కరోనాపై పోరులో..స్ఫూర్తి నింపండి!

ABN , First Publish Date - 2020-04-04T09:43:09+05:30 IST

కరోనాపై యుద్ధంలో కలిసి రావాలని ప్రధాని మోదీ దేశ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిపై భారత్‌ యావత్తూ పోరాడుతోందని..ఇందులో ...

కరోనాపై పోరులో..స్ఫూర్తి నింపండి!

ఐదు అంశాలతో ప్రచారం చేయండి

క్రీడాకారులకు ప్రధాని మోదీ పిలుపు


న్యూఢిల్లీ : కరోనాపై యుద్ధంలో కలిసి రావాలని ప్రధాని మోదీ దేశ  క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిపై భారత్‌ యావత్తూ పోరాడుతోందని..ఇందులో ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ తరుణంలో మీరు (క్రీడాకారులు)నింపే స్ఫూర్తితో కొవిడ్‌-19పై సమరంలో దేశమంతా మరింత చైతన్యమవుతుందన్నారు. కరోనాపై క్రీడాకారులతో చర్చించేందుకు క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆటగాళ్ల సలహాలు, సూచనలు కోరారు. సుమారు 40 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. అయితే క్రీడాకారుల్లో కొద్దిమందికి మాత్రమే ఒక్కొక్కరికి మూడేసి నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రధానితో మాట్లాడిన వారిలో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, సౌరవ్‌ గంగూలీ, పీవీ సింధు, అథ్లెట్‌ హిమాదాస్‌, మహిళా హాకీ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి అంకితా  రైనా, కబడ్డీ ఆటగాడు అజయ్‌ ఠాకూర్‌, పారా అథ్లెట్‌ శరద్‌ కుమార్‌ తదితరులున్నారు. కాగా..కరోనాపై పోరాటానికి ప్రధాని చేపడుతున్న చర్యలను క్రీడాకారులంతా ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ. ‘మీ సూచనలు స్వీకరిస్తాం. టీమిండియా మాదిరి ప్రస్తుతం కరోనాపై పోరాడుతున్నాం. మీ స్ఫూర్తితో భారత్‌  కొత్త బలం సంతరించుకుంటుందన్న నమ్మకం నాకుంది’ అని అన్నారు. ‘క్రీడల్లో దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఈ ఆపత్కాలంలో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడంలో మీ పాత్ర చాలా కీలకం’ అని పేర్కొన్నారు. ‘సంకల్పం, సంయమనం, సానుకూలత, గౌరవం, సహకారం అనే ఐదు అంశాలతో ప్రజలకు సందేశాలివ్వండి. అలాగే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన విషయాన్ని, భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పండి. ఇంకా.. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచనలను పాటించాలని కూడా విజ్ఞప్తి చేయండి’ అని ప్రధాని సూచించారు. ఈమేరకు ప్రధాని సమావేశ ఫొటోను స్టార్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాగా ధోనీ, కేఎల్‌ రాహుల్‌, బైచుంగ్‌ భూటియా, మేరీకోమ్‌ తదితరులను ఆహ్వానించినా ఇంటర్నెట్‌ కనెక్టవిటీ తదితర సాంకేతిక సమస్యలవల్ల పాల్గొనలేకపోయారు.


కోహ్లీలా పోరాడాలి..

కరోనాపై యుద్ధంలో గెలవాలంటే కోహ్లీ మాదిరి పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారని, అలాగే భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని ప్రచారం చేయాలని కోరారని వెటరన్‌ టీటీ ఆటగాడు శరత్‌ కమల్‌ వెల్లడించాడు. 


ఆశావహ దృక్పథంతో ఉండాలి..

ఆశావహ దృక్పఽథంతో ఉండాలని, ప్రజల్లో సానుకూల అంశాలను ప్రచారం చేయాలని మోదీ సూచించారని షూటర్‌ అభిషేక్‌ వర్మ తెలిపాడు. కొవిడ్‌-19పై మరింత సమర్థంగా పోరాడేందుకు కావాల్సిన సూచనలు చేయాలని కోరారని చెప్పాడు. 


14 తర్వాత కీలకం: సచిన్‌

కరోనాపై యుద్ధంలో ఈనెల 14 తర్వాతి సమయం ఎంతో కీలకమని సచిన్‌ అన్నాడు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా చెప్పినట్టు తెలిపాడు. ‘14 తర్వాత దేశ ప్రజలు ఎంత సంయమనం పాటిస్తారనేది అత్యంత ముఖ్యమైన అంశం. లాక్‌డౌన్‌ ఫలితాలు అప్పుడే తెలుస్తాయని నేను చెప్పిన విషయంతో ప్రధాని కూడా ఏకీభవించారు’ అని మోదీతో సమావేశం అనంతరం టెండూల్కర్‌ తెలిపాడు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాక కూడా షేక్‌హ్యాండ్‌ కాకుండా.. ‘నమస్తే’తోనే ఇతరులను పలకరించాలని సూచించాడు. ‘లాక్‌డౌన్‌లో శారీరకంగా, మానసికంగా బలంగా ఉండడం ఎంత ముఖ్యమో ప్రధానికి చెప్పాం. ఫిట్‌గా ఉండేందు కు నేను తీసుకుంటున్న చర్యలను వివరించా’ అని సచిన్‌ తెలిపాడు. 


మీ చర్యలకు కృతజ్ఞతలు: సింధు

దేశంలో కరోనా విజృంభిస్తోందని, దాని నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపినట్టు పీవీ సింధు వెల్లడించింది. కరోనా కట్టడికి ఆయన తీసుకొనే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపానని చెప్పింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండేలా కట్టడిచేస్తున్న పోలీసు శాఖకు ఈ సందర్భంగా సింధు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే రైళ్లను ఐసోలేషన్‌ వార్డులుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం కూడా అద్భుతమని కొనియాడింది.

Updated Date - 2020-04-04T09:43:09+05:30 IST