ఏపీలో చర్చిల వ్యాప్తిపై ప్రధాని మోదీకి రఘురామ లేఖ

ABN , First Publish Date - 2020-10-28T19:13:25+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రధాని మోదీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

ఏపీలో చర్చిల వ్యాప్తిపై ప్రధాని మోదీకి రఘురామ లేఖ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రధాని మోదీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో 30 వేల మంది చర్చి ఫాస్టర్లకు నెలకు రు.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేయడాన్ని తప్పుపట్టిన ఆయన... ఈ చర్య రాష్ట్రంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ప్రజల డబ్బును క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగించడం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనన్నారు. 2011లో 1.8శాతం ఉన్న క్రిస్టియన్ జనాభా... ఇప్పుడు 25 శాతం వరకు మత మార్పిడి ద్వారా పెరిగిందన్నారు. కానీ, ఇది అధికారికంగా ప్రభుత్వ రికార్డులోకి రావడం లేదన్నారు. ఇలా మారిన వాళ్ళు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి.. చట్ట సభలకు కూడా వస్తున్నారన్నారు. మరికొంతమంది విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా వాడుకుంటున్నారని తెలిపారు. 


రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సరి సమానంగా చర్చిలు ఏర్పాటు అయ్యాయని, సుమారు 33 వేల చర్చిలు ఏర్పాటు అయినట్లు సమాచారం ఉందన్నారు. 2021 జనాభా లెక్కల్లో.. ఇలా చేస్తున్న తప్పులు సరిదిద్ది.. అర్హులైన వారికి మాత్రమే రిజర్వేషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకుని, ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-10-28T19:13:25+05:30 IST