Abn logo
Jul 8 2020 @ 00:33AM

నరేంద్రుడి వ్యూహాత్మక విజయం

సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన మన సైనిక దళాలలో నైతిక స్థైర్యాన్ని  పెంపొందించడంతో పాటు, భారత్- – చైనాల మధ్య మిలటరీ స్థాయి చర్చలకు ఒక సాధికారతను కల్పించింది. మన్ కీ బాత్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు, టిక్ టాక్ వంటి యాప్‌ల నిషేధం వల్ల రాని ఫలితాలు ఆ పర్యటనతో లభించాయి. మోదీ పర్యటన పరిస్థితి తీవ్రతను స్పష్టం చేయడమే కాక, తదుపరి చర్చలు సానుకూలంగా జరిగేందుకు దోహదం చేసింది. లద్దాఖ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంతో అంతకు ముందు వరకూ ఆయనపై వచ్చిన విమర్శలన్నీ పూర్వపక్షమయ్యాయి.


భారత రాజకీయాల్లో ఎప్పుడు వేగంగా పావులు కదపాలో, వ్యతిరేక పరిణామాలను ఏ విధంగా అనుకూల పరిణామాలుగా మార్చు కోవాలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాగా తెలుసునని సరిహద్దుల్లో మోహరించిన భారత–-చైనా దళాలు వెనక్కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో స్పష్టమైంది. 1962 తర్వాత రెండు దేశాల సైనికుల మధ్య ఇంత తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగి 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎప్పుడూ జరగలేదు. ఈ ఘర్షణ ఇరుదేశాల మధ్య యుద్ధంగా పరిణమిస్తుందని ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. కాని ఉన్నట్లుండి ఒక వారం రోజుల్లో పరిణామాలు వేగవంతం కావడం, మిలటరీ కమాండర్ల మధ్య చర్చలు ఫలించడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా లద్దాఖ్‌కు వెళ్లడం, చివరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగి చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరిపి ఇరు దేశాలకూ అంగీకార యోగ్యమైన ఫార్ములాను రూపొందించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దాదాపు ఉపశమించినట్లేనని అర్థమవుతోంది. అయితే ఈ చర్చలు మరింత కొనసాగి, రాజకీయ స్థాయిలో సమావేశాల వరకూ వెళ్లి ఒక నిర్దిష్టమైన ఒప్పందం కుదుర్చుకునేంతవరకూ సరిహద్దులపై తగాదా పూర్తిగా సమసిపోయినట్లు భావించడానికి వీలు లేదు.


నిజానికి వాస్తవాధీన రేఖకు 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలని నిర్ణయించినంత మాత్రాన ఇరు దేశాల మధ్య ఇప్పటికీ పూర్తిగా శాంతి నెలకొన్నదని చెప్పడానికి వీలులేదు. ఇరు దేశాలు తమ బలగాలను, యుద్ధ విమానాలను ఇప్పటికీ సరిహద్దుల్లో మోహరించే ఉంచినట్లు సమాచారం అందుతోంది. ఒక వైపు శాంతికోసం చర్చలు జరిగి, సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన సమయంలో కూడా భారత యుద్ధ విమానాలు (గ్లోబ్ మాస్టర్‌లు) లద్దాఖ్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని, సరిహద్దులను మన సుఖోయి విమానాలు నిరంతరం కనిపెడుతూ ఉన్నాయని అంతర్గత సమాచారం అందుతోంది. చైనా ఏమి చేసినా చూస్తూ ఊరుకోవడానికి తాము సిద్ధంగా లేమని, ఎటువంటి పరిణామానికైనా తాము సిద్ధమేనని భారత్ బలమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పొరుగు దేశాల నుంచీ మరింత భూభాగాన్ని ఆక్రమించి మొత్తం ప్రాంతానికి ఆధిపత్యం వహించాలన్న శక్తిమంతమైన జాతీయ వాదం చైనాకు ప్రోద్బలం కలిగిస్తుంటే అంతే స్థాయిలో జాతీయ వాదం భారత దేశంలో బలపడే అవకాశాలు లేకపోలేదని సింగపూర్ జాతీయ యూనివర్సిటీ దక్షిణాసియా స్టడీస్ డైరెక్టర్ సి.రాజమోహన్ చెప్పడం గమనార్హం.


నిజానికి ఉద్రిక్తతలు ఉపశమించేందుకు జూన్ 30న గల్వాన్ లోయలో జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లోనే ఒక అవగాహన కుదిరింది. ఈ చర్చల ఆధారంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం కూడా జరిగింది. ఈ మధ్యలో వచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్భుతంగా ఉపయోగించుకుని లద్దాఖ్ వెళ్లి సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాగూ చర్చలు ఒక కొలిక్కి వస్తాయని తెలిసిన తర్వాత కూడా ప్రధానమంత్రి లద్దాఖ్ వెళ్లడం ఒక రాజకీయ వ్యూహం తప్ప మరేమీ కాదు. ప్రధాని స్వయంగా సరిహద్దు ప్రాంతాల్ని సందర్శించడం వల్ల సైన్యానికి నైతిక స్థైర్యం కలిగించడం మాత్రమే కాదు. మిలటరీ స్థాయి చర్చలకు ఆయన పర్యటన ఒక సాధికారితను కల్పించింది. మన్ కీ బాత్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు, టిక్ టాక్ వంటి యాప్‌ల నిషేధం వల్ల రాని ఫలితాలు ప్రధాని పర్యటనతో లభించాయి. ఈ పర్యటన పరిస్థితి తీవ్రతను స్పష్టం చేయడమే కాక తదుపరి చర్చలు సానుకూలంగా జరిగేందుకు దోహదం చేసిందని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి సరిహద్దుల్లో సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో అంతకు ముందు వరకూ ఆయనపై వచ్చిన విమర్శలన్నీ పూర్వపక్షమయ్యాయి. ఆ ప్రసంగంలోతమను కవ్విస్తే తగిన జవాబిస్తామన్న హెచ్చరికతో పాటు చర్చలకు తాము సిద్ధమేనన్న సంకేతాలు కూడా ఉన్నాయి. ఇది విస్తరణ వాద కాలం కాదు, అభివృద్ధికి దోహదం చేయాల్సిన సమయం అని ప్రధానమంత్రి చేసిన ప్రసంగం విస్మరించదగింది కాదు. విస్తరణ వాదమా, లేదా అభివృద్ధి విషయంలో భారత్‌తో చేతులు కలపడమా అన్నది చైనా తేల్చుకోవాల్సిన విషయం. లేకపోతే వూహన్, మహా బలిపురం సమావేశాల్లో ఇరు దేశాధినేతలు జరిపిన సమావేశాలకు అర్థం లేకుండా పోతుంది. విస్తరణ వాదం విషయంలో ఇవాళ చైనాపట్ల భారత్‌కున్న అభిప్రాయమే ప్రపంచంలో అనేక దేశాలకు ఉన్నదన్న విషయం కూడా ఆయా దేశాలనుంచి వస్తున్న ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇవాళ ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం, మయమ్నార్, భూటాన్, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో పాటు అనేక దేశాలు చైనా దాదాగిరిని నిరసిస్తున్నాయి. ఈ దేశాలనుంచి మద్దతును ఆశించేందుకే ప్రధానమంత్రి విస్తరణ వాదం అన్న పదాన్ని వాడి ఉంటారనడంలో సందేహం లేదు.


చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరపడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ప్రవేశపెట్టడం కూడా పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. అజిత్ దోవల్ జాతీయ భద్రతాసలహాదారు, మాజీ పోలీసు అధికారి కన్నా ప్రధానమంత్రి కుడిభుజం అన్న విషయంలో సందేహం లేదు. అది తెలిసినందువల్లే చైనా ఆయనతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి రాగలిగింది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ అల్లర్లలో అనేక మంది ఊచకోతకు గురైనప్పుడు కూడా హోంమంత్రి అమిత్ షా బదులు ప్రజలతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అజిత్ దోవల్‌నే పంపించారు. కశ్మీర్ పరిణామాల్లో కూడా గతంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. దేశంలో అల్లర్లనుంచి చైనాతో చర్చల వరకూ అజిత్ దోవల్‌ను ఉపయోగించుకోవడాన్ని బట్టి ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సరిహద్దుల్లోంచి ఇరు దేశాలు బలగాల ఉపసంహరణ జరపడాన్ని మోదీ నైతిక విజయం కన్నా వ్యూహాత్మక విజయంగా భావించవలసి ఉంటుంది.


ఈ క్రమంలో భారత దేశంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలు కూడా గాలికి కొట్టుకుపోయేలా మోదీ చేయగలిగారు. చైనా సైన్యాలు గల్వాన్ లోయలో ప్రవేశించడం, 20 మంది భారత సైనికులు మరణించడం, అసలు చైనా సైన్యం మన అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని ప్రధానమంత్రి ప్రకటించడంపై రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఒక దశలో బిజెపి నేతలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేబదులు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నిధుల గురించి మాట్లాడవలిసి వచ్చింది. కాని సరిహద్దుల్లో ఘర్షణ లాంటి పరిణామాలు జరిగినప్పుడు స్వంత దేశాధినేతను విమర్శించే ముందు కొంత ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ గ్రహించి ఉంటే బాగుండేది. చైనా విషయంలో రాహుల్ గాంధీ చేసినన్ని తీవ్రమైన వ్యాఖ్యలు మరే ప్రతిపక్ష పార్టీ నేతా చేయలేదు. కె.చంద్రశేఖర్ రావు లాంటి ప్రాంతీయ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. మనకు రాజనీతి కాదు, రణనీతి ముఖ్యం అని కేసిఆర్ వ్యాఖ్యలు చేస్తే చైనాకు గట్టిగా గుణపాఠం చెప్పాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. 


నిజానికి భారత–-చైనాల మధ్య ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఒక దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు. పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు జరిపిన నరేంద్రమోదీ వ్యక్తిత్వానికే చైనా వైఖరి విషమ పరీక్షగా నిలిచింది. మోదీ హయాంలో 20 మంది భారత సైనికులు మరణించడం, కొంత భూభాగాన్ని కోల్పోవడం అనేది ఊహించలేని విషయం. అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ చిరుబాణాలు విసిరి గాయపరిచేందుకు ప్రయత్నించారు. కాల పరిణామంలో జరిగే కొన్ని సంఘటనల్ని అంతిమ విజయాలుగా భావించలేము కాని ప్రస్తుతానికి మాత్రం మోదీ తన వ్యూహాత్మక చర్యలతో చైనా సృష్టించిన సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడగలిగారు. ‘రాహుల్ చేసే వ్యాఖ్యలన్నీ మోదీకే ఉపయోగపడుతున్నాయి.’ అని ఒక కాంగ్రెస్ నేత నిస్సహాయంగా వ్యాఖ్యానించారు.


(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)