Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 26 2021 @ 16:45PM

డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పీఎం‌డీహెచ్ఎం)ను ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోదీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టును ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. 


జన్ ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం రూపంలో నిర్మించిన పునాదుల ఆధారంగా పీఎండీహెచ్ఎంను అమలు చేస్తారు. విస్తృత స్థాయిలో డేటా, ఇన్ఫర్మేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులను అందజేయడం ద్వారా ఓ పటిష్టమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ప్రజల ఆరోగ్య సంబంధిత వ్యక్తిగత సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత, గోప్యత లభిస్తాయి. ప్రజల లాంగిట్యూడినల్ హెల్త్ రికార్డ్స్‌ను వారి అనుమతితో చూడటానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. 


పీఎం‌డీహెచ్ఎంలో భాగంగా ప్రతి పౌరునికి హెల్త్ ఐడీని ఇస్తారు. ఇది వారి హెల్త్ అకౌంట్‌గా ఉపయోగపడుతుంది. దీనికి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. ఓ మొబైల్ అప్లికేషన్ సహాయంతో వీటిని చూడవచ్చు. సంప్రదాయ, ఆధునిక ఔషధ రంగాల్లోని ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేసేవారి రిజిస్ట్రీని నిర్వహిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీలను నిర్వహిస్తారు. డాక్టర్లు, ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేవారు తమ వ్యాపారాన్ని సులువుగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.  


టెక్నాలజీ, ప్రొడక్ట్ టెస్టింగ్ కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగపడే పీఎండీహెచ్ఎం శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. జాతీయ ఆరోగ్య వ్యవస్థలో భాగస్థులవాలని కోరుకునే సంస్థలకు ఇది ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్, హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజర్‌గా వ్యవహరించడానికి ఇది దోహదపడుతుంది. 


పేమెంట్స్‌లో విప్లవం సృష్టించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ మాదిరిగానే డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌లో ఇంటర్ఆపరబిలిటీని ఈ మిషన్ సృష్టిస్తుంది. హెల్త్‌కేర్ ఫెసిలిటీస్‌ను ప్రజలు ఓ క్లిక్‌తో పొందడానికి అవకాశం కలుగుతుంది.


Advertisement
Advertisement