రుణాల కోసం వారు రావడం కాదు, మీరే వెళ్లి ఇవ్వండి... బ్యాంకర్లకు మోదీ దిశానిర్దేశం...

ABN , First Publish Date - 2021-11-18T22:26:06+05:30 IST

పాత కాలం పద్ధతులను వదులుకుని, అభివృద్ధిలో కస్టమర్లను

రుణాల కోసం వారు రావడం కాదు, మీరే వెళ్లి ఇవ్వండి... బ్యాంకర్లకు మోదీ దిశానిర్దేశం...

న్యూఢిల్లీ : పాత కాలం పద్ధతులను వదులుకుని, అభివృద్ధిలో కస్టమర్లను భాగస్వాములను చేయాలని బ్యాంకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ‘‘ఆమోదించేవారు-దరఖాస్తుదారు’’ అనే పాత పద్ధతిని పక్కనబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సమ్మిళిత చర్యలకు మద్దతిస్తూ, చిన్న తరహా పరిశ్రమలకు చురుగ్గా వెన్నుదన్నుగా నిలవాలని చెప్పారు. దేశం సమ్మిళితంగా ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం నూతన ఆలోచనల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. 


ఆర్థికాభివృద్ధి, ఆటంకాలు లేని రుణ ప్రవాహం కోసం వేర్వేరు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు, సహకారాన్ని సృష్టించడంపై జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ఆరు, ఏడు సంవత్సరాల నుంచి చేపడుతున్న అనేక సంస్కరణల వల్ల భారత దేశ బ్యాంకింగ్ రంగం బలోపేతమైందని చెప్పారు. లక్షలాది మంది పేదలకు వారి జన్‌ ధన్ ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేసి, తక్షణ సాయం అందజేయడం సాధ్యమైందని చెప్పారు. 


తన ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల తెర మరుగున ఉన్న భారీ నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)ను వెలికి తీయగలిగామని చెప్పారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారి నుంచి రూ.5 లక్షల కోట్లు రాబట్టగలిగినట్లు తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా మరొక రూ.2 లక్షల కోట్ల స్ట్రెస్‌డ్ అసెట్స్‌ సమస్యను పరిష్కరిస్తామన్నారు. 


నిరర్థక ఆస్తుల సమస్యను పారదర్శకంగా పరిష్కరించడం, రీక్యాపిటలైజింగ్ చేయడం ద్వారా బ్యాంకులను తన ప్రభుత్వం బలోపేతం చేసిందన్నారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్ ఓ పరివర్తక శాసనమని చెప్పారు. ‘‘నేడు భారతీయ బ్యాంకులు ఎంతగా బలపడ్డాయంటే, అవి దేశ ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేయగలిగే   స్తోమతను సంపాదించాయన్నారు. భారత దేశం స్వయం సమృద్ధమవడంలో బ్యాంకులు విస్తృత స్థాయిలో తమ వంతు పాత్రను పోషించగలవని తెలిపారు. కస్టమర్లు బ్యాంకులను సందర్శించే వరకు వేచి చూడకుండా, బ్యాంకులే ఆర్థికావసరాలుగలవారికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. 


‘‘మీరు అనుమతి ఇచ్చేవారు, మీ ముందు కూర్చున్నవారు దరఖాస్తుదారు అనే భావనను మీరు విడిచిపెట్టాలి. బ్యాంకులు భాగస్వామ్య నమూనాను సొంతం చేసుకోవాలి’’ అని చెప్పారు. 


Updated Date - 2021-11-18T22:26:06+05:30 IST