Abn logo
Mar 28 2020 @ 03:50AM

కనిపించే దేవతలు

ఏలోకం నుండి

దిగివచ్చారో ఈ

అశ్వినీ దేవతలు

తెల్లని దుస్తుల్లో

దివ్యరూపులు

వెన్నెల కురిసినట్టు

చిరుమంద హాసంతో

పలకరిస్తారు

ఓడిపోతున్న ప్రాణశక్తికి

కాసిన్ని అమృత బిందువులను

చిలకరిస్తారు

కనిపించని శత్రువుతో

కఠోర యుద్ధం చేస్తారు

రెప్పపాటులో మాయమయ్యే

దుష్మన్‌తో

దివారాత్రులు

అలుపెరుగని పోరు చేస్తారు

కళ్ల వెనుక కనిపించని

కడలిని దాచి

హృదయంలో ఎగసే

ఉప్పెనను అణచి

ఒకరి ప్రాణం కోసం

తమ ప్రాణాలు ఒడ్డుతారు

నిశ్శబ్ద సమరంలో

సాహస వీరులు వీరు

ఒక ప్రాణం నిలిస్తే

కళ్లలో ఆనందరేఖలు

ఒక ప్రాణం ఓడితే

దుఃఖాన్ని గుండెల్లో

దిగమింగుకొని మరో

సమరానికి సై అంటారు

పేగుబంధాలను ఇళ్ళకే వదిలి

గుమ్మం దాటితే గమ్యాన్ని

చేరేదాక పట్టువీడని

ప్రాణదాతలు

కనిపించని వైరస్‌లు

విచ్చుకత్తులను విసిరినా

మొక్కబోని విశ్వాస ఖడ్గంతో

తుత్తునియలు చేస్తారు

సూర్యుడిలా వెచ్చని

కరస్పర్శ అందిస్తారు

చల్లని చంద్రుడిలా 

ఆశల దీవెనలు ఇస్తారు

– సుంకర రమేష్‌

Advertisement
Advertisement
Advertisement