ప్రతిపక్షాలది రాజకీయ వంచన : మోదీ

ABN , First Publish Date - 2021-10-02T20:39:52+05:30 IST

కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి

ప్రతిపక్షాలది రాజకీయ వంచన : మోదీ

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు రాజకీయ నయవంచనకు పాల్పడుతున్నాయని, మేధోపరమైన నిజాయితీ కొరవడిందని దుయ్యబట్టారు. ప్రజలు దశాబ్దాల క్రితం పొందవలసిన ప్రయోజనాలను ఇప్పుడు అందజేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. 


రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చకపోవడం ఒక తరహా అన్నారు. అయితే ముఖ్యంగా అవాంఛనీయమైనది, అసహ్యకరమైనది ఏమిటంటే, తన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల తరహాలోనే కొన్ని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేశాయన్నారు. అవే పార్టీలు ఇప్పుడు యూ-టర్న్ తీసుకున్నాయన్నారు. ఆ పార్టీలు చేసిన వాగ్దానాలపై హానికరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయన్నారు. 


తమకు అర్హతగల, దశాబ్దాల క్రితం పొందవలసిన ప్రయోజనాలను భారతీయులు ఇప్పటికీ పొందలేకపోతున్నారన్నారు. ఈ దేశం, ప్రజలకు అర్హతగలవాటి కోసం ఇంకా ఎదురు చూడవలసిన పరిస్థితిలో దేశాన్ని ఉంచకూడదన్నారు. వాటిని వారికి ఇవ్వాలన్నారు. దీని కోసం భారీ నిర్ణయాలను తీసుకోవాలన్నారు. అవసరమైతే కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాలన్నారు. 


కొత్త సాగు చట్టాల్లో ఫలానా అంశాన్ని మార్చాలని నిర్దిష్టంగా ఎవరూ చెప్పడం లేదన్నారు. భారత దేశంలో రాజకీయాలు కేవలం ఒక విధానాన్నే చూస్తున్నాయన్నారు. తదుపరి ప్రభుత్వాన్ని కూడా తామే నడపాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. కానీ తన మౌలిక ఆలోచన దీనికి భిన్నమైనదని చెప్పారు. దేశాన్ని నిర్మించడానికే ప్రభుత్వాన్ని నడపాలనేదానిని తాను నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రభుత్వాన్ని నడిపే సంప్రదాయం ఉండేది. కానీ దేశాన్ని గెలిపించే విధంగా ప్రభుత్వాన్ని నడపాలనేది నా ఉద్దేశం’’ అని తెలిపారు. 


కొత్త సాగు చట్టాల అమలును ప్రస్తుతం నిలిపేశారు. ఈ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 



Updated Date - 2021-10-02T20:39:52+05:30 IST