ఏపీలో 25లక్షలకు పైగా పరీక్షలు చేశాం: ప్రధాని మోదీతో సీఎం జగన్

ABN , First Publish Date - 2020-08-11T17:55:18+05:30 IST

రాష్ట్రంలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని...ప్రతీ పదిలక్షలమందికీ 47,459 మందికి పరీక్షలు చేశామని సీఎం జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు.

ఏపీలో 25లక్షలకు పైగా పరీక్షలు చేశాం: ప్రధాని మోదీతో సీఎం జగన్

అమరావతి: రాష్ట్రంలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని...ప్రతీ పదిలక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేశామని సీఎం జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో మరణాలు రేటు 0.89శాతంగా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని... ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ తెలిపారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామన్నారు. కోవిడ్‌ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని... ఇప్పుడు ప్రతి పదిలక్షల మందికి 47వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. 


ప్రతి జిల్లాల్లో ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని సీఎం చెప్పుకొచ్చారు. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయని... 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామని తెలిపారు. దాదాపు 37వేలకుపైగా బెడ్లు ఉన్నాయని... 109 కోవిడ్ ‌కేర్‌ సెంటర్లు ఉన్నాయని... 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయని సమావేశంలో జగన్ చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిబెడ్లు కేవలం 3286 మాత్రమే ఉండేవని... ప్రస్తుతం 11వేలకుపైగా ఉన్నాయన్నారు. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని...అలాగే హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామన్నారు. పేషెంట్లను త్వరగా అడ్మిట్ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని తెలియజేశారు. ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయన్నారు. 


కోవిడ్‌కు ముందు 108 అంబులెన్సులు 443 ఉండేవని.. కోవిడ్‌ సమయంలో మరో 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామని ప్రధానికి తెలిపారు. 108, 104లు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు తమకు లేవని, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T17:55:18+05:30 IST