Abn logo
May 16 2021 @ 22:40PM

పొదలకూరులో గబ్బు.. గబ్బు

మార్కెట్‌ సౌకర్యం లేక పారిశుధ్యానికి పాతర 

కరోనా కాలంలో ప్రజల ఆందోళన 


పొదలకూరు(రూరల్‌), మే 16 :  ఐదు మండలాలకు కూడలిగా ఉన్న పొదలకూరులో కూరగాయలు మార్కెట్‌ సౌకర్యం లేక పరిసరాలు గబ్బు... గబ్బుగా మారాయి. పట్టణ పరిధిలో 30వేల జనాభా ఉన్నా ఇంతవరకు కూరగాయల దుకాణ సముదాయం గానీ, మాంసం, చేపల విక్రయాలకు సరైన మార్కెట్‌ సదుపాయం లేదు. దీంతో వ్యాపారులు తమ ఇష్టానుసారంగా విక్రయాలు సాగించి, ఆ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలి వెళ్తున్నారు. వాటిని పంచాయతీ సిబ్బంది సకాలంలో తొలగించడంలో విఫలమవుతుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కరోనా సోకిన వారి ఇళ్లముందు మాత్రమే కాలువలు, రోడ్లను శుభ్రం చేస్తున్నారు. పొదలకూరు సీఐగా గంగాధర్‌రావు బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో పంచాయతీ బస్టాండు ప్రాంగణంలో అమ్మకాలు సాగిస్తున్న చేపల వ్యాపారులపై కొరడా ఝుళిపించి,   బస్టాండ్‌లో కాకుండా దూరంగా అమ్ముకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బస్టాండు ప్రాంగణంలోని అన్ని దుకాణాల వ్యర్థాలను ఆరుబయట పారేయకుండా కట్టడి చేశారు. చికెన్‌ అంగళ్ల ముందు ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు. దీంతో వ్యాపారులు సీఐ చెప్పినట్లు చేశారు. అయితే ప్రస్తుతం పూర్వస్థితికే వచ్చేశారు. గతంలో పట్టణంలో రైతుబజారు ఏర్పాటుకు శాఖాపరమైన అనుమతులు కూడా వచ్చాయి. బస్టాండ్‌ వెనుక ఆర్‌ఐ క్వార్టర్స్‌ స్థలంలో 52 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పట్టణంలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా చేపలు, మాంసం దుకాణాల ద్వారా వచ్చే వ్యర్థాలను నిర్వాహకుల ద్వారానే కట్టడి చేసి, కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

రోడ్డు పైనే చేపల విక్రయాలు


Advertisement
Advertisement
Advertisement