రగిలిన రైతుజనం

ABN , First Publish Date - 2020-12-04T05:42:24+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ ఇతరులకంటే ప్రజల అత్యంత ప్రియతమ నాయకుడిగా ఉన్నారు. వ్యక్తిగత ప్రజాదరణ అనేది ప్రతి అంశం పైన శాశ్వత, సుస్థిర మద్దతుకు పూచీ ఇవ్వదు. నూతన చట్టాలు తీసుకువచ్చే ముందు వాటి ఆవశ్యకత...

రగిలిన రైతుజనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ ఇతరులకంటే ప్రజల అత్యంత ప్రియతమ నాయకుడిగా ఉన్నారు. వ్యక్తిగత ప్రజాదరణ అనేది ప్రతి అంశం పైన శాశ్వత, సుస్థిర మద్దతుకు పూచీ ఇవ్వదు. నూతన చట్టాలు తీసుకువచ్చే ముందు వాటి ఆవశ్యకత, విస్తృత ప్రయోజనాల విషయంలో జనామోదాన్ని సాధించడం శ్రేయస్కరం. కొత్త సాగుచట్టాల పర్యవసానాల గురించి నేడు రైతులు భయపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరి రేపు వాటి వల్ల ఎవరు చిక్కుల్లో పడి చింతించవలసివస్తుందో ఎవరికి తెలుసు?


‘ఈనిరసనకారులు ఎవరు? రోడ్లను దిగ్బంధం చేసి పౌర జీవనానికి ఆటంకం కల్పిస్తున్న వీరు నిజంగా రైతులేనా?’- ప్రైమ్‌టైమ్ న్యూస్ టీవీలో పలువురు అడిగే ప్రశ్న ఇది. వారి స్వరంలో అపనమ్మకం, అవహేళన మిళితమై లేవూ? ఎందుకో? అద్దాల సౌధాలు లేదా టీవీ స్టూడియోలకే పరిమితమయిన వారి నుంచి వచ్చిన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.


సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరిన ఆ ఆందోళనకారులు కాంగ్రెస్ ప్రాయోజిత మూకలు అని ప్రభుత్వ ప్రతినిధులు ఘంటాపథంగా ఘోషిస్తున్నారు. ఈ పుణ్యభూమిని ముక్కలు చెక్కలు చేసేందుకు సంకల్పించిన ఖలిస్థాన్ ఉద్యమ సానుభూతిపరులే ఆ పోరాటకారులు అని బీజేపీ సామాజిక మాధ్యమాల యోధులు సూచిస్తున్నారు. నిజమేమిటి? రైతుల ఆందోళనను కనీసం ఒక వారం రోజుల పాటు అయినా నిర్వహించగల ఆర్థిక వనరులు, సంస్థాగత సామర్థ్యమూ కాంగ్రెస్‌కే ఉంటే పార్లమెంటులో ఆ పార్టీ బలం కేవలం 52 మంది ఎంపీలకే ఎందుకు పరిమితమవుతుంది? పొలాలను వదిలి పోరాటంలోకి దూకిన రైతులు ఖలిస్థానీలా? శోచనీయం. గర్హనీయం.


ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అన్నీ స్వతస్సిద్ధంగా జాతి వ్యతిరేకమైనవనే వక్ర, వికృత మనస్తత్వానికి ఆ అపనింద ఒక తార్కాణం. భింద్రేన్‌వాలే రక్తపంకిల వారసత్వాన్ని ఒక గుప్పెడు మంది ఇంకా సమర్థిస్తున్నందున పంజాబ్‌కు చెందిన చిన్న, పెద్ద రైతు సంఘాలు సిక్కు వేర్పాటువాద సంస్థలని విమర్శించడం సమంజసమేనా? తాను దుక్కి దున్ని, పంటలు సాగు చేసే భూమితో పంజాబ్ జాట్ రైతుకి ఉన్న అనుబంధం గుజరాతీ మధ్యతరగతి సామాజికవర్గాలకు స్టాక్‌మార్కెట్‌తో ఉన్న సంబంధం లాంటిదే కాదూ? స్టాక్‌మార్కెట్ సంస్కరణలను తీసుకురండి. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్ మొదలైన గుజరాత్ నగరాలు, పట్టణాలలో అప్పుడు వచ్చే ప్రతిస్పందనలేమిటో గమనించండి.


సరే, మళ్ళీ అసలు ప్రశ్నకు వద్దాం. ‘ఈ నిరసనకారులు ఎవరు?’- రక్తాన్ని గడ్డ కట్టించే చలిని లెక్క చేయకుండా దేశ రాజధానిలో వారు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారు అతి సామాన్య భారతీయులు. తమ సంప్రదాయ కృషీవల జీవితాన్ని విచ్ఛిన్నం చేసే కొత్త చట్టాల విషయమై వారు కలవరపడుతున్నారు. ఆవేదనతో ఆందోళనకు దిగిన ఆ పల్లె భారతి ప్రజలందరూ పేదలని ఎవరూ భావించనవసరం లేదు. ఎందుకంటే పంజాబ్‌లో ప్రతి రైతుకి సగటున 3.7 హెక్టార్ల సాగుభూమి ఉంది. ఇది జాతీయ సగటు కంటే అధికం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వారి జీవితాలను ధ్వంసం చేసేవి కూడా కావు. నిజానికి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలలో దళారీ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా వారికి ఎనలేని లబ్ధిని సమకూర్చేవి అని చెప్పవచ్చు.


మరెందుకు ఆందోళన అంటే ఆ కొత్త చట్టాలను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకురావడమే అని చెప్పి తీరాలి. పంజాబ్ రైతులు దశాబ్దాలుగా తాము పండించే వరి, గోధుమ ధాన్యాల విక్రయాలకు కష్టమో, నష్టమో ఒక నిర్దిష్ట పద్ధతికి అలవాటు పడి ఉన్నారు. కొత్త సాగు చట్టాలు ఆ సువ్యవస్థిత పద్ధతిని విచ్ఛిన్నం చేస్తాయని, తమ భవిష్యత్తు అనిశ్చితమని ఆ రైతులు విశ్వసిస్తున్నారు. తత్కారణంగానే వారు ఢిల్లీకి తరలివచ్చారు. 


నిరంకుశ పాలన సాగించే ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించరు. అనివార్యంగా వ్యతిరేకిస్తారు. చర్చలు, సంప్రదింపులు లేకుండా ఫర్మానాలు జారీచేయడం, వాటిని అమలుపరచడమే మోదీ పాలన, సంస్కరణల నమూనా! నోట్లరద్దు లాంటి విధ్వంసక చర్యను ఆయన ఎలా చేపట్టారో గుర్తుచేసుకోండి. జాతీయ రాజధాని నడిబొడ్డు ప్రాంతపు రూపురేఖలు మార్చివేసే నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. జాతి జీవనాన్ని ప్రభావితం చేసిన, ప్రభావితం చేసే నిర్ణయాలను ఆయన రాజ్యాంగ వ్యవస్థల తోడ్పాటుతో తీసుకుంటున్నారా? జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370 రద్దు విషయంలో గానీ, పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడంలో గానీ మన పాలకులు ఎలా వ్యవహరించారో మరచిపోగలమా? ప్రతి సందర్భంలోనూ వ్యక్తమయిన భిన్నాభిప్రాయాలను అణచివేశారు. అసమ్మతిని ఒక నేరంగా పరిగణించారు. 


పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నెలల తరబడి నిరసనలు తెలిపిన షహీన్‌బాగ్ మహిళా ఆందోళనకారులను ‘పాకిస్థాన్ ఏజెంట్లు’గా ముద్ర వేయడమే ఇందుకొక ఉదాహరణ. అసలు సంఖ్యాధిక్యవర్గాల పాలన పటిష్ఠమవుతున్న కొద్దీ మైనారిటీ వర్గాల వారిపై జాతి వ్యతిరేకులుగా అభియోగాలు మోపడం అధికమై పోతోంది. ఇదొక కఠోర వాస్తవం. షహీన్‌బాగ్ మహిళలు ఎందుకు అలా ఆందోళన చేశారో ప్రభుత్వంలోని ఏ ఒక్కరైనా పట్టించుకున్నారా? వారితో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు చిన్నపాటి ప్రయత్నమేదైనా చేశారా? చేయలేదు. ఎందుకని? వారు ఎలాగూ పాలకపక్షానికి ఓటుబ్యాంకు కాదు కదా! 


మరి రైతులు భిన్నమైన వారు. ఏ ప్రభుత్వానికి అయినా వారు ఒక కీలక, నిర్ణయాత్మక ఓటు బ్యాంకు. ప్రధాని మోదీకి ఈ వాస్తవం బాగా తెలుసు. కనుకనే ఆయన ఏ ఎన్నికల ప్రచార సభలోనైనా తన ప్రసంగంలో ‘గరీబీ- కిసాన్’ గురించి తప్పక ప్రస్తావిస్తారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను మోదీ సర్కార్ ఎలా పెంచిందో ప్రభుత్వ ప్రచార యంత్రాంగం పదే పదే సవివరంగా ప్రజల దృష్టికి పలు విధాలుగా తీసుకువెళుతోంది. దీంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు రూ.6000 చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయాన్ని కూడా తప్పక గుర్తు చేస్తోంది.


సహజంగా ప్రశాంత జీవనులయిన రైతులు ‘తిరుగుబాటు’కు ఉపక్రమిస్తే వారిని అదుపు చేయడం అసాధ్యమవుతుంది. ఆందోళన పెచ్చరిల్లక ముందే చర్చలతో వారి కోపతాపాలను ఉపశమింపచేయడం తప్పనిసరి. ఈ సత్యం ప్రభుత్వాలకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీని ముట్టడించిన రైతులతో చర్చలు జరపడం మోదీ సర్కార్‌కు అనివార్యమయింది. మరి అధికరణ 370 రద్దుతో బాధితులయిన ప్రజలతో చర్చలు జరిపే విషయాన్ని ఢిల్లీ పాలకులు పరిగణనలోకి తీసుకున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి కలవరపడి ఆందోళనకు దిగిన వారితో నైనా చర్చలు జరిపారా? వారూ ఈ దేశ పౌరులే కదా? జరపలేదు. ఎందుకని? ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు వారు ఎలానూ ప్రతిబంధకం కాలేరు. కేంద్రంలో తమ అధికారానికి వారి నుంచి ముప్పు ఉండదనే భరోసా కావచ్చు. కానీ కిసాన్‌లతో నిమ్మళంగా ఉండడం సాధ్యం కాదు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన పంజాబ్‌లో ప్రారంభమయింది. వెనువెంటనే బీజేపీ పాలనలో ఉన్న పొరుగు రాష్ట్రం హర్యానాకు వ్యాపించింది. అలాగే ఇతర ఉత్తారాది రాష్ట్రాలకు కూడా. వీటిలో చాలా వాటిలో బీజీపీయే అధికారంలో ఉన్నది. రైతులతో ఎవరూ ఆషామాషీగా వ్యవహరించలేరు. కశ్మీర్ రాజకీయ నాయకులను జైళ్ళలో పెట్ట గలరు. జెఎన్‌యూ విద్యార్థులపై కన్నెర్ర చేయగలరు. షహీన్‌బాగ్ మహిళలను నిర్లక్ష్యం చేయగలరు. అయితే రైతుల ఆగ్రహావేశాలను ఉపేక్షించగలరా? అసంభవం. వాటిని ఉపశమింప చేయడం అవశ్యం. 


పక్షం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మోదీ ప్రభుత్వానికి ‘నిజమైన’ వ్యతిరేకత ఎక్కడ ఉందో స్పష్టం చేస్తున్నాయి సుమా. ప్రతిపక్షాలు ఎంత మాత్రం ఆ వ్యతిరేకతకు ఆలంబనగా లేవు. ఎందుకంటే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డాయి. దిశానిర్దేశం చేయగల సమర్థనాయకులు ఎవరూ వాటికి, ముఖ్యంగా ప్రధాన జాతీయ ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు లేరు. వివిధ రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను ఆక్షేపించలేని అశక్తతతో ఉన్నాయి. ఇక విధేయ మీడియా గురించి చెప్పేదేముంది? సత్యాన్ని చెప్పే తెగువ, సామర్థ్యం మీడియా సంస్థలకు ఇంకా ఉందా? విద్యావంతులైన పట్టణ మధ్య తరగతి ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటారా? వారు రాజకీయ హిందూత్వ సమ్మోహనంలో మునిగి తేలుతున్నారు కదా. నోట్లరద్దు లాంటి అస్తవ్యస్త చర్యల విషయమై ప్రభుత్వాన్ని వారు ఎలా నిలదీయగలుగుతారు? 


నిరంకుశ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత రాజకీయ ప్రత్యర్థుల నుంచి గాక సామాన్య ప్రజల నుంచే రావడం కద్దు. అవును, అవి తెచ్చే శాసనాలు అన్నిటినీ తాము నిరాక్షేపణీయంగా సమర్థిస్తామని శాసనకర్తలు భావించడాన్ని సగటు భారతీయులు సుతరామూ అంగీకరించరు, హర్షించరు. నరేంద్ర మోదీ ఇప్పటికీ ఇతరుల కంటే ప్రజల అత్యంత ప్రియతమ నాయకుడిగా ఉన్నారు. అయితే వ్యక్తిగత ప్రజాదరణ అనేది ప్రతి అంశం పైన శాశ్వత, సుస్థిర మద్దతుకు పూచీ ఇవ్వదు. మౌలిక మార్పులకు ఉద్దేశించిన సంస్కరణలకు పూనుకున్నప్పుడు ప్రభావిత వర్గాల వ్యాకులతను, తప్పుడు భావనలను తొలగించేందుకు అధిక సంఖ్యాకుల సమ్మతిని తప్పనిసరిగా పొందవలసిన అవసరమున్నది. కొత్త చట్టాలను తీసుకువచ్చే ముందు వాటి ఆవశ్యకత, విస్తృత ప్రయోజనాల విషయంలో జనామోదాన్ని సాధించడం శ్రేయస్కరం. కొత్త సాగుచట్టాల పర్యవసానాల గురించి నేడు రైతులు భయపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరి రేపు వాటి వల్ల ఎవరు చిక్కుల్లో పడి చింతించవలసివస్తుందో ఎవరికి తెలుసు?




రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-12-04T05:42:24+05:30 IST