పైడిగూడెంలో పోడు రగడ

ABN , First Publish Date - 2021-06-22T05:06:10+05:30 IST

పైడిగూడెంలో పోడు రగడ

పైడిగూడెంలో పోడు రగడ
ఎక్స్‌కవేటర్‌కు అడ్డుగా కూర్చొన్న ఆదివాసీ మహిళలు

వివాదాస్పద అటవీభూమిలో ట్రెంచ్‌ పనులు

అడ్డుకున్న ఆదివాసీ మహిళలు..  ఇరు వర్గాల మధ్య తోపులాట

సొమ్మసిల్లిన ఇద్దరు ఆదివాసీ మహిళలు

దుమ్ముగూడెం జూన్‌ 21: వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు చిచ్చు రాజుకుంటోంది. జిల్లాలోని దుమ్ముగూడెం అటవీరేంజి పరిధి పైడిగూడెం వద్ద వివాదాస్పద అటవీ భూముల్లో పోడుసాగుదారులు, అటవీ సిబ్బంది మధ్య సోమవారం మరోమారు వివాదం చెలరేగింది. అటవీ సిబ్బంది ట్రెంచ్‌ పనులు నిర్వహిస్తుండగా ఆదివాసీ మహిళలు ఎక్సకవేటర్‌కు అడ్డుపడడంతో వారిని పక్కకు తప్పించే క్రమంలో జరిగిన పెనుగులాటలో నానమ్మ, తులశమ్మ అనే మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఒక మహిళా ఎఫ్‌ఎస్‌వో వీపుపై దెబ్బలు తగిలాయి. సొమ్మసిల్లిన మహిళలను అటవీ సిబ్బంది తమ జీపులో దుమ్ముగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దుమ్ముగూడెఎం అటవీరేంజి పరిధిలోని పైడిగూడెం వద్ద గల వివాదాస్ప అటవీ భూములకు ఎలాగైనా ట్రెంచి తీయాలనే పట్టుదలతో డివిజన్‌ అటవీ సిబ్బంది మొత్తం ఆ భూముల వద్దకు చేరుకున్నారు. అయితే 50ఏళ్లుగా పోడుసాగు చేస్తున్న భూములను వదిలేది లేదంటూ ఆదివాసీలు ట్రెంచి తీసేందుకు వచ్చిన రెండు యంత్రాలకు అడ్డుగా కూర్చున్నారు. ఈ క్రమంలో అటవీ సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తొలగించి పనులను కొనసాగించారు. ఈ క్రమంలో  ఆదివాసీ మహిళలు పలుమార్లు ఎక్సకవేటర్‌కు అడ్డుపడేందుకు యత్నించగా తాడుసాయంతో వారిని పక్కకు తొలగించారు. అయితే మహిళలని కూడా చూడకుండా అటవీశాఖలో ఆడ, మగ సిబ్బంది కలిసి తమపై దౌర్జన్యం చేశారని పోడుసాగు చేస్తున్న ఆదివాసీ మహిళలు ఆరోపించారు. కొందరిని కడుపులో గుద్ది, జుట్టులాగి, సెల్‌ఫోన్లు లాక్కొన్నారని ఆరోపించారు. గర్భిణి అని కూడా చూడకుండా ఇష్టారీతిన లాగడంతో ఒక మహిళ కింద పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సిబ్బంది తమలోనే కొందరికి అనుకూలంగా సర్వే పాయింట్‌కు విరుద్దంగా ట్రెంచి పనులు చేపట్టారని పైడిగూడెం సర్పంచ్‌ పాయం మంగమ్మ ఆరోపించారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టారీతిన మీద పడి దౌర్జన్యం చేసి కొట్టారన్నారు. ఈ వ్యవహారంలో తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు.  

రేంజ్‌ అధికారి ఏమంటున్నారంటే..

కొందరు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు చూపిస్తే కొంతభాగం వదిలేసి ట్రెంచి తీస్తున్నామని రేంజి అధికారి కనకమ్మ తెలిపారు. ఆదివాసీ మహిళలపై తాము ఎటువంటి దౌర్జన్యం చేయలేదన్నారు. వాళ్లే తమ మహిళా సిబ్బందిని బూతులు తిట్టడంతోపాటు, దాడిచేసి వీపులపై కొట్టారని రేంజి అధికారి  తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:06:10+05:30 IST