గత ప్రభుత్వాల వల్ల బుందేల్‌ఖండ్‌ ధ్వంసం : మోదీ

ABN , First Publish Date - 2021-11-20T00:33:37+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని

గత ప్రభుత్వాల వల్ల బుందేల్‌ఖండ్‌ ధ్వంసం : మోదీ

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు వంతులవారీగా ధ్వంసం చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అడవులు, వనరులను మాఫియాకు అప్పగించారనే విషయాన్ని ఎవరూ దాచలేరని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నవారు బుందేల్‌ఖండ్‌ పట్ల వ్యవహరించిన తీరును ఎవరూ మర్చిపోలేరన్నారు. నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


బోరు బావుల పేరుతో గతంలో చాలా జరిగిందని, భూగర్భ జలాలు లేకుండా ఆ బావుల నుంచి నీరు ఎలా వస్తుందో గత ప్రభుత్వాలు చెప్పలేదని అన్నారు. ఇప్పుడు మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే, కొందరు గగ్గోలు పెడుతున్నారన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్ అభివృద్ధి ఆగదని చెప్పారు. గతంలో నీటి పరిరక్షణకు ఉదాహరణగా నిలిచిన ప్రాంతం నీటి సమస్యలతో, వలసపోయేవారి కేంద్రంగా ఎలా మారిందనేదే ప్రశ్న అన్నారు. ఈ ప్రాంతంలోని అమ్మాయిలకు ఫెళ్లి ఎందుకు చేయలేకపోతున్నారని, నీరు లభించే ప్రాంతంలోనివారిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడ అమ్మాయిలు ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. కుటుంబ పాలకుల ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉత్తర ప్రదేశ్ గ్రామాలను దాహంతో అలమటించేలా చేశాయని, కర్మ యోగి ప్రభుత్వం రెండేళ్ళలోనే 30 లక్షల మందికి కొళాయి నీటిని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.  


Updated Date - 2021-11-20T00:33:37+05:30 IST