దేశమంతా.. లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-25T07:13:28+05:30 IST

కరోనా మహమ్మారి కమ్మేస్తుండడంతో కేంద్రం దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.

దేశమంతా.. లాక్‌డౌన్‌

ఉల్లంఘిస్తే  కటకటాలే కేంద్రం మార్గదర్శకాలు

21 రోజులపాటు సంపూర్ణ బంద్‌

మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి

లాక్‌డౌన్‌.. ప్రతి ఇంటికీ లక్ష్మణ రేఖ

ఇది ఒక రకంగా కర్ఫ్యూలాంటిదే

ఇంట్లోంచి బయటకు రావడం నిషేధం

తొలి లక్షమందికి 67 రోజుల్లో సోకింది

రెండో లక్ష మందికి సోకడానికి 11 రోజులే

మూడో లక్ష మందికి సోకడానికి 4 రోజులు

కరోనా మహమ్మారి వ్యాప్తికి ఇదే నిదర్శనం

గడప దాటితే ఇంట్లోకి ఆహ్వానించినట్లే

సామాజిక దూరం పాటించడమే కర్తవ్యం

ఇంట్లోనే ఉండాలని చేతులు జోడిస్తున్నా..

మన, మన కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి ఇదే అత్యంత కీలకం

వైద్యుల సలహా లేకుండా మందులు వద్దు

జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం


‘‘వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఇటలీ ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి దేశాన్నే కరోనా అతలాకుతలం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో పడిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సవాలు విసురుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏమిటి!? అంతా ఇళ్లల్లోనే ఉండాలి. లేకపోతే, ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు.

- ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కమ్మేస్తుండడంతో కేంద్రం దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి  21 రోజుల పాటు దేశమంతా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అత్యవసరమైన సందర్భమైతే తప్ప ఈ మూడు వారాలు ప్రజలు తమ ఇళ్లలోంచి అడుగు బయటకు పెట్టకూడదని స్పష్టం చేశారు. ‘‘ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే... జనతా కర్ఫ్యూ కంటే కఠినమైనది’’ అని  ఆయన తేల్చిచెప్పారు. ప్రపంచమంతా కరోనా వైర్‌సకు బలవుతున్న దృష్ట్యా భారతావని శ్రేయస్సు కోసం, ప్రతీ భారతీయుడి ప్రాణాలు కాపాడడం కోసం ఈ చర్యలు తప్పవని ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించారు. కరోనా అంటే కోయీ రోడ్‌ పర్‌ న నిక్లే (ఎవరూ రోడ్లపైకి రావొద్దు.) అని ఆయన కొత్త భాష్యం చెప్పారు.


‘ఈ 21 రోజుల్లో స్వయం నియంత్రణ పాటించి వైర్‌సను అరికట్టకపోతే మనం 21 ఏళ్లు వెనక్కిపోతాం. ఈ 21 రోజుల్లో దీని వ్యాప్తిని ఆపలేకపోతే మీ కుటుంబాలు సర్వనాశనమవుతాయి’’ అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. గడపదాటితే కరోనాను ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని హెచ్చరించారు. సామాజిక దూరం పాటించడమే మన కర్తవ్యమని ఉద్బోధించారు. వైద్యుల సలహా లేకుండా మందులను వేసుకోవద్దని సూచించారు. ‘‘ఇళ్ల గుమ్మాల ముందు లక్ష్మణ రేఖ గీసుకొని వాటిని దాటి రాకండి.. 21 రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మరిచిపోండి. అయితే నిత్యావసరాలకు ఎక్కడా కొరత ఉండబోదని, నిరాఘాటంగా వాటి సరఫరా జరుగుతుందని ఆయన చెప్పారు. ‘‘మందులకు ఢోకా ఉండదు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించి వీటికి కొరత రాకుండా చూస్తాయి’’ అని ఆయన తన ప్రసంగానంతరం ట్వీట్‌ చేశారు. ‘‘కరోనా వల్ల ఆర్థిక రంగంపై పెనుభారం పడుతుంది. కానీ డబ్బు కంటే జీవితం ముఖ్యం. జాన్‌ హై తో జహాన్‌ హై... (మనం బతికి ఉంటేనే కద ప్రపంచం ఉండేది)’’ అన్నారాయన. కరోనా కట్టడికి రూ 15వేల కోట్ల ప్యాకేజీని ఆయన ప్రకటించారు.  ‘‘సామాజిక దూరం పాటించడం ద్వారానే వైరస్‌ సైకిల్‌ను అరికట్టగలం. ఇదొక్కటే ఆశారేఖ’’ అని వివరించారు. ‘‘అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ వంటి అధునాతన వైద్య సౌకర్యాలున్నదేశాలు కూడా కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోయాయి. మొదటి లక్ష మందికి సోకడానికి 67 రోజులు పట్టింది. 2లక్షల మందికి రావడానికి 11రోజులే పట్టింది.


మూడు లక్షల కేసులు దాటడానికి కేవలం 4 రోజులే పట్టింది. అంత శరవేగంగా వ్యాపిస్తోంది.  21రోజులు కఠినంగా ఉండగలిగితే ఈ చెయిన్‌ను బ్రేక్‌ చేయవచ్చు. అందుచేత ఈ 21 రోజులూ అత్యంత కీలకం’’ అని ఆయన అన్నారు. ‘రోగం వచ్చిన వారికి దూరం పాటిస్తే సరిపోతుందన్న దురభిప్రాయంలో కొందరున్నారని, ఇది తప్పు అనీ, ఒకరికొకరు దగ్గరగా ఉండడం వల్ల వేగంగా విస్తరిస్తుంది’’ అని మోదీ వార్నింగిచ్చారు. తన ప్రసంగంలో మోదీ నాలుగైదు సందర్భాల్లో చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  కేంద్ర హోం శాఖ కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించిన నిషేధాలను, ఇతర మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం...అనవసరంగా రోడ్ల పైకొస్తే జైలు జీవితం కూడా తప్పదు. 

Updated Date - 2020-03-25T07:13:28+05:30 IST