ఇందిరపై మోదీ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-03-27T01:50:31+05:30 IST

బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య సంగ్రామంలో భారత దేశ మాజీ ప్రధాన

ఇందిరపై మోదీ ప్రశంసల జల్లు

ఢాకా : బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య సంగ్రామంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్ర చాలా విశిష్టమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆమె బంగ్లాదేశ్ విముక్తి కోసం చేసిన కృషి అందరికీ తెలుసునని చెప్పారు. ఈ పోరాటానికి భారత దేశంలోని నలుమూలల నుంచి మద్దతు లభించిందన్నారు. భారత దేశంలోని అన్ని పార్టీలు, వర్గాలు సమర్థించాయన్నారు. 


అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ విముక్తి కోసం చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు.  బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఆమె గొప్ప భూమికను పోషించారన్నారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 1971 డిసెంబరు 6న చెప్పిన మాటలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. తాము స్వాతంత్ర్యం కోసం తమను తాము బలి ఇచ్చుకునేవారితో కలిసి పోరాడటం మాత్రమే కాకుండా, చరిత్రకు ఓ నూతన దిశను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వాజ్‌పేయి చెప్పారన్నారు. 


ఇందిరా గాంధీ నిర్ద్వంద్వ మద్దతు

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చాలా కీలకమైనది. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆమె బంగ్లాదేశ్‌కు అండగా నిలిచారు. ఆ దేశ రాజకీయాల్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, ఇందిరా గాంధీ నిర్ద్వంద్వంగా మద్దతిచ్చారు. పాకిస్థాన్ సైన్యం దురాగతాల నుంచి కాపాడుకోవడం కోసం దాదాపు కోటి మంది బంగ్లాదేశీయులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలకు శరణార్థులుగా వచ్చారు. వీరందరికీ ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆహారం, ఆశ్రయం కల్పించింది. 


బంగ్లాదేశ్ 40వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆమెకు మరణానంతరం బంగ్లాదేశ్ స్వాధీనత సమ్మాన పురస్కారాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది.


Updated Date - 2021-03-27T01:50:31+05:30 IST