పీఎం కిసాన్‌ గ్రీవెన్స్‌ పరిష్కారంలో జిల్లాకు అవార్డు

ABN , First Publish Date - 2021-02-25T04:55:20+05:30 IST

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి రైతుల అర్జీలను పరిష్కరించడంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ అవార్డును సాధించింది.

పీఎం కిసాన్‌ గ్రీవెన్స్‌ పరిష్కారంలో   జిల్లాకు అవార్డు
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, చిత్రంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జేడీ ఆనందకుమారి, ఏడీఏ అనిత, తదితరులు

 కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న కలెక్టర్‌


నెల్లూరు(వ్యవసాయం), ఫిబ్రవరి 24 :  పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి రైతుల అర్జీలను పరిష్కరించడంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచి,  కేంద్ర ప్రభుత్వ అవార్డును సాధించింది. ఈ అవార్డును కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు బుధవారం అందుకున్నారు. ఢిల్లీలోని పుసా ఏరియాలో ఏపీ షిండేహాల్‌లోని ఎన్‌ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లో  జరిగిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి రెండో వార్షికోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై.ఆనందకుమారి, ఏడీఏ అనితలు పాల్గొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018 డిసెంబరు 1న ప్రారంభిం చిన ఈపథకం ద్వారా ఏడాదికి రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా రూ.6వేలు అందిస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రూ.2వేల చొప్పున విడుదల చేశారు. అయితే జిల్లాలోని అర్హులైన రైతుల వివరాలు పరిశీలించగా, వారి వివరాలు పీఎం కిసాన్‌ పోర్టర్‌లో లేవు. అందువల్ల వారికి నగదు జమకాలేదు. దీంతో రైతులు పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అర్జీలను నమోదు చేసుకున్నారు. వీటి పరిష్కారానికి గ్రీవెన్స్‌ కమిటీ ఏర్పాటు చేసి, వారి ద్వారా సరైన సమయంలో రైతులు నమోదు చేసిన గ్రీవెన్స్‌లను పరిష్కరించాలని  కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేశారు.  అంతేకాక ప్రతివారం దీనిపై మానటరింగ్‌ చేస్తూ వచ్చారు. వ్యవసాయశాఖ జేడీ కార్యాలయానికి నేరుగా వచ్చిన సుమారు 4వేల గ్రీవెన్స్‌లను కూడా వ్యవసాయశాఖ పరిష్కరించింది. సీఎం కిసాన్‌ పోర్టల్‌లో వచ్చిన గ్రీవెన్స్‌లను పరిష్కరించడంలో దేశంలోనే జిల్లా ముందంజలో నిలవడం తో ఈ అవార్డుకు ఎంపికైంది. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా ఆర్‌పీజీఎస్‌ డేటాను సేకరించే బాధ్యతను జడ్పీ సీఈవో సుశీల నిర్వహించారు. బ్యాంకుల నుంచి సహకారం అందేలా ఎల్‌డీఎం శివప్రసాద్‌రెడ్డి కృషి చేశారు.


కలెక్టర్‌కు అవార్డు పట్ల ఏపీజీఈఏ హర్షం


నెల్లూరు(హరనాథపురం), ఫిబ్రవరి 24 : కలెక్టర్‌ చక్రధర్‌ బాబు పీఎం కిసాన్‌ అవార్డును అందుకోవడం పట్ల ఏపీజీఈఏ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు, హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించి తన కంటూ ప్రత్యేకతను చాటుకొన్న కలెక్టర్‌ అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-02-25T04:55:20+05:30 IST