అన్నదాతలకు మరో రూ.2 వేలు

ABN , First Publish Date - 2020-08-10T14:36:15+05:30 IST

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ యోజన(పీఎంకేవై) కింద..

అన్నదాతలకు మరో రూ.2 వేలు

పీఎంకేవై కింద బ్యాంకు ఖాతాల్లో జమ

జిల్లాలో 3,48,388 మంది రైతులు

రూ.69,67,76,000 మంజూరు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ యోజన(పీఎంకేవై) కింద కేంద్ర ప్రభు త్వం జిల్లాలోని రైతులకు రెండో విడత సాయం కింద రూ.69,67,76,000 మంజూరు చేసింది. జిల్లాలో 3,48,388 రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి. శనివారం నుంచి ఖాతాలకు సొమ్ములు జమ కావడం ప్రారంభమైందని, రెండు మూడు రోజుల్లో అందిరి ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 


ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ యోజన కింద కేంద్ర ప్రభు త్వం ప్రతి రైతుకూ ఏటా ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో(రూ.2 వేల చొప్పున) పంట పెట్టుబడి సాయంగా అందజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రూ.7,500 ఇస్తున్నది. మొత్తం మీద ప్రతి రైతుకు ఏటా ఇరు ప్రభుత్వాలు కలిసి రూ.13,500 అందజేస్తున్నా యి. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం తరువాత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.2 వేల చొప్పున అందజేసింది. తరువాత మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రూ.5,500 చొప్పున ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతగా రూ.2 వేల చొప్పున ఇచ్చింది. చివరి విడత  రూ.2 వేలు డిసెంబరులో ఇవ్వనున్నది. కాగా జిల్లాలో 5.72 లక్షల మంది రైతులు వుండగా,  పీఎంకేవై, రైతు భరోసా పథకాలకు 3,48,388 మంది మాత్రమే  అర్హులంటూ వ్యవసాయ శాఖ నిర్ధారించింది. కాగా పీఎంకేవై కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాని రైతులు ఎవరైనా ఉంటే సంబంధిత మండల వ్యవసాయాధికారి లేదా రైతుభరోసా కేంద్రంలో సంప్రదించాలని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-08-10T14:36:15+05:30 IST