1,200 కిమీ సైకిల్ తొక్కిన బాలికకు బ్రేవరీ అవార్డు
‘పీఎం బాల్ పురస్కార్’కు 32 మంది
న్యూఢిల్లీ, జనవరి 25: వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన లేదా ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు ఇచ్చే ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డుకు కేంద్రం 32 మందిని ఎంపిక చేసింది. ఈ అవార్డును గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈసారి లాక్డౌన్ కష్టానికి కూడా ఈ అవార్డు దక్కడం విశేషం. బిహార్‌లోని దర్బంగా జిల్లాకు చెందిన జ్యోతికుమారి అనే 16 ఏళ్ల బాలిక.. లాక్డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని హరియాణ నుంచి దాదాపు 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి.. తన సొంత ఊరికి చేరింది. ఆ బాలిక ధైర్య సాహసాలకు దేశ విదేశాల నుంచి అభినందనలు దక్కాయి. నాటి తన కష్టమే.. నేడు ఆమెను బాల పురస్కారానికి ఎంపిక చేసింది. ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన మరో 31 మంది బాలలు కూడా బాల్ పురస్కార్‌కు ఎంపికయ్యారు.
విద్యారంగంలో ఉత్తమ ప్రతిభకు గాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన షాదాబ్(17)ను ఈ అవార్డు వరించింది. మెకానిక్ కుమారుడైన షాదాబ్.. తన మేధస్సుతో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి 28వేల డాలర్లు స్కాలర్షిప్ అందుకున్నారు. ఈ ఏడాది అవార్డు దక్కించుకున్న వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా ఏడేళ్ల ప్రసిద్ధి సింగ్ నిలిచింది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన ఈ బాలిక.. సంఘసేవకు గాను ఈ అవార్డును అందుకోనుంది. ప్రసిద్ధి ఫారెస్ట్ పేరుతో ఈ బాలిక ఓ ఫ్రూట్ ఫారె్‌స్టను నడుపుతుండటం విశేషం. ముంబైకి చెందిన కామ్య కార్తికేయన్(14), పర్వతారోహణకు గాను బాల్ పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు.
గ్రహీతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
అవార్డుకు ఎంపికైన 32 మంది బాలలతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఇందుకోసం ఏం చేయాలో ఆలోచించాలని కోరారు. గొప్పవాళ్ల ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవి స్ఫూర్తి పొందాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని కోరారు.