కొత్త డ్రోన్ రూల్స్‌తో వ్యాపార రంగానికి ప్రయోజనం : మోదీ

ABN , First Publish Date - 2021-08-26T22:01:30+05:30 IST

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన

కొత్త డ్రోన్ రూల్స్‌తో వ్యాపార రంగానికి ప్రయోజనం : మోదీ

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన డ్రోన్ రూల్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్టార్టప్ కంపెనీలు ఈ నిబంధనల వల్ల ప్రయోజనం పొందుతాయని చెప్పారు. నవ కల్పనలు, వ్యాపార రంగం బలోపేతమవడానికి ఈ రూల్స్ దోహదపడతాయన్నారు. ఈ నిబంధనలు అనుగుణ్యత అవసరాలను (కాంప్లియెన్స్ రిక్వైర్‌మెంట్స్‌ను), ఎంట్రీ ఆటంకాలను తగ్గిస్తాయన్నారు. 


ఈ కొత్త నిబంధనలు భారత దేశ డ్రోన్ల రంగానికి గొప్ప నిర్ణయాన్ని పరిచయం చేస్తున్నాయని మోదీ ఓ ట్వీట్‌లో గురువారం తెలిపారు. నమ్మకం, స్వీయ ధ్రువీకరణలపై ఆధారపడి ఈ నిబంధనలను రూపొందించినట్లు తెలిపారు. అనుమతులు, అనుగుణ్యత అవసరాలు, ఎంట్రీ బ్యారియర్స్‌ను చెప్పుకోదగిన స్థాయిలో తగ్గించినట్లు పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలకు, ఈ రంగంలో పని చేస్తున్న యువతకు ఈ నిబంధనలు అద్భుతంగా ఉపయోగపడతాయన్నారు. కొత్తవాటిని సృష్టించడానికి, వ్యాపార రంగానికి కొత్త అవకాశాలను తీసుకొస్తాయన్నారు. భారత దేశం డ్రోన్ల హబ్‌గా మారడానికి బాటలు వేస్తాయని చెప్పారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌లలో భారత దేశం పట్టు సాధించేలా చేస్తాయన్నారు. 


ఈ ఏడాది మార్చి 12 నుంచి అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ రూల్స్, 2021 అమల్లోకి వచ్చాయి. వీటికి బదులుగా కొత్త నిబంధనలను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  అమల్లోకి తీసుకొచ్చింది. వివిధ రకాల అనుమతులు పొందవలసిన అవసరాన్ని ఈ కొత్త నిబంధనలు తప్పించాయి. 


Updated Date - 2021-08-26T22:01:30+05:30 IST