పీఎం కిసాన్‌ లబ్ధికి కోతలు

ABN , First Publish Date - 2021-07-30T06:02:18+05:30 IST

ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడే పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే లబ్ధిదారుల జాబితాను తేలుస్తారు. కేంద్రానికి సంబంధించిన పథకాలకు అయినా సరే రాష్ట్రప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల జిల్లా యంత్రాంగాలే కీలకంగా వ్యవహరిస్తాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియలోనే ప్రతిదీ జరుగుతున్నప్పటికీ వాటి ధ్రువీకరణను కూడా యంత్రాంగమే చేయాల్సి ఉంటుంది. కానీ రెండు సంవత్సరాల క్రితం ఆదరాబాదరాగా వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రికార్డులతో పీఎం కిసాన్‌ పథకాన్ని అమలుచేసిందని, లోపాలను ఆలస్యంగా కేంద్రం గుర్తించిందని వారి ఆదేశాలతోనే నోటీసులు జారీచేస్తున్నామని యంత్రాంగం చెప్పే మాటలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి.

పీఎం కిసాన్‌ లబ్ధికి కోతలు

అనర్హుల ఏరివేతా...అర్హుల తీసివేతా... 

అర్హత లేకుండా  లబ్ధి పొందారంటూ హడావుడి

రెండేళ్ల తర్వాత కేంద్రం గుర్తించిందట

10,560 మంది అనర్హులుగా తేలారంటున్న యంత్రాంగం

రూ. 6.23 కోట్ల రికవరీకి అధికారుల సన్నాహాలు

ఒకవైపు అర్హులకు అందని సాయం.. 

మరోవైపు అనర్హుల పేరిట ఏరివేత

వారం రోజుల్లో అందనున్న నోటీసులు

ఒంగోలు(జడ్పీ), జూలై 29:

రైతు సంక్షేమం కోసమని పెట్టిన పథకం.. ఇప్పటివరకు ఎనిమిది విడతలుగా కొంతమందికి, ఐదు, నాలుగు, మూడు విడతలుగా మరికొంతమందికి వారి ఖాతాల్లో సొమ్ము జమ అవుతూనే ఉంది. ఏమైందో ఏమో అకస్మాత్తుగా కేంద్రప్రభుత్వానికి అనర్హులు లబ్ధిపొందుతున్నారనే అనుమానం వచ్చింది. ఆగమేఘాల మీద జిల్లా యంత్రాగానికి అనర్హులను గుర్తించండంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పదివేలమందికిపైగా రైతులు అర్హత లేకున్నా పీఎం కిసాన్‌ సాయం పొందారని తేల్చేశారు. వారందరికీ నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఇదంతా పీఎం కిసాన్‌ సాయం పథకానికి సంబంధించి జరుగుతున్న తంతు. ఈ మొత్తం ప్రక్రియలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడే పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే లబ్ధిదారుల జాబితాను తేలుస్తారు. కేంద్రానికి సంబంధించిన పథకాలకు అయినా సరే రాష్ట్రప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల జిల్లా యంత్రాంగాలే కీలకంగా వ్యవహరిస్తాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియలోనే ప్రతిదీ జరుగుతున్నప్పటికీ వాటి ధ్రువీకరణను కూడా యంత్రాంగమే చేయాల్సి ఉంటుంది. కానీ రెండు సంవత్సరాల క్రితం ఆదరాబాదరాగా వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రికార్డులతో పీఎం కిసాన్‌ పథకాన్ని అమలుచేసిందని, లోపాలను ఆలస్యంగా కేంద్రం గుర్తించిందని వారి ఆదేశాలతోనే  నోటీసులు జారీచేస్తున్నామని యంత్రాంగం చెప్పే మాటలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. కేవలం అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంఖ్యను పెంచి ఇప్పుడు తగ్గించడానికి కొత్త పల్లవి ఎత్తుకున్నారా అనే సందేహాన్ని జిల్లా రైతాంగం వ్యక్తం చేస్తోంది. అనర్హులకు ఒకసారో, రెండుసార్లో డబ్బులు పడవచ్చు. కానీ ఏకంగా ఎనిమిదిసార్లు లబ్ధిపొందాక మేల్కొన్నారంటే ఇదంతా లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి వేస్తున్న ఎత్తుగడగా రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.


అర్హులను వదిలి అనర్హుల ఏరివేత

మొత్తం  10,560 మంది అర్హత లేకున్నా పీఎం కిసాన్‌ పొందారని తేల్చేశారు. అదీకాక అనర్హులుగా తేలిన వారిలో 9,153మంది ఆదాయపు పన్ను చెల్లించేవారుగా వ్యవసాయశాఖ చెబుతోంది. పన్ను చెల్లించేవారు ఇంత పెద్దసంఖ్యలో ఆయాచిత లబ్ధిపొందారంటే ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. మరో 1,407 మందిలో  భూమిలేని వారు, మరణించిన వారు, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఇలా ఇతరత్రా కారణాలతో అనర్హులుగా తేల్చారు. అర్హులైన రైతులు నెలల తరబడి తమకు పీఎం కిసాన్‌ డబ్బులు పడలేదని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం అనర్హులను గుర్తించడంలో మాత్రం శరవేగంగా కదిలింది. వాస్తవానికి అనర్హుల ఏరివేతను స్వాగతించవలసిందే. కానీ ఆ పేరిట లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ఈ రకమైన కుయుక్తులు పన్నుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అర్హులకు లబ్ధి విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ నెలల తరబడి జాప్యం చేస్తూ రైతుల సహనానికి ప్రభుత్వాలు పరీక్షలు పెడుతూనే ఉన్నాయి.  అనర్హుల ఏరివేతను అత్యంత పారదర్శకంగా నిర్వహించి అంతే వేగంగా అర్హులను గుర్తించి వారికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తేనే లోగుట్టు ఏమీ లేదని రైతాంగం విశ్వసించేది. లేనిపక్షంలో ప్రభుత్వాలు ఏదో ఒక వంకతో లబ్ధిదారులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమంగానే రైతులు భావించే అవకాశం ఉంటుంది.


కేంద్రం గుర్తించింది ఇలా....

ఇటీవల వివిధ పథకాల లబ్ధికి కేంద్రం ఆధార్‌, పాన్‌కార్డుల అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆ క్రమంలో అనర్హులకు పీఎం కిసాన్‌ సాయం అందినట్లు గుర్తించింది. రెండు సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు హడావుడిగా లబ్ధిదారులను గుర్తించామని కేంద్రం పేర్కొంటోంది


అర్హులైన రైతులకు అందని సాయం

క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం అండదండలతో అనర్హులైన వ్యక్తులు పీఎం కిసాన్‌ సాయం పొందుతున్నారని తేల్చిన అధికారులు అర్హులైన వారి విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. అర్హులైన రైతులకు కేంద్ర సాయం ఎండమావిగానే ఉంటోంది. రాష్ట్రప్రభుత్వం రైతులకు అందించే రైతుభరోసా సాయం అందరికీ అందుతున్నా పీఎం కిసాన్‌ సాయం మాత్రం కొందరికే అందుతోంది.  నిబంధనలలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలే దీనికి కారణంగా ఉంటోంది. అర్హులైన రైతులు సాయం కోసం నానా అగచాట్లు పడుతుంటే అనర్హులైన 10,560 మంది లబ్ధి పొందారని యంత్రాంగం తేల్చడం నివ్వెరపరుస్తోంది.


రూ.6.23 కోట్ల రికవరీకి సిద్ధం

జిల్లావ్యాప్తంగా  రూ.6.23 కోట్లు అనర్హుల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమికంగా వ్యవసాయ శాఖ నిర్ధారణకొచ్చింది. అనర్హులుగా తేలిన 10,500 మందిలో 9,153మంది దాకా ఆదాయపు పన్ను చెల్లించేవారు కాగా మిగతా వారిలో చనిపోయిన తర్వాత కూడా  ఖాతాల్లో డబ్బులు జమ అవడం, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉండటం ఇలా ఇతరత్రా నిబంధనలను అతిక్రమించి ప్రయోజనం పొందారని వ్యవసాయశాఖ చెబుతోంది.


రికవరీలో యంత్రాంగం సఫలీకృతులయ్యేనా...

ప్రస్తుతానికి అయితే అనర్హులను గుర్తించే ప్రక్రియను యంత్రాగం పూర్తిచేసింది. రేపోమాపో వారికీ నోటీసులు కూడా అందజేస్తారు. అనర్హులుగా యంత్రాగం తేల్చిన వారు ఎంతమేర సొమ్ము రికవరీకి అంగీకరిస్తారో చూడాల్సి ఉంది. నోటీసులు అంటూ జారీ అయ్యాక వారు చెప్పే వివరణ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


ఆమోదం రాగానే నోటీసులు జారీచేస్తాం

నిబంధనలకు విరుద్ధంగా పీఎం కిసాన్‌ సాయం పొందిన అనర్హుల జాబితాను కలెక్టర్‌ ముందుంచాం. ఆమోదం పొందిన వెంటనే నోటీసులు జారీచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. ఈ జాబితా మొత్తం కేంద్రప్రభుత్వం పంపించిందే. మేము కేవలం మరొకసారి పరీశీలన చేపట్టాం అంతే. అర్హులైన ఏ ఒక్కరిని పీఎం కిసాన్‌ సాయం నుంచి తొలగించడం లేదు.

 -ఎస్‌. శ్రీనివాసరావు, జేడీఏ 


Updated Date - 2021-07-30T06:02:18+05:30 IST