మోదీ సమీక్షలో పీఎం కేర్స్ ఫండ్ ఆదుకుందన్న సీఎంలు

ABN , First Publish Date - 2021-07-13T21:13:16+05:30 IST

ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం..

మోదీ సమీక్షలో పీఎం కేర్స్ ఫండ్ ఆదుకుందన్న సీఎంలు

 న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం సమీక్షించారు. కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేసిన సీఎంలను అభినందించారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ''పీఎం కేర్స్ ఫండ్‌'' తమకెంతో ఉపకరించిందని ముఖ్యమంత్రులంతా ముక్తకంఠంతో ప్రధానికి తెలియజేశారు. తమ తమ రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని సవివరంగా ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో ప్రధాని దృష్టికి తెచ్చారు. కోవిడ్ మొదటి వేవ్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్న సహకారానికి గాను పలువురు సీఎంలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ అంటూ వస్తే ఎదుర్కొనేందుకు తాము చేపట్టిన ముందస్తు సన్నాహకాలను కూడా ప్రధానికి వారు వివరించారు.


మిజోరం ముఖ్యమంత్రి జోరంథాంగా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తెచ్చారు. మయన్మార్, బంగ్లాదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్నందున, అక్కడి నుంచి వస్తున్న వారి వల్ల కేసులు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. కాగా, సెకెండ్ వేవ్‌లో కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నట్టు సీఎంలంతా ముక్తకంఠంతో ప్రధానితో పేర్కొన్నారు.


అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ అనుసంధానం  దయనీయ స్థితిలో ఉందని, ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో డాటా కూడా అప్‌లోడ్ చేయలేకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8 శాతం ఉందని వివరించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బైరెన్ సింగ్ మాట్లాడుతూ.. ఒకటి లేదా రెండు నెలల్లో రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జన్ ధన్ యోజన, కోవిడ్‌పై పోరాటంలో కేంద్రం అందించిన సహకారానికి త్రిపుర సీఎం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. టీ వర్కర్లకు మరిన్ని వ్యాక్సిన్లు కావాలని ప్రధానిని అసోం ముఖ్యంత్రి హిమాంత బిస్వ శర్మ కోరారు.


మైక్రో లెవెల్‌లోనే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సూచించారు. లాక్‌డౌన్ పెట్టకుండానే మైక్రో-లెవెల్‌లోనే కంటైన్‌మెంట్ జోన్లు పెట్టిన హేమంత్ బిస్వా శర్మను ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. థర్డ్ వేవ్ దానంతట అది రాదనీ, ప్రజలే కారణమవుతారని అన్నారు. థర్డ్ వేవ్‌ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండాలని ప్రధాని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T21:13:16+05:30 IST