వారణాసిలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన మోదీ

ABN , First Publish Date - 2021-04-18T21:24:20+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితిని వీడియో..

వారణాసిలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారంనాడు సమీక్షించారు. కోవిడ్ పరీక్షలు, ఆసుపత్రుల్లో పడకలు, మందులు, వ్యాక్సిన్ అందుబాటు తదితర వివరాలను ప్రధాని స్వయంగా వాకబు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను మోదీ ఆదేశించరని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలియజేసింది.


ప్రజలు కనీసం రెండు గజాల దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరంపై అధికారులు ప్రచారం సాగించాలని, వారణాసి ప్రజలతో అత్యంత  జాగరూకతతో వ్యవహరిస్తూ అవసరమైన సాయం అందించాలని అధికార యంత్రాగాన్ని ప్రధాని ఆదేశించారు. దేశంలోని వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రధాని మరోమారు కృతజ్ఞతలు చెప్పారు. సంక్షోభ సమయంలో తమ విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహించారని, గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సైతం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రధాని సూచించారు.


వారణాసి ప్రతినిధిగా తాను సామన్య ప్రజానీకం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని, గత ఐదారేళ్లుగా వారణాసిలో చేపట్టిన వైద్య సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ వంటివి కరోనాతో సమర్ధవంతంగా పోరాడటానికి ఉపకరించాయని చెప్పారు. అందులో భాగంగా ఆసుపత్రులలో పడకల పెంపు, ఐసీయూలు, ఆక్సిజన్ సౌకర్యం పెంచడం వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. కరోనా మొదటి వేవ్‌లో అనుసరించిన తరహాలోనే రెండో వేవ్‌లోనూ 'టెస్ట్ , ట్రాక్, ట్రీట్' విధానంతో వైరస్‌పై విజయం సాధించాలని అధికారలకు ఆయన దిశానిర్దేశం చేశారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.


ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారణాసి కోవిడ్ ఇన్‌చార్జి, ఎంఎల్‌సీ దీపక్ అగర్వాల్, పోలీస్ కమిషనర్ ఎ.సతీష్ గణేశ్, జిల్లా మేజిస్ట్రేటు కౌషల్ రాజ్ శర్మ, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రథి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్‌పీ సింగ్, ఐఎస్ఎశ్‌బీహెచ్‌యూ డైరెక్టర్ మిట్టల్, సహాయ మంత్రి ఎన్.తివారీ, ఎమ్మెల్సీలు అశోక్ ధావన్, లక్ష్మణ్ ఆచార్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T21:24:20+05:30 IST