కర్షకులూ కపట శాసనాలూ

ABN , First Publish Date - 2020-09-26T05:58:36+05:30 IST

మోదీ ప్రభుత్వం చేపట్టిన ఏ చర్యలు ప్రజలకు మేలు చేశాయి? 2016లో నోట్ల రద్దు ఒక వినాశనకర చర్య. 2017–-18 నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సమర్థంగా, సక్రమంగా ఉండడం లేదు....

కర్షకులూ కపట శాసనాలూ

మోదీ ప్రభుత్వం చేపట్టిన ఏ చర్యలు ప్రజలకు మేలు చేశాయి? 2016లో నోట్ల రద్దు ఒక వినాశనకర చర్య. 2017–-18 నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సమర్థంగా, సక్రమంగా ఉండడం లేదు. ఇప్పుడు చట్టాలు కాబోతున్న వ్యవసాయ బిల్లులు రైతుల శ్రేయస్సును మరింత దెబ్బ తీస్తాయి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దుర్బలపరుస్తాయి. అంతేకాదు, అవి రాష్ట్రాల హక్కులను హరించి వేసి, సమాఖ్య పాలనా విధానాన్ని బలహీనపరుస్తాయి.


‘కర్షకా! నీ కఱ్ఱు కదలినన్నాళ్ళే... రాజుల రాజ్యాలు’ అని ఒక కవి అన్నారు. మరి రైతు తన పొలంలో ఇవాళ నాగలితో నిలబడే పరిస్థితి ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు ఈ ప్రశ్నను వేసుకోవల్సిన పరిస్థితిని కల్పించలేదూ? 


రైతులు తమ పంటలను ఎలా విక్రయించుకుంటున్నారో చూడండి. జాతీయ నమూనా సర్వే ప్రకారం 2012 జూలై---–-డిసెంబర్ మాసాల మధ్య, లేదా 2013 జనవరి–-జూన్ మాసాల మధ్య వివిధ ఏజెన్సీలు రైతుల నుంచి చేసిన కొనుగోళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి: వరి ధాన్యాన్ని స్థానిక ప్రైవేట్ వ్యాపారులు 65.94 శాతాన్ని, మండీలు 19.46 శాతాన్ని, ప్రభుత్వ సంస్థలు, సహకారసంఘాలు 9.49 శాతాన్ని కొనుగోలు చేశాయి. గోధుమ లను స్థానిక ప్రైవేట్ వ్యాపారులు 58.42 శాతాన్ని, మండీలు 34.78 శాతాన్ని, ప్రభుత్వ సంస్థలు సహకారసంఘాలు 6.79 శాతాన్ని కొనుగోలు చేశాయి. ఈ రెండు ప్రధాన ఆహారధాన్యాలనే కాదు మొక్కజొన్నలు, ఆవాలు, శనగలు మొదలైన పంటలను సైతం రైతులు అత్యధికంగా స్థానిక ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకున్నారు. 


 వివిధ రాష్ట్రాలలో వేర్వేరు వ్యవసాయక ఉత్పత్తి మార్కెట్ కమిటీల (ఎపిఎమ్‌సి) చట్టాలు దశాబ్దాలుగా అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులు తమ పంటలను అత్యధికంగా స్థానిక ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. వరి, గోధుమను సాగు చేసే రైతులలో దాదాపు 60 శాతం మంది తమ ధాన్యాన్ని వారికే విక్రయించుకుంటున్నారనేది స్పష్టం. అధికారిక బోగట్టా ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1.24కోట్ల మంది వరి రైతులు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో 43.35లక్షల మంది గోధుమ సాగుదారులు మాత్రమే కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందారు.


ఇందుకు కారణాలు ఏమిటో స్పష్టమే. మన రైతులలో 85 శాతం మంది భూకమతాలు చాలా చిన్నవి. అవి ఒక హెక్టారు కంటే తక్కువ. కనుక విక్రయించుకోవడానికి వారికి మిగులు ధాన్యమనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నా ఆ మిగులును సుదూరాన ఉండే ఎపిఎమ్‌సి మార్కెట్‌యార్డుకు తీసుకువెళ్ళి విక్రయించడమనేది ఆ సన్నకారు చిన్నకారు రైతులకు లాభసాటి వ్యవహారం కాబోదు. ధాన్యాన్ని గోతాలలో నింపడం, ఆ బస్తాలను వాహనాలలోకి చేర్చి రవాణా చేయడం, మార్కెట్‌యార్డులో వాటిని దించడం, తమ వంతు వచ్చేదాకా వేచిఉండడం, ఫీజు చెల్లించడం, రెండు లేదా అంతకు మించిన రోజుల పాటు వేచిఉండి ధరలు వసూలు చేసుకోవడం అనేది చిన్న రైతులకు సాధ్యం కాని పని. మార్కెట్‌యార్డులో అమ్ముకోవడమనేది వారికి ఎంత మాత్రం ఆచరణీయం కాదు. ఈ కారణంగానే వారు స్థానిక ప్రైవేట్ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. ఆ వ్యాపారులూ రైతుకు విశ్వసనీయంగా తోడ్పడుతున్నారు. రైతులు నూర్పిళ్ళు అయిన తక్షణమే పంట కళ్ళాలలోనే తమ ధాన్యాన్ని స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువే అయితేనేం ఆ వ్యాపారులు తాము ఇచ్చే ధరను పొలంలోనే రైతులకు చెల్లిస్తున్నారు. ఇది ఉభయులకూ పరస్పర ప్రయోజనకరంగా ఉంది. 


పంజాబ్, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలలో ఎపిఎమ్‌సి మార్కెట్‌యార్డులు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. ఆ రాష్ట్రాలలో చిన్న రైతు వద్ద కూడా మిగులు ధాన్యం గణనీయమైన స్థాయిలో ఉండడం కద్దు. ఈ రెండు రాష్ట్రాలలోనూ ఉత్పత్తి అయ్యే వరి, గోధుమలో 75 శాతాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే కొనుగోలు చేస్తుంటాయి. ఇతర రాష్ట్రాలలో మార్కెట్‌యార్డులు సరిపడా సంఖ్యలో లేవని, ఉన్నవి కూడా రైతులకు సుదూరంలో ఉంటున్నాయని కొంత మంది ఆర్థికవేత్తలు వాదించడం కద్దు. ఉదాహరణకు తమిళనాడులో జిల్లాకు సగటున 8 చొప్పున 36 జిల్లాల్లో 283 మార్కెట్‌యార్డులు ఉన్నాయి. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో ఈ 283 మార్కెట్‌యార్డులలో మొత్తం రూ.219.76 కోట్ల వ్యాపారం జరిగింది. మహారాష్ట్రలో మొత్తం 326 మార్కెట్‌యార్డులు ఉన్నాయి. రైతులు తమ పంటలను వాటికి తీసుకువెళ్ళేందుకు సగటున 25 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.


వ్యవసాయ ఉత్పత్తులలో స్వేచ్ఛావాణిజ్యానికి ఎపిఎమ్‌సి చట్టాలు పరిమితులు విధిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే మార్కెట్‌యార్డులు భద్రతా కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. పంజాబ్, హర్యానాలలో మార్కెట్‌యార్డ్‌ల వద్ద వసూలు చేస్తున్న ఫీజు రూపేణా ఆ రాష్ట్రాలకు పెద్దఎత్తున ఆదాయం సమకూరుతున్నది. ఆ రాబడిని వ్యవసాయ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పంజాబ్, హర్యానాలు వినియోగిస్తున్నాయి. అయినప్పటికీ కాలక్రమేణా ఎపిఎమ్‌సి చట్టాలను త్యజించవలసి ఉందని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. రైతులకు సులువుగా అందుబాటులో ఉండే మార్కెట్ల ఆధారంగా సాగే స్వేచ్ఛావాణిజ్యానికి అనుకూలంగా ఎపిఎమ్‌సి చట్టాలకు చెల్లుచీటీ రాయవలసివుంది. 


2019 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్పాదకాలు, నవీన సాంకేతికతలు, మార్కెట్లు రైతులకు అందుబాటులో ఉండేలా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, సంస్థలను ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే పెద్ద గ్రామాలలోనూ, చిన్న పట్టణాలలోనూ సంపూర్ణ సదుపాయాలతో మార్కెట్లను నెలకొల్పతామని’ కూడా అది అది హామీ ఇచ్చింది. రైతులు తమ ఉత్పత్తులను తీసుకువచ్చి స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు అన్ని విధాల మద్దతు, తోడ్పాటు అందిస్తామని కాంగ్రెస్ స్పష్టంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా వేలాది మార్కెట్లను నెలకొల్పుతామనేది కాంగ్రెస్ హామీలోని ఒక ముఖ్యాంశం. ఆ మార్కెట్లను రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పంచాయత్, ఒక సహకార సంఘం లేదా ఒక ప్రైవేట్ లైసెన్స్‌డ్ ఆపరేటర్ ఎవరైనా నెలకొల్పవచ్చని కూడా పార్టీ స్పష్టం చేసింది. ఆ మార్కెట్లను సమగ్రంగా పటిష్ఠంగా క్రమబద్ధీకరిస్తామని, ప్రతి లావాదేవీ కూడా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతుధర కంటే తక్కువగా ఉండకుండా పటిష్ఠచర్యలు చేపడతామని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేసింది. సులభంగా అందుబాటులో ఉండే బహుళ మార్కెట్ల ఏర్పాటుకు సహజ పర్యవసానంగా ఎపిఎమ్‌సి చట్టాల రద్దును ప్రతిపాదించింది. 


మరి మోదీ ప్రభుత్వం చేసిందేమిటి? కొత్త వ్యవసాయ బిల్లులు ఎమ్‌ఎస్‌పి భద్రతా కవచాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ సేకరణ విధానాన్ని నీరుగార్చి వేస్తున్నాయి. కనుకనే రైతులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. అసలు కనీస మద్దతు ధరను పూర్తిగా రద్దు చేస్తుందేమోనని కూడా రైతులు భయపడుతున్నారు. కొత్త బిల్లుల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ అపాయంలో పడవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఆ వ్యవస్థే లేకపోతే సామాన్య ప్రజల ఇబ్బందులు మరింత మిక్కుటమవుతాయనడంలో సందేహం లేదు. కనీస మద్దతుధర, ప్రభుత్వ సేకరణ విధానం, ప్రజాపంపిణీ వ్యవస్థ ఆహారభద్రతకు విశేషంగా తోడ్పడుతున్నాయి. ఇవి బలహీనపడితే జాతీయ ఆహారభద్రతా చట్టం- 2013 కింద సృష్టించిన  వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇది ఖాయం. 


మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు వేలాది ప్రత్యామ్నాయ మార్కెట్లను సృష్టించవు. అందుకు బదులుగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అనుమతించనున్నాయి. తద్వారా దేశ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశానికి, అంతిమంగా కార్టెల్స్ ప్రవేశానికి విశాలమైన బాటలు వేయనున్నాయి. కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేసినప్పుడు వాటితో చిన్నరైతులు సమర్థంగా బేరసారాలు చేయలేరు. సరైన విధంగా కాంట్రాక్టులూ కుదుర్చుకోలేరు. ఒకవేళ కుదుర్చుకోగలిగినా సహజంగా తలెత్తే వివాదాలను పరిష్కరించుకునే విధివిధానాలు కొత్తచట్టాల కింద రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. రైతులు అన్ని విధాల నష్టపోతారు. 


కనీస మద్దతుధరతో కొత్త వ్యవసాయ బిల్లులకు ఎలాంటి ప్రమేయం లేదని పార్లమెంటులో వ్యవసాయ మంత్రి చెప్పారు. ఇది అక్షరాలా నిజం. ప్రభుత్వం రైతులకు కనీస మద్దతుధర లభించేలా చూసేందుకు హామీ పడుతుందని మంత్రి అన్నారు. చిత్తశుద్ధిలేని హామీలతో రైతులు ప్రయోజనం పొందుతారా? ఏ రైతు ఏ ధాన్యాన్ని ఏ కొనుగోలుదారుకు విక్రయిస్తాడో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ప్రతి ప్రైవేట్ లావాదేవీలోనూ కనీస మద్దతుధరను తప్పనిసరి చేసే సంకల్పం ప్రభుత్వానికి ఉందా? ఉంటే రైతుకు కొనుగోలుదారు చెల్లించే ధర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతుధర కంటే తక్కువగా ఉండడానికి వీలులేని విధంగా కొత్త వ్యవసాయ బిల్లులో ఎటువంటి నిబంధన ఎందుకు లేదు? 


 ఇంతకూ మోదీ ప్రభుత్వం చేపట్టిన ఏ చర్యలు ప్రజలకు మేలు చేశాయి? 2016లో నోట్ల రద్దు ఒక వినాశనకర చర్య. 2017–-18 నుంచి ఆర్థికవ్యవస్థ నిర్వహణ సమర్థంగా, సక్రమంగా ఉండడం లేదు. అన్ని రంగాలూ సర్వనాశనమవుతున్నాయి. ఇప్పుడు చట్టాలు కాబోతున్న  వ్యవసాయ బిల్లులు రైతుల శ్రేయస్సును మరింత దెబ్బతీస్తాయి. వ్యవసాయ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా దుర్బలపరుస్తాయి. అంతేకాదు, అవి రాష్ట్రాల హక్కులను హరించివేస్తాయి. సమాఖ్య పాలనా విధానాన్ని బలహీనపరుస్తాయి. సకల ప్రజలను సర్వవేళల మూర్ఖులను చేసి స్వప్రయోజనాలను సాధించుకోవచ్చని మోదీ సర్కార్ విశ్వసిస్తుందనేది స్పష్టం.





(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

పి. చిదంబరం

Updated Date - 2020-09-26T05:58:36+05:30 IST