Abn logo
May 17 2021 @ 00:29AM

సాహితీవేత్త అదృష్టదీపక్‌ కన్నుమూత

భానుగుడి (కాకినాడ), మే 16: ఆ కలం ఆగిపోయింది... ఆ రాగం మూగబోయింది. చరిత్ర అధ్యాపకుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. సాహిత్య,  కళా రంగాల్లో తనదైన పాత్ర పోషిస్తూ ఎందరో సాహితీవేత్తలకు నిఘంటువు అయ్యారు. ఆయనే అదృష్టదీపక్‌. అభ్యుదయవాది, సాహితీవేత్త, సినీ రచయితగా పేరు ప్రఖ్యాతలు గడించిన ఆ సాహితీ శిఖరం కొవిడ్‌తో పోరాడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. 1950 జనవరి 18న రావులపాలెంలో సూరయ్య-బంగారమ్మ దంపతులకు జన్మించారు. 12వ ఏటనే కవితలు రాయడం ఆరంభించారు. నాటకాలపై మక్కువతో రంగస్థల ప్రవేశం చేశారు. సోషలిస్టు భావాలు కల ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం తనను కవిగా మలచిందంటారు. రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అదృష్టదీపక్‌. స్నేహార్తితో అలమటించే వారికి దీపక్‌ ఒయాసిస్సు లాంటివారని ఆయన మిత్రులు ఇప్పటికీ చెప్తుంటారు. ఈయనకు భావరాజు, గరికపాటి మహా ప్రముకులతో స్నేహాలు కూడా ఇంటిపేరుతో పిలుచుకునేవారు. అదృష్టదీపక్‌ను స్నేహితులు దీపూ అని పిలిచేవారు. దీపక్‌ మేనమామ కళాకారుడు, కమ్యూనిస్టువాది కావడంతో ఆయన ప్రభావం ఎక్కువగా పడింది. దీంతో రంగస్థలంపై అడుగుపెట్టి అనుభవం సంపాదించారు.  సినీ గేయ రచయితగా ఉన్న సమయంలో శ్రీశ్రీ అనారోగ్యంతో మంచంపై ఉండగా ఒక పాట రాయించుకున్నారు. ఆ అనుభవాన్ని దీపక్‌ గారు ఒక పోస్టుకార్డుపై రాసి పంపగా ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురించారు. గజ్టెల మాల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, చాసో, చెరబండరాజు, ఇస్మాయిల్‌, సి.నారాయణరెడ్డి, చందు సుబ్బారావు, టి.కృష్ణ, మదాల రంగారావు మొదలగు ప్రముఖులపై అదృష్ణదీపక్‌  రాసిన వ్యాసాలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘నాటకం చూస్తున్నప్పుడు అతనో విలన్‌, రిజల్ట్‌ చెప్పేటప్పుడు అతనో జెంటిల్‌మెన్‌, బహుమతి ప్రదానం అయిపోయాక అతనో హీరో... మనసా-అతను ఏది చేసినా ఇష్టంగా చేస్తాడు. వాచా-అతను నమ్మిన విషయాన్నే చెప్తాడు... కర్మణా-కొంపలు మునిగిపోతున్నా తాను నమ్మేదాన్నే ఆచరిస్తాడు’ అని సినీ నటుడు తనికెళ్ల భరణి అదృష్ణదీపక్‌ కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చినా, సినిమా రంగం కళాసాగర్‌ అవార్డు ఇచ్చినా ఆయన ఆలోచనలు ఎప్పుడూ నేలమీదే నడుస్తుంటాయి. ఆయన కళ్లు నిరంతరం జీవితాన్నే చదువుతాయి. అందకే అదృష్టదీపక్‌ అంటే సినీ గేయ రచయితలందరికీ ఎంతో ఇష్టం.
ప్రచురితమైన గ్రంథాలు: కోకిలమ్మ పదాలు (1972), అగ్ని (1974), సమరశంఖం (1977), ప్రాణం (1978), అడవి (2008), దీపక రాగం (2008). వీటితో పాటు శ్రీశ్రీ  ఒక తీరని దాహం, అదృష్టదీపక్‌ కథలు, తెరచిన పుస్తకం, అదృష్టదీపక్‌ అనుభవాలు, అదృష్టదీపక్‌ సప్తతి ప్రముఖల సంకలనాలు కూడా ప్రచురితమయ్యాయి.
అదృష్టదీపక్‌ మృతికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, నల్లమిల్లి మూలారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి తమను ఎంతో కలచివేసిందని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు బొల్లోజు బాబా, సాహితీవేత్తలు గనారా, మార్ని జానకిరామ్‌ చౌదరి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement