గవర్నర్లతో ప్రధాని కీలక భేటీ.. కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌పై చర్చ

ABN , First Publish Date - 2021-04-15T03:42:28+05:30 IST

దేశంలో అన్ని ప్రాంతాలకూ సరిపడా వ్యాక్సిన్లను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా విపరీతంగా వ్యాప్తి చేశామని, కొత్త వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని..

గవర్నర్లతో ప్రధాని కీలక భేటీ.. కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌పై చర్చ

న్యూఢిల్లీ: దేశంలో అన్ని ప్రాంతాలకూ సరిపడా వ్యాక్సిన్లను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా విపరీతంగా వ్యాప్తి చేశామని, కొత్త వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, అలాగే రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ డ్రైవ్‌పై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, తమ ప్రాంతాల్లోని సామాజిక సంస్థలు.. ప్రభుత్వాలతో కలిసి కరోనా నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. 


కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలలో మైక్రో కంటెయిన్‌మెంట్ విధానాలను అవలంబించేలా చూడాలని సూచనలు చేశారు. అలాగే ఈసారి కూడా గతేడాదిలానే వ్యాక్సిన్ పంపిణీలో ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంలో గవర్నర్ల పాత్ర చాలా కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆయా రాష్ట్రాల్లోని సంస్థలతో సంస్థలను సరైన మార్గంలో నడపడం వల్ల దేశం సమస్యలనుంచి బయటపడుతుందని పేర్కొన్నారు.


కరోనా వ్యాక్సినేషన్‌, వైద్య విధానాల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయడమే కాకుండా, ఆయుష్ ఔషధ విధానాల గురించి కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. అంతేకాకుండా కరోనాపై యుద్ధంలో అన్ని రకాల బేధభావాలను పక్కనపెట్టి.. రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సామాజిక సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజా సమూహాలు.. అన్నీ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-04-15T03:42:28+05:30 IST