మోదీ విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా?

ABN , First Publish Date - 2020-09-23T03:08:41+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 నుంచి ఇప్పటివరకు

మోదీ విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా?

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 నుంచి ఇప్పటివరకు 58 దేశాల పర్యటనకు వెళ్లినట్టు.. పర్యటనలకు మొత్తం రూ. 517 కోట్ల ఖర్చు అయినట్టు పార్లమెంటుకు కేంద్రం వివరించింది. రాజ్యసభలో మోదీ విదేశీ పర్యటనలపై ప్రశ్నలు తలెత్తగా.. అందుకు సమాధానంగా కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది. విదేశీ పర్యటనలలో భాగంగా మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్టు విదేశాంగశాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని.. మోదీ చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్టు ఆయన చెప్పారు. 


వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విదేశీ పర్యటనలు సహాయపడినట్టు మురళీథరన్ తెలిపారు. కాగా.. 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్టు 2018 డిసెంబర్‌లో కేంద్రం వెల్లడించింది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ విదేశీ పర్యటనలపై ఎప్పుటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారంటూ గత లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మోదీని టార్గెట్ చేశారు.

Updated Date - 2020-09-23T03:08:41+05:30 IST