కవితలూ కానిది...

ABN , First Publish Date - 2020-05-11T09:26:02+05:30 IST

‘‘Dryness.. డ్రైయర్తో ఎవరో లోపలి తడినంతా పీల్చివేసినట్లు ఒక పొడితనం. ఎంతో దప్పిక. అలసట. restlessness. ఎవరో సరిహద్దులదాకా వచ్చి, నిను తాకబోతూ ఆగి వెనక్కి వెళ్ళిపోయిన నిస్పృహ...

కవితలూ కానిది...

Poems కానిది...

‘‘Dryness.. డ్రైయర్తో ఎవరో లోపలి తడినంతా పీల్చివేసినట్లు ఒక పొడితనం. ఎంతో దప్పిక. అలసట. restlessness. ఎవరో సరిహద్దులదాకా వచ్చి, నిను తాకబోతూ ఆగి వెనక్కి వెళ్ళిపోయిన నిస్పృహ. చుట్టూతా, కరుణ లేని, వృక్షఛాయలేని ఒక loneliness. Senselessness. మెట్రోస్టేషన్‌. గాలికి ఎగిసి, తిరిగి అక్కడే స్థిమితపడే ఒక చిత్తు కాగితం: లేదా ఒక poem. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద నీ వైపు దీనంగా చాచబడిన ఒక అరచేయి. లేదా ఒక పసి దేహం. చుట్టూతా ఒక lingering smell: of disappointment of self. ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్క, ఉదయానికి మొగ్గ వేసి సాయంత్రానికి తలను వాల్చి చచ్చిపోయినట్లు. పొదివి పుచ్చుకున్న ప్రియమైన అరచేయి ఏదో జారిపోయి, తిరిగి ఇక ఎన్నటికీ నీ దరి చేరనట్లూ, నేనూ, నా ఈ నగరం. By the way, how are you?’’ అడిగాను నేను--‘‘నేనా? నేను బావోలేను. పెయిన్‌. శరీరంలోనూ మరి నాలోనూ: aching legs and an aching heart.  శ్వాస అందనట్లుగా ఉంది. ఎందుకో దిగులుగా ఉంది. దిగులు కూడా కాదు. a nameless longing, Perhaps, anguish. పోనీలే, ఇలాగే గడిచిపోతుందేమో కాలం ఇక: అన్వేషణ ఆగిపోయి, నాతో నేను, నాలో నేను చిక్కుకుపోయి, చెక్కుకుపోయి, ఇదిగో ఇక ఈ బాగ్‌తో, ధూళి నిండిన వేడిమి రాత్రుళ్ళలో, రహదారుల్లో, ఇంటికి చేరేందుకు ఇట్లా ఎదురు చూస్తో, బ్రతికేదేలా అని అనుకుంటో, ఆకాశంలో మెరిసే చుక్కల్ని చినుకులుగా ఊహిస్తో, పగిలిన పెదిమలని తడుపుకుని, ఎంతో ఒంటరితనాన్ని నింపుకున్న ఈ చేతులని రుద్దుకుని ముందుకు సాగుతో! నా సంగతి సరే కానీ, ఇంతకు నువ్వెలా ఉన్నావు?’’ అని అడిగి - ఏదో చెప్పబోయి - అంతలోనే ఆగిపోయీ: నువ్వు 

*****

బయట, చీకటి వేసవై వ్యాపిస్తోంది. ఎక్కడో రిక్షా బెల్‌ చప్పుడు. పిల్లల అరుపులు. (Am I hallucinating?) గాలి లేక స్తంభించిన మొక్కలూ, గోడకి ఒరుసుకుని ఆగిన మనీప్లాంట్‌ తీగలూ. అతని ఎదురుగా, నారింజ రంగు street lights. ఆ కాంతిలో, వీధిలో పొడవుగా సాగిన నీడలు. ఆ నీడలలో ఎంతో తపన. వేల గొంతుకలై అవి నిన్ను పిలుస్తోన్నట్లు, ఊచల ఖైదు భాషనేదో క్రమేణా విప్పి చెబుతున్నట్లూ: Mirage. అంతా ఒక suicidal భ్రాంతి. గొంతు చుట్టూ ఇనుప వేళ్ళు మొలుచుకుని వచ్చి poetic languageతో బిగుసుకుపోతోన్నట్లు... ఛత్‌... లోపల, ఇక్కడ - ఈ గదిలో - గోడలకి అంటించిన లేత ఎరుపు సీతాకోకచిలుకల బొమ్మలు. గుమ్మానికి వేలాడే ప్లాస్టిక్‌ బంతి పూవులు. ఎండిన వాన దారాల వలే వేలాడే కర్టెన్లు. mortuaryలో శవాల వలె అరలో పేర్చిన పుస్తకాలు. వాటి ముందు తలలు బాదుకుంటో రోదించే కవితలూ... ఇవన్నీ, ఇవి అన్నీ, ప్రాణం పోసుకుని బ్రతికి వచ్చి - క్షణకాలం - లోపల పచ్చని గాలితో ఎగిరితే, పూల నీడలు ఊయలలూగే ఒక రాత్రయితే, చిన్నగా తాకితే ఎంత బావుండు!

శ్రీకాంత్‌

97005 55950


పొద్దును సెరిపీవొద్దు! 

పాదం బయట మోపి

బాదలెందుకు తెచ్చుకోవాల?

పొద్దోయి దొంగెద్దునాగ

కట్టెందుకు తెంపుకోవాల!

సుక్క కోసమే కదా?

సుక్కకి సిక్కిపోయి

సుక్కల్లో కలిసిపోతావా?

బతికి బట్ట కట్టాల

ఈ ఇంటి గూటి దివ్వ

ఆరకుండా వుండాల

*****

ఇంటి పెణక్కి ఏలాడుతున్న 

ముంతంత గూటిలోన

మూడు పిచ్చికి పిల్లలు

ఎంత ముచ్చటగున్నాయో!

పిడికిడంత పిట్టే...

దొరికిన పుంజిడు గింజలతో

సంసార సాగరాన్ని...

రెక్కల గూడతో తోడతాది!

గూటిలో తల దాచుకునే

తుపానుల్ని కాలితో తన్ని

కాలానికి నిలబడతాది!

పిట్టనే కాదు...

సెట్టును సూసీ ఈయేల

మనిసి సేనా నేర్సుకోవాల!

నిలబడిన సోటే ఇన్ని నీలు తాగి

ఒల్లల్లా పువ్వులై కాయలై

పళ్ళతో పలకరించుతాది

*****

సెట్టంత మనిసివి గావాల!

నీకూ సెప్పాలా?

బయట ఉపద్రముందని!

పెపంచకాన్నే సావు సంచిలేసుకొని

పట్టికెల్లిపోడానికి పనిగట్టుకుంది    

                 మాయలాడి!

ఇల్లు దాటి ఎల్లొద్దు నాయినా! 

                   ఎల్లొద్దు!!

నా నుదిటి మీద పూసిన పొద్దును

నీ సేతులారా సెరిపీ వొద్దు!


చింతా అప్పలనాయుడు

94417 13185



తావు

‘‘కొంచెం ఆగుదామా?’’

నెత్తినమూట, చంకన పిల్లవాణ్ణి మోస్తున్న

ఆమె అడిగింది.

‘‘మనమింకా మరుభూమిని దాటలేదు 

మనుషులు కనిపించిన చోట ఆగుదాం.’’ 

మోయలేని బరువుతో 

తలతిప్పకుండానే చెప్పాడతను. 


దారి మధ్యలో 

ఆమె నెత్తుటి మబ్బులా 

     నేలలో ఇంకిపోయింది. 

భూమి కాలుతుంటే,

రాళ్ళు కరుగుతుంటే 

ఆకాశంలోకి ఆవిరైతూ

అతను వేడుకున్నాడు

‘‘అయ్యలారా! 

మీలో ఎవరైనా బతికుంటే 

ఈ పసికందును

మనుషులు బతికున్న తావుకు చేర్చండి’’. 


దేశపతి శ్రీనివాస్‌



అద్దమూ కాలమూ

కాలమొక్కటే కాళ్లపై నడుస్తున్నది

ఉచ్చబోసుకోవడానికి తీరిక లేదు కదా, బాబు బాగా బిజీ కదా,

ఇపుడు ఈదురుగాలికి ఎగిరొచ్చిన ఎంగిలిస్తరాకులా 

ముఖానికి చుట్టుకున్నది

అంతే, ఏదైనా అంతే, మనలాగే, మన ప్రేమల్లాగే, మన ఈర్షా ద్వేషాల్లాగే 

దొరికితేనా.. నా సామిరంగా అని పెదాలు కొరుక్కుంటాం, పండ్లు నూరుతాం

నిండా మునిగేటప్పుడు చేతులెత్తేసి హాహాకారాలు చేసేస్తాం

అవసరార్థం ఇపుడు హలోని సాగదీస్తాం కానీ అర్థం తెలిసే అంటామా

తెలీదు, అర్థమో పూర్ణమో మరేంటో తెలీదు

హలోకు మించి తెలుసుకోవాలని తెలుసుకోలేదు

తెరల్లోంచి దూకుతున్న కల్లోలానికి

విదూషకుడు వికటాట్టహాసం చేసే వికృత సర్కస్‌కు

బెంగటిల్లి మనవంతుగా కొన్ని గడ్డిపోచల్ని విసిరేస్తాం

మదపుటేనుగుపై దర్బలిసిరి జబ్బలు చరుచుకునే దుర్బలసైన్యం కదా

అద్దంతోనే సావాసం, అద్దంతోనే సంసారం, అద్దంతోనే యుద్ధం

భావం నుంచి కాకుండా అక్షరాల నుంచి భాష నేర్చుకునే తెరాధునికులం కదా

తెలీదు, కర్మమేమిటో కర్త యెవ్వరో తెలియదు

కుదురునొదిలేశాం, ఆకుల్ని లెక్కబెట్టే కాలిక్యులేటర్స్‌తో అంకెలు మర్చిపోయాం 

సరి బేసి సరిచేసుకునే తీరికలేకుండా అద్దాల గదుల్లో తీరిక లేకుండా సేదతీరుతున్నాం

సర్సరే, అద్సరే,

ఓ మనిషీ, ఓ మాంత్రికా

నెత్తుటి వర్షం కురిసినపుడల్లా 

పత్తినుంచి ఇనుమును పేనావు, ఇనుమునుంచి పెట్రోల్‌ పిండావు

మరిప్పుడేం చేయబోతున్నావు?


జి ఎస్‌ రామ్మోహన్‌



తల్లకిందులు

మనుషులు రాలిపోతున్నారు పురుగుల్లా

పగలబడి నవ్వించే ఉపమానమే ఇది

ముళ్ళ కిరీటం వేల ముక్కలై అంతటా 

               వ్యాపించింది

సూక్ష్మమైనదే శక్తివంతమైంది

విరాట్‌ స్వరూపాలు నేలమట్టమయ్యాయి

ఎవరి కోసమో ఎక్కడికో

ఈ పలాయనం!

అభూత కల్పనలు

జానపద మాయా కథలు

నీడలతో క్విజోట్‌ యుద్ధం-

చేతులు కడుక్కోమంది నీ పాపం

నడి సంద్రంలో నౌకలోని సమూహం

ఒంటరి హాహాకారం-

భయం చుట్టుముట్టిన ఈ దేహాన్ని

గుంపు నుండి వేరు చేసి

ఏకాంత ద్వీపంలో నిలబెట్టాలి

నా నుండి నేను వేరు కావాలి

నిన్నటి ఈ బంధాల నుండి ఈ బంధుత్వాల నుండి

ఈ స్నేహాల నుండి వేరు కావాలి

మిగిలింది కేవలం నరకమే-

నన్ను అనబడే నా దేహాన్ని

కేవలం ఈ దేహాన్నే గుర్తుంచుకోవాలి

మళయాళ మూలం: థామస్‌ కుట్టి

హిందీ: ప్రమోద్‌ కోవప్రత్‌

తెలుగు: ప్రసాదమూర్తి 

84998 66699



మృత్యువు పాదం మీద...

తన తీరం తెలియని

గమ్యం గుర్తించని

ఒకడు....

కులాల బొరియల్లోంచి

మాట్లాడేవాడు

నిషేధాక్షరాలను

కలం ప్రాణంలో నింపేవాడు

రంగుల పూల ప్రపంచంలో

భూమి పొరల్లో దాగిన

ప్రాణ మూల స్పృహ లేనివాడు

ఒక దళితుడు

ఒక పీడితుడు

ఒక జంధ్యుడు

ఒక పీడకుడు

వెరసి మానవుడు

ఇపుడు కరోనా సర్పభయంతో

నిషేధ జీవితం అయాడు.

అహంకారపు కత్తిని

మృత్యువు పాదాలమీద పెట్టి

తనకు తానే

నియంత అయాడు

ఇక కలగందాం

ఒక విధ్వంస హెచ్చరిక

సృష్టించే కొత్త ప్రపంచాన్ని

చావు పాదు నుంచి మొలచిన 

              కొత్త జీవితాన్ని.


కాంచనపల్లి

96760 96614


Updated Date - 2020-05-11T09:26:02+05:30 IST