దేశమే ముందు!

ABN , First Publish Date - 2021-07-26T06:48:52+05:30 IST

‘దేశమే ముందు.. ఎల్లవేళలా ముందే’ అనే మంత్రాన్ని ప్రజలంతా అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మహాత్మా గాంధీ ముందుండి నడిపించిన క్విట్‌ ఇండియా ఉద్యమం...

దేశమే ముందు!

  • ప్రజలకూ ఇదే మంత్రం.. 
  • యునైటెడ్‌ ఇండియా ఉద్యమాన్ని నడిపించాలి
  • మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 25: ‘దేశమే ముందు.. ఎల్లవేళలా ముందే’ అనే మంత్రాన్ని ప్రజలంతా అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మహాత్మా గాంధీ ముందుండి నడిపించిన క్విట్‌ ఇండియా ఉద్యమం లాగా దేశ పౌరులంతా ఐక్య భారత్‌ (యునైటెడ్‌ ఇండి యా) ఉద్యమానికి నేతృత్వం వహించాలని కోరారు. మన్‌కీ బాత్‌లో భాగంగా ఆదివారం మోదీ దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో పలుఅంశాలపై ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా ఏకమై, జాతి పురోభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. మహాత్ముడి క్విట్‌ ఇండియా ఉద్యమం లాగా ఇప్పుడు భారతీయులంతా ‘ఐక్య భారత్‌’ ఉద్యమాన్ని నడిపించాలన్నారు. ‘దేశం ముందు, ఎల్లవేళలా దేశమే ముందు’ అన్న ఆలోచనతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు జాతీయ గీతాన్ని పాడేందుకు రాష్ట్రగణ్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, జాతీయ గీతాన్ని ఆలపించి ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియాలో ‘విక్టరీ పంచ్‌’ ప్రచారం ప్రారంభమైందని, అందులో దేశ ప్రజలంతా మన క్రీడాకారులకు మద్దతునివ్వాలని కోరారు. ఈ నెల 26(సోమవారం) కార్గిల్‌ విజయ్‌ దివస్‌ అని.. ప్రజలంతా కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళులర్పించాలని సూచించారు. 


ఇదో సానుకూల కార్యక్రమం..

మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని సానుకూల, అనేక అంశా ల సమాచార కలబోతగా ప్రధాని అభివర్ణించారు. మన్‌ కీ బాత్‌ కోసం విస్తృత సమాచారం వస్తోందని, దాన్నంతటినీ తాను ప్రస్తావించలేకపోతున్నాని చెప్పా రు. చాలా సమాచారాన్ని సంబంధిత శాఖలకు పంపుతున్నట్లు తెలిపారు. మన్‌కీ బాత్‌కు సలహాలు, సూచనలు పంపుతున్న వారిలో 75ు మంది 35 ఏళ్లలోపు వారేనని మోదీ తెలిపారు. ఇదో శుభపరిణామమన్నా రు. వచ్చే నెల 7న జాతీయ చేనేత దినోత్సవమని.. గ్రామీణులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సహకరించాలని, ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. 


చండీగఢ్‌కు చెందిన చిరువ్యాపారి సంజయ్‌ రాణా గురించి ప్రధాని ప్రస్తావించారు. సైకిల్‌పై ఛోలే భటూరే విక్రయించే సంజయ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు సర్టిఫికెట్‌ చూపిన వారికి ఉచితంగా అందించడాన్ని కొనియాడారు. ఒడిసాలోని సంబల్‌పూర్‌ జిల్లా కు చెందిన య్యూట్యూబర్‌ ఇసాక్‌ ముండా ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండేవారని, ప్రస్తు తం యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగారని మోదీ చెప్పారు. స్థానిక ఆహార పదార్థాలు, సంప్రదాయ వంటకాల తయారీని యూట్యూబ్‌లో చెబుతున్నారన్నారు.



.


ఏపీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రణీత్‌కు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లోని యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సాయిప్రణీత్‌ రైతులకు అందిస్తున్న ‘వాతావరణ’ సేవలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘గత ఏడాది తన ప్రాంతంలోని రైతులు వాతావరణ సమస్యలతో నష్టపోవడాన్ని చూసి ప్రణీత్‌ చలించిపోయాడు. వివిధ మార్గాల్లో కొనుగోలు చేసిన సమాచారం ఆధారంగా వాతావరణంలో వస్తున్న మార్పులను విశ్లేషించి, స్థానిక భాషల్లో రైతులకు అవసరమైన మెలకువలతో తాజా సమాచారం అందిస్తుంటాడు. వరదల సమయంలో రైతులు ఎలా సురక్షితంగా ఉండాలి, తుఫాను లేదా పిడుగుల ప్రభావాన్ని ఎలా నివారించాలి? వంటి అంశాలపై ప్రణీత్‌ మాట్లాడుతుంటాడు’ అని మోదీ అన్నారు. ప్రధాని తన పేరును ప్రస్తావించడం ఆనందంగా ఉందని ‘ఏపీ వెదర్‌మేన్‌ ప్రణీత్‌ అన్నారు.





దేశ ప్రజల మన్‌కీబాత్‌ తెలుసుకుంటే

టీకాల స్థితి ఇలా ఉండేదికాదు: రాహుల్‌

దేశ ప్రజల మన్‌కీ బాత్‌ అర్థం చేసుకుని ఉంటే టీకా కొరత ఇలా ఉండేది కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘వేర్‌ ఆర్‌ వ్యాక్సిన్స్‌’(టీకాలు ఎక్కడ ఉన్నాయి?) అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు. టీకాల కార్యక్రమం నత్తనడకన సాగుతోందని పలు నివేదికలు చెబుతున్నాయని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే 60ు జనాభాకు డిసెంబరు 2021 నాటికి  టీకా రెండు డోసులూ ఇవ్వాల్సి ఉంటుందన్న కథనం ఆ వీడియోలో ఉంది.

Updated Date - 2021-07-26T06:48:52+05:30 IST