ఇది నాకు లభించిన ఆత్మీయ బహుమతి : మోదీ

ABN , First Publish Date - 2021-11-13T21:10:54+05:30 IST

ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో

ఇది నాకు లభించిన ఆత్మీయ బహుమతి : మోదీ

న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో జరిగిన ఓ అపురూప సంఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శనివారం గుర్తు చేసుకున్నారు. తనకు పద్మశ్రీ పురస్కార గ్రహీత బిరేన్ కుమార్ బసక్ ఇచ్చిన ప్రత్యేక బహుమతి అత్యంత విలువైనదని, ఇది తనకు గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. 


పద్మ పురస్కారాల ప్రదానోత్సవం నవంబరు 8న రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన చేనేతకారుడు బిరేన్ కుమార్ బసక్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బిరేన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. బిరేన్ ఓ చీరను మోదీకి బహూకరించారు. ప్రజలతో మోదీ మాట్లాడుతున్నట్లుగా ఈ చీరపై ముద్రించారు. ఈ బహుమతిని మోదీ శనివారం ఓ ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు.  


‘‘శ్రీ బిరేన్ కుమార్ బసక్ పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందినవారు. ఆయన సుప్రసిద్ధ చేనేతకారుడు. తాను నేసిన చీరల్లో భారత దేశ చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన వివిధ అంశాలను చూపుతారు. పద్మ పురస్కార గ్రహీతలతో నేను మాట్లాడినపుడు, ఆయన నాకు ఒకటి ఇచ్చారు, అది నన్నెంతో అబ్బురపరిచింది’’ అని మోదీ ట్వీట్ చేశారు. బిరేన్‌తో మోదీ సంభాషిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. 


ప్రజలతో మోదీ మాట్లాడుతున్నట్లుగా ఓ డిజైన్‌తో కూడిన చీరను మోదీకి బిరేన్ బహూకరించారు. ఆయన 1970వ దశకంలో కేవలం ఒక రూపాయితో వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం సంవత్సరానికి రూ.25 కోట్లు టర్నోవర్‌తో ఆయన వ్యాపారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, క్రికెటర్ సౌరవ్ గంగూలీ, గాయనీమణులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటివారు ఆయన వద్ద వస్త్రాలు కొంటున్నారు.


ఈ ఏడాది 119 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వీరిలో 102 మందికి పద్మశ్రీ, 10 మందికి పద్మ భూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. 


Updated Date - 2021-11-13T21:10:54+05:30 IST