వైద్యో నారాయణో

ABN , First Publish Date - 2020-03-28T09:07:34+05:30 IST

మనుషుల సంగతి సరే, దేశాలకు దేశాలే సరిహద్దుల తలుపులు మూసుకుంటే! అస్పృశ్యత ఇప్పుడు నేరం కాదు పరమ పవిత్ర సత్యం!

వైద్యో నారాయణో

మనుషుల సంగతి సరే, 

దేశాలకు దేశాలే సరిహద్దుల తలుపులు మూసుకుంటే! 

అస్పృశ్యత ఇప్పుడు నేరం కాదు 

పరమ పవిత్ర సత్యం!

కరోనా కనిపెట్టిన ప్రపంచ ఆరోగ్య సూత్రం..!

ఊరి చివర గుడిసెల్లా, 

కొరంటైన్ ఆసుపత్రులు!

దేశంలో అడుగుపెడితే నిలువెల్లా 

శవ మర్యాదలు!

వైరల్ ఫీవర్ ఎక్కువై

లోహ విహంగాలు 

రెక్కలు ముడుచుకు పడుకున్నాయి!

విహారం పేరు వింటే కడుపులోంచి 

వికారం తన్నుకొస్తోంది!

గూడు విడిచి రోజూ వాలే పక్షుల ఊసుల్లేక

బడి చెట్లు బోసిపోతున్నాయి! 

ఖజానాలు బక్కచిక్కి

దుకాణాలు రెప్పలు వాల్చి

దిగులు మొకాలేసుకున్నాయి!

జ్ఞానం కంటే లాభంకంటే 

చావుభయం గొప్పది!

మొబైళ్ల బెంబేలు సందేశాల ముసురులో

ఆంజనేయ దండకమో మిరియాల చారో

తావీదో, స్వస్థత సువార్తో,

లేని రోగానికి ఏదో రాయి విసిరే

భిషక్కోవిదులసంఖ్యే ఎక్కువ!

సమాచార దుమారంలో

గాలి వార్తలకే ఘాటెక్కువ!

కరోనా ముక్త జగత్తులో

కరచాలనాల కంటే ముకుళిత హస్తాలే ముద్దు!

కౌగిలింతల కంటే కలల్లో పులకరింతలు పదింతలు సేఫ్! 

పెదవుల గుసగుసల కంటే

నయనాల భాష వైరల్ ప్రూఫ్ మరి!

కరోనా కల్లోలంలో 

ఎవడి మాస్కు వాడిదై ఎవడి గీత వాడిదై

చెలరేగిన గందర గోళంలో

ఇవేవీ పట్టించుకోని, చేతలుడగని 

కర్మయోగి నొక్కడ్ని చూసాను!

భయాల భయం లేని

పగలు రాత్రుల చింతల్లేని ఒకే ఒక్క కాపరిని!

ఆశలుడిగిన ప్రాణాల కొనఊపిరిని 

పిడికిట ఒడిసి పట్టిన ప్రయత్నశీలిని!

దీక్షాబద్ధ వైద్య నారాయణున్ని!

ఏకాగ్ర చింతనా ముద్రలోని

నిలువెత్తు మానవీయ మూర్తిని

చేతులు ముడిచి మలినం కానీక

గాఢంగా కౌగిలించుకుని

కరువు తీరా ఏడ్చేశాను!

– ప్రతాప చంద్రశేఖర్

Updated Date - 2020-03-28T09:07:34+05:30 IST