గుజరాతీలు స్పష్టమైన సందేశం ఇచ్చారు : మోదీ

ABN , First Publish Date - 2021-03-03T00:22:10+05:30 IST

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం

గుజరాతీలు స్పష్టమైన సందేశం ఇచ్చారు : మోదీ

న్యూఢిల్లీ : గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని గుజరాతీలు గట్టిగా నమ్ముతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి ఎజెండాను అమలు చేస్తున్న పార్టీతోనే తాము ఉన్నామని ప్రజలు తెలియజేశారని పేర్కొన్నారు. 


గుజరాత్‌లో 81 నగర పాలక సంస్థలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. 81 నగర పాలక సంస్థల్లో 8,474 వార్డులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏకగ్రీవం కావడంతో 8,235 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపులో తాజా సమాచారం ప్రకారం, 1,967 నగర పాలక సంస్థల వార్డుల్లోనూ, 735 జిల్లా పంచాయతీల వార్డుల్లోనూ బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 356 నగర పాలక సంస్థల వార్డుల్లోనూ, 157 జిల్లా పంచాయతీల వార్డుల్లోనూ గెలిచింది. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్‌, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్ నగర పాలక సంస్థల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 వార్డులు లభించాయి. 


ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌లో నగర పాలక సంస్థలు, తాలూకా పంచాయతీలు, జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సుస్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాతో పని చేస్తున్న బీజేపీతోనే తాము ఉన్నామని గుజరాతీలు స్పష్టం చేశారన్నారు. బీజేపీకే తమ మద్దతు అని గుజరాతీలు గట్టిగా చెప్పారన్నారు. బీజేపీ పట్ల దృఢమైన నమ్మకాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తున్న గుజరాతీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, నమ్మకాలకు నిదర్శనంగా నిలిచే బీజేపీ పట్ల నమ్మకం ప్రదర్శించిన గుజరాతీలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


Updated Date - 2021-03-03T00:22:10+05:30 IST