నెగ్గడమే కాదు, తగ్గడమూ తెలిసిన మోదీ

ABN , First Publish Date - 2021-11-19T23:11:05+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను ప్రతిసారీ

నెగ్గడమే కాదు, తగ్గడమూ తెలిసిన మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను ప్రతిసారీ సరికొత్తగా ప్రదర్శించుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో చాయ్‌వాలాతో ప్రారంభించి, తాజాగా సాగు చట్టాలపై క్షమాపణ చెప్పడం వరకు ఆయన ఎప్పటికప్పుడు తన బ్రాండ్‌ను సరికొత్తగా ప్రజల ముందు పెడుతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, అన్నదాతలకు సవినయంగా క్షమాపణ చెప్పడం ద్వారా తాను దురహంకారిని కానని స్పష్టంగా చెప్పారు.



ప్రధాని మోదీ అహంభావి అని ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతోపాటు, అన్నదాతలకు క్షమాపణ చెప్పి, తనను తాను రీబ్రాండ్ చేసుకున్నారు. తాను ప్రజాస్వామికవాదినని, ప్రజల మాటకు విలువనిస్తానని చెప్పకనే చెప్పారు. 


‘‘నేను స్వచ్ఛమైన, పరిపూర్ణ హృదయంతో దేశ ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను. రైతులకు మేం నచ్చజెప్పలేకపోయాం. కొందరు అన్నదాతలకు నమ్మకం కలిగించడంలో మా కృషిలో కొంత లోపం ఉండి ఉండవచ్చు’’ అని మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. 


వివాదాస్పద సాగు చట్టాలపై నిరసనను పంజాబ్ రైతులు గత ఏడాది జూలైలో ప్రారంభించారు. ఆ తర్వాత నవంబరులో తమ నిరసనలను ఢిల్లీ సరిహద్దులకు తీసుకెళ్ళారు. అప్పటి నుంచి సుమారు 11 సార్లు రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినప్పటికీ, సయోధ్య కుదరలేదు. మరోవైపు ఈ మూడు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిరవధికంగా నిలిపేసింది. వీటిని రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీంతో మోదీ అహంకారి అని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. చివరికి ఈ వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమవడంతో మోదీ వెనుకకు తగ్గారు. 



తగ్గేదే లేదన్నా... క్షమాపణ చెప్పినా...

ప్రజల దృష్టిలో ఓ నేతగా నిలవాలంటే ఎవరికైనా తనకంటూ ఓ ముద్ర ఉండాలి. అందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచగలగాలి. ఇటువంటి నేర్పు నరేంద్ర మోదీకి ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతుంది. గుజరాత్‌లో 2002లో  అల్లర్లు జరిగిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ ఆయన అందుకు అంగీకరించకుండా ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అదేవిధంగా 2014 సాదారణ ఎన్నికల సమయంలో తాను చాయ్‌వాలానంటూ చెప్పుకుని, చాయ్ పే చర్చ కార్యక్రమాలను నిర్వహించి, తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అది సాధారణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. అదేవిధంగా 2019 సాధారణ ఎన్నికల సమయంలో ‘‘నేను కూడా సేవకుడినే’’నంటూ ప్రజల ముందుకు వచ్చారు. ఇది కూడా విజయవంతమై, ఆయనకు ఓ బ్రాండ్‌ను సృష్టించింది. 


గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసినపుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రిగా మోదీ అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ప్రతిపక్షాల ఒత్తిళ్ళకు తలొగ్గి ఆయన ఎన్నడూ క్షమాపణ చెప్పలేదు. గుజరాత్ అల్లర్లు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటి అంశాలపై క్షమాపణ చెప్పాలని మోదీని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ఆయన తలొగ్గలేదు. అయితే కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడం కోసం తన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నందుకు ఆయన మొదటిసారి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత తాజాగా సాగు చట్టాలపై క్షమించాలని కోరారు. మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడం చెప్పుకోదగ్గ మరొక అంశం. 


ప్రజల దృష్టిలో పడటానికి, వారి మనసులో ఓ అభిప్రాయం ఏర్పడటానికి ఇటువంటి బ్రాండింగ్ చాలా ఉపయోగపడుతుంది. చాలా నేర్పుతో సృష్టించే ఇటువంటి పదాలు, చేసే పనులు జనం మనసుల్లో నాటుకుపోతాయి. ఈ తత్వం తెలిసిన మోదీ తనను తాను ఎప్పటికప్పుడు రీబ్రాండ్ చేసుకుంటున్నారు. 

Updated Date - 2021-11-19T23:11:05+05:30 IST