Abn logo
Sep 24 2021 @ 17:05PM

కమల హారిస్‌కు మోదీ ప్రత్యేక బహుమతులు

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులిచ్చారు. ఆమె పూర్వీకులను గుర్తుకు తెచ్చే విధంగా, ఆమె హృదయాన్ని సంతోషంతో నిండిపోయేలా చేసే విధంగా ఈ బహుమతులు ఉన్నాయి. ఆమె తాత గారు పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్ల కాపీని వుడెన్ హ్యాండిక్రాఫ్ట్ ఫ్రేమ్‌లో పెట్టి ఆమెకు ఇచ్చారు. 

పీవీ గోపాలన్  గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వాధికారి. ఆయన వివిధ పదవులను నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమల హారిస్‌కు మోదీ ఇచ్చారు. దీంతోపాటు గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను కూడా మోదీ ఇచ్చారు. దీనిని అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో తయారు చేశారు. దీనిలోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను తెలియజేస్తాయి. గులాబీ మీనాకారి అనేది అద్భుతమైన వృత్తి. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకి సంబంధించినది. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్న సంగతి తెలిసిందే. 

మోదీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్‌కు సిల్వర్ గులాబీ మీనాకారీ నౌకను బహుమతిగా ఇచ్చారు. కాశీ విశిష్టతను ప్రతిబింబించే విధంగా హస్తకళా నైపుణ్యంతో ఈ నౌకను తీర్చిదిద్దారు. 

జపాన్ ప్రధాన మంత్రి యొషిహిడే సుగకు గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహాన్ని మోదీ బహూకరించారు. భారత్, జపాన్‌ల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో బౌద్ధం ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండిImage Caption