ఆఫ్ఘన్ ఉగ్రవాద కేంద్రం కాకుండా నిరోధించాలి : మోదీ

ABN , First Publish Date - 2021-10-13T02:40:40+05:30 IST

రాడికలైజేషన్, ఉగ్రవాదాలకు కేంద్రంగా ఆఫ్ఘనిస్థాన్ మారకుండా

ఆఫ్ఘన్ ఉగ్రవాద కేంద్రం కాకుండా నిరోధించాలి : మోదీ

న్యూఢిల్లీ : రాడికలైజేషన్, ఉగ్రవాదాలకు కేంద్రంగా ఆఫ్ఘనిస్థాన్ మారకుండా నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఆ దేశంలో వాంఛనీయ మార్పు తేవడానికి ప్రపంచం సమైక్యంగా స్పందించాలన్నారు. మంగళవారం ఆయన ఆఫ్ఘనిస్థాన్‌పై జీ20 ఎక్స్‌ట్రార్డినరీ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడారు. 


ఆఫ్ఘన్ ప్రజలకు అత్యవసరంగా, నిరంతరాయ మానవతావాద సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ఆ దేశంలో సమ్మిళిత ప్రభుత్వం అవసరమని చెప్పారు. ఆ దేశంలో పరిస్థితిని మెరుగుపరచాలంటే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593కు అనుగుణంగా అంతర్జాతీయ సమాజం సమైక్యంగా స్పందించాలన్నారు. 


భారత దేశం అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఓ తీర్మానం ఆమోదం పొందింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మానవ హక్కులను సమర్థించవలసిన అవసరం ఉందని ఈ తీర్మానం తెలిపింది. ఆ దేశ గడ్డను ఉగ్రవాదం కోసం ఉపయోగించుకోరాదని డిమాండ్ చేసింది. ప్రస్తుత సంక్షోభానికి చర్చల ద్వారా రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని పిలుపునిచ్చింది. 


ఆకలి, పోషకాహార లోపంతో ఆఫ్ఘన్లు బాధపడుతుండటం పట్ల ప్రతి భారతీయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-10-13T02:40:40+05:30 IST