మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు

ABN , First Publish Date - 2021-01-08T08:18:25+05:30 IST

రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం జగన్‌ అన్నారు.

మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు

  • క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకే ఇచ్చే యోచన 
  • లేఅవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేయాలి
  • లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయింపు 
  • మున్సిపల్‌ అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ 


అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం జగన్‌ అన్నారు. పట్టణాలు, నగరాల్లోని పేద ప్రజలకు ఇంటిస్థలం, సొంతింటిని నిర్మించి ఇచ్చేందుకు గురువారం ఆయన మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేసేవారికి అనేక ఆందోళనలు ఉన్నాయని, సరైన టైటిల్‌ ఉందా... అన్ని రకాల అనుమతులున్నాయా, లేవా అనే భయాలు వారికి ఉన్నాయన్నారు. లేఅవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే ఎలాంటి ఆందోళనలు, భయాలు ఉండవన్నారు.


ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా వ్యవహరించడం వల్ల వివాదాలు లేకుండా క్లియర్‌ టైటిల్‌తో కూడిన ఇంటి స్థలాలు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులో వస్తాయన్నారు. ఈ ప్లాట్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందించాలని, మధ్య తరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చిందన్నారు. లేఅవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని, దీనిపై మేధోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇతర అంశాలతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించామన్నారు. బస్‌బేతో పాటు సృజనాత్మకంగా బస్‌స్టాప్‌ ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లేఅవుట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 17 రెవెన్యూ గ్రామాలుంటే మనం మరో 17 వేల కాలనీలు కడుతున్నామన్నారు. కొన్నిచోట్ల నగర పంచాయతీలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్రతీరం వెంబడి ఆరులేన్ల బీచ్‌ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-01-08T08:18:25+05:30 IST