‘అందరితో కలిసి...’ లక్ష్య సిద్ధికి ఇదే నిదర్శనం : మోదీ

ABN , First Publish Date - 2021-10-22T17:36:51+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను భారీ స్థాయిలో విజయవంతం

‘అందరితో కలిసి...’ లక్ష్య సిద్ధికి ఇదే నిదర్శనం : మోదీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను భారీ స్థాయిలో విజయవంతం చేసిన దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం దేశంలోని ప్రతి వ్యక్తికీ సంబంధించినదని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. అక్టోబరు 21 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం పూర్తయిన సంగతి తెలిసిందే. 


వ్యాక్సినేషన్ భారీ విజయం సాధించిన సందర్భంగా మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అక్టోబరు 21న భారత దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించినది. ఈ మహోన్నత కృత్యానికి ప్రతి పౌరుడిని అభినందిస్తున్నాను’’ అని తెలిపారు. 


100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ అనేది కేవలం ఓ గణాంకం కాదన్నారు. భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ఇది నాంది అని చెప్పారు. భారత దేశం ఓ కఠిన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలదని చెప్పడానికి ఓ సజీవ సాక్ష్యమని తెలిపారు. భారత దేశం తన లక్ష్యాల సాధనకు కఠోరంగా శ్రమించగలదని ఇది రుజువు చేస్తోందని తెలిపారు. మన దేశం కోవిడ్ ఉద్యమంలో విజయం సాధించడానికి కారణం దీని వెనుక 130 కోట్ల మంది ప్రజలు ఉండటమేనన్నారు. ఇది వారి విజయమేనని, వారందరినీ తాను అభినందిస్తున్నానని అన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మనల్ని ప్రశంసిస్తున్నాయన్నారు. అయితే మనం ఎక్కడ ప్రారంభించామనేది చాలా మంది మర్చిపోయారన్నారు. అప్పట్లో మనం ఇతరులపై ఆధారపడేవారమన్నారు. మన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై అపోహలు ఉండేవన్నారు. భారత దేశంలో క్రమశిక్షణ ఎలా అమలవుతుందో? అంటూ మాట్లాడుకునేవారన్నారు. 


భారత దేశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’’ అనేదానికి సజీవ ఉదాహరణ అని తెలిపారు. వీఐపీ సంస్కృతి వల్ల సామాన్యులకు వ్యాక్సిన్ అందని పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 


Updated Date - 2021-10-22T17:36:51+05:30 IST