Abn logo
Sep 26 2021 @ 02:33AM

నిర్బంధకాండ ఆపాలి

‘పోడురైతుల పొలికేక’ సదస్సు

కొణిజర్ల, సెప్టెంబరు 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన నిజాం నవాబును గుర్తుకు తెస్తోందని విపక్షాల నేతలు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో శనివారం నిర్వహించిన పోడురైతుల పొలికేక ప్రాంతీయ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, కాంగ్రెస్‌ రాష్ట్ర అధికారప్రతినిధి బెల్లంనాయక్‌ మాట్లాడారు. పోడు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా అటవీహక్కుల చట్టం ప్రకారం వారికి సాగు పట్టాలు ఇవ్వడంలేదన్నారు. పోడు రైతులపై అటవీ అధికారుల నిర్బంధకాండ ఆపాలని డిమాండ్‌ చేశారు.  ఏం తప్పు చేశారని ఎల్లన్ననగర్‌ పోడురైతులపై హత్యాయత్నం కేసుపెట్టారని ప్రశ్నించారు.  పోడుసాగుదారులకు అండగా అఖిలపక్షం నిలుస్తుందని చెప్పారు. అక్టోబరు 5న పోడుసాగుదారులకు మద్దతుగా రహదారుల దిగ్బంధం చేస్తామని, పోడురైతులంతా అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.  టీడీపీ ఖమ్మం పార్లమెంట్‌ కో-ఆర్డినేటర్‌ కూరపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.