రేపే రైతుల ఖాతాలకు పీఎం-కిసాన్ స్కీమ్ సొమ్ము

ABN , First Publish Date - 2021-08-08T17:05:50+05:30 IST

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) స్కీమ్

రేపే రైతుల ఖాతాలకు పీఎం-కిసాన్ స్కీమ్ సొమ్ము

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) స్కీమ్ 9వ విడత సొమ్మును రైతుల ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేస్తారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. 


పీఎంఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పీఎం-కిసాన్ నిధి తొమ్మిదో విడత సొమ్మును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక్కొక్క రైతుకు రూ.2,000 చొప్పున అందజేస్తారు. మొత్తం మీద 9.75 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19,500 కోట్లు విడుదల చేస్తారు. మోదీ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారు.


ఈ పథకం క్రింద ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ సొమ్మును మూడు సమాన వాయిదాల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఇప్పటి వరకు రైతులకు రూ.1.38 లక్షల కోట్లు అందజేసింది. 



Updated Date - 2021-08-08T17:05:50+05:30 IST