటం చేస్తున్నారు.


ప్లాట్ల ప్రస్తావన లేకుండానే రెవెన్యూ నివేదిక

రిజిస్ట్రేషన్‌ శాఖ 1984, 1985లో చేసిన ప్లాట్ల దస్తావేజుల ప్రస్తావన లేకుండానే పటాన్‌చెరు తహసీల్దార్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టుకు నివేదిక సమర్పించారు. 2014లో తహసీల్దార్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 1958, 1959 ఖాస్రా పహాణీ ప్రకారం కిష్టయ్య, నారాయణ, వెంకయ్య, ఆగయ్య, సత్తయ్య, బాలయ్య, సామయ్య సర్వే నంబర్లు 6, 7, 8, 9, 10 లోని భూముల యజమానులుగా పేర్కొన్నారు. 2011, 2012 పహాణీలో తుమ్మవిజయప్రతా్‌పరెడ్డి, జి.సుమంత్‌రెడ్డి, వీ.నీరజ, వీ.మాధవరెడ్డి, బీ.కుమార్‌, లక్ష్మీనారాయణ, గోపాల్‌, ప్రకాష్‌, రాజు, చిన్నరొయ్యల రుక్కమ్మ, బీ.సుగుణ, కొడకంచి యాదయ్య యజమానులగా పేర్కొన్నారు. ఇక నివేదిక సమర్పించిన 2014లో బీఎ్‌సఆర్‌ అవుట్‌, ఆక్సిస్‌ అవుట్‌, ప్లాట్లు, ఇళ్లుగా పహాణీలో నమోదయ్యాయని తహసీల్దార్‌ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 1985 ప్రాంతంలో సదరు భూములకు రైతులు ఇచ్చిన జీపీఏ డాక్యుమెంట్‌ను, జీపీఏ తీసుకున్న వ్యక్తులు ప్లాట్లు చేసి అమ్మిన వ్యవహారాన్ని వివరించలేదు. జ్యుడిషియల్‌ అధికారులు ఉన్న తహసీల్దార్‌ వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వకుండా కేవలం రికార్డుల్లో ఉన్న వివరాలను కోర్టుకు సమర్పించడం గమనార్హం. జిల్లా పంచాయతీ అఽధికారి ఆదేశాల మేరకు 2016 ఏప్రిల్‌ 24న అప్పటి పంచాయతీ విస్తరణ అధికారి సమగ్ర విచారణ జరిపి కలెక్టర్‌కు, జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లేఅవుట్‌లో 223 ఇళ్ల నిర్మాణానికి అనుమతి జారీ చేశారని పేర్కొన్నారు. 1984లోనే సదరు భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసిన 150 మంది వద్ద రిజిస్టర్‌ డాక్యుమెంట్లు ఉన్నాయని గుర్తించారు. అక్రమ లేఅవుట్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయని పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎక్కడా చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, పంచాయతీ శాఖల మధ్య సమన్వయ లోపం వివాదానికి కారణమైంది. ప్రస్తుతం చట్టాలు మార్చి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ తహసీల్దార్‌కు అప్పగించడంతో కొత్త వివాదాలకు అడ్డుకట్ట పడినా గతంలో జరిగిన తప్పిదాలతో ఇళ్ల స్థలాలను కోల్పోయిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధితులు వేడుకుంటున్నారు. 


మా కుటుంబాలకు న్యాయం చేయాలి

కష్టార్జితంతో కొన్న ప్లాట్లను కళ్లెదుటే కబ్జా చేసి అమ్ముకుంటున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. తీరని మానసిక వ్యధతో న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. 1985లో కొన్న రిజిస్టర్‌ డాక్యుమెంట్లకు విలువ లేదా ? రెవెన్యూ రికార్డుల ఆధారంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డాక్యుమెంట్లు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ? అధికార యంత్రాంగం ఉన్నా అక్రమార్కులకు వత్తాసు  పలికారు. తమ ప్లాట్లు ఉన్న బీఎ్‌సఆర్‌ కాలనీ వద్దకు వెళ్లకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. వయోభారంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. అనేక కుటుంబాలకు ఆధారంగా ఉన్న ఇంటి స్థలం దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాం. 

- రాంప్రసాద్‌, పాత ప్లాటు యజమాని

Updated Date - 2021-03-05T06:15:53+05:30 IST