Abn logo
Sep 27 2021 @ 02:18AM

65 గంటల్లో 20 సమావేశాలు

అమెరికాలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యూఎ్‌సలో గడిపిన 65 గంటల్లో ప్రధాని 20 సమావేశాల్లో పాల్గొన్నారు. గురువారం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, శుక్రవారం అధ్యక్షుడు బైడెన్‌లతో సమావేశమయ్యారు. పలు కంపెనీల సీఈవోలతో 5సమావేశాలు నిర్వహించారు. క్వాడ్‌ సదస్సుకు హాజరవడంతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో మాట్లాడారు. సెప్టెంబరు 24న నాలుగు అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవిగాక భారత్‌ నుంచి అమెరికా వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు విమానంలోనే అధికారులతో 5 సమావేశాలు నిర్వహించారు.


విదేశీ పర్యటనల్లో అలసటకు గురికా కుండా ప్రధాని బిజీ షెడ్యూల్‌ను పాటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వదేశంలో ప్రధానికి ప్రభుత్వ, పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. మోదీని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రపంచ నాయకుడిగా అభివర్ణించా రు. అమెరికా పర్యటన ద్వారా ఉగ్రవాదం, విస్తరణ వాదం పై భారత్‌ అభిప్రాయాలను ప్రధాని ప్రపంచానికి చాటారని నడ్డా పేర్కొన్నారు. భారత్‌,అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంఽధాలు మరింత బలపడటానికి ప్రధాని పర్యటన దోహదం చేస్తుందన్నారు. అమెరికా నుంచి 157 పురాతన వస్తువులను మోదీ తీసుకురావడాన్ని నడ్డా ప్రశంసించారు.