దేశాన్ని పీడిస్తున్న సమస్యలకు మోదీ పరిష్కారం : నడ్డా

ABN , First Publish Date - 2021-10-07T19:17:37+05:30 IST

పరిపాలకునిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర

దేశాన్ని పీడిస్తున్న సమస్యలకు మోదీ పరిష్కారం : నడ్డా

న్యూఢిల్లీ : పరిపాలకునిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం అభినందించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పీడిస్తున్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించారని ప్రశంసించారు. సుపరిపాలన, దృఢ నిశ్చయం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, దార్శనికత, సహనం ఈ సమస్యల పరిష్కారానికి కారణమన్నారు. 


రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం, అయోధ్యలో రామాలయం, పౌరసత్వ సవరణ చట్టం, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పన, జీఎస్‌టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వంటి సమస్యలను మోదీ పరిష్కరించారన్నారు. ఈ సమస్యలు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్నాయన్నారు. నిర్ణయాల అమలుతో బలమైన దేశానికి పునాది పడుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ, అంతర్జాతీయ దౌత్యాన్ని నిర్వహిస్తూ ప్రధాని మోదీ భారత దేశాన్ని కేంద్ర స్థానంలో నిలిపారని చెప్పారు. 


నరేంద్ర మోదీ 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధిగా అధికారంలో కొనసాగుతున్నారు. 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అనేక మంది అభినందిస్తున్నారు. 


Updated Date - 2021-10-07T19:17:37+05:30 IST