కవిత్వము - పదజ్ఞత

ABN , First Publish Date - 2020-11-02T06:19:56+05:30 IST

కవిత్వానికి ‘విన సొంపైన మాటా? లేక మనసుకు హత్తుకునే భావమా? ఏది ముఖ్యం?’ అనే మాట కొస్తే ఏదని చెప్పగలం? ఈ రెండూ సమంగా కలిసి వున్నదే...

కవిత్వము - పదజ్ఞత

కవిత్వానికి ‘విన సొంపైన మాటా? లేక మనసుకు హత్తుకునే భావమా? ఏది ముఖ్యం?’ అనే మాట కొస్తే ఏదని చెప్పగలం? ఈ రెండూ సమంగా కలిసి వున్నదే మంచి కవిత్వమవుతుందని చెబుతాం! ఈ రెంటినీ కలగలిపి చెప్పగలిగే మాట ఏదైనా తెలుగులో వుందా? అని ప్రశ్నిస్తే సమాధానంగా అలాంటి ఒక మాటకు తెలుగులో క్రీ.శ. 15-16 శతాబ్దాల్లోనే రూప కల్పన జరిగిందనీ, ఆ కాలంలోనే జీవించినట్లు తెలుస్తున్న కొఱవి గోపరాజు అనే కవి ఆ అందమైన మాటను రూపకల్పన చేసిపెట్టి పోయాడనీ నిస్సందేహంగా చెప్పవచ్చు.


‘‘మంత్రము లేని సంధ్యయును, 

మౌనము లేని తపంబు, వేదవి

త్తంత్రము లేని యాగముఁ, 

బదజ్ఞత లేని కవిత్వము, న్సదా 

తంత్రులు లేని వీణయును, 

దానకరాగము లేని గీతమున్‌,

మంత్రులు లేని రాజ్యము, 

సమానములన్నియు వ్యర్థకార్యముల్‌’’. 

అనే పద్యం, ఉత్పలమాల వృత్తం లోనిది, కొఱవి గోప రాజు రచించిన ‘సింహాసనా ద్వాత్రింశిక’ అనే కావ్యంలో, ప్రథమాశ్వాసం, 191వ పద్యంగా కనిపిస్తుంది. ఎప్పటి వాడో ఇదమిత్థంగా తేల్చి చెప్పడానికి సరైన ఆధారాలు దొరకని ఈ కవి, క్రీ.శ.15వ శతాబ్దపు ఉత్తరార్ధం 16వ శతాబ్దపు ప్రథమార్ధం మధ్యకాలంలో జీవించి వుండొచ్చని అంచనా! ‘సింహాసనా ద్వాత్రింశిక’ తెలుగులోని కథాకావ్యా లలో ఒక మంచి కావ్యం. విక్రమార్కుని దివ్య సింహాసన సొపానాలపై వున్న 32 సాలభంజికలు భోజ మహా రాజుకు చెప్పిన కథలు ఈ కావ్యానికి వస్తువు. అయితే, సందర్భోచితంగా తెలుగువారి జీవన విధానానికి సంబంధించిన ఎన్నో సంగతులను కొఱవి గోపరాజు ఈ కావ్యంలో నిక్షిప్తం చేసి చెప్పడం వలన, తెలుగులో పద్యరూపంలో వున్న కథాకావ్యాలలో ‘సింహాసనా ద్వాత్రింశిక’కు మంచి ప్రాధాన్యత దక్కింది.


వ్యర్థ కార్యాలు--అంటే దేనికీ పనికి రాని వృథా పనులు--ఏవో ఒక వరుసలో వివ రంగా చెబుతూ, వాటిల్లో ‘పదజ్ఞత లేని కవిత్వా’న్ని ఒకటిగా చేర్చి, అలాంటి కవిత్వాన్ని చెప్పటం ముమ్మాటికీ పనికి మాలిన పనే అని నిక్కచ్చి గానూ, నిర్ద్వందంగానూ చెప్పాడీ కవి!


‘పదములకు సంబంధించిన విజ్ఞతను కలిగి వుండడం, రచనలో ఆ విజ్ఞతను ప్రదర్శిం చడం’ పదజ్ఞత అనే పదానికి అర్థంగా చెప్పవచ్చని నేననుకుంటాను. అయితే, ఏ కారణం చేతనో ‘బుధజ్ఞత’ అనే పదం ఒకటి ‘పదజ్ఞత’కు పాఠాంతరంగా చూప బడి కనిపిస్తుంది సాహిత్య అకాడమీవారు ప్రచురించిన పుస్తకంలో (సింహాసనా ద్వాత్రింశిక, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ, 1982. పేజి 39). ‘పండితులచేత ఔననిపించుకోగల లక్షణం’ కలిగివుండడాన్ని ‘బుధజ్ఞత’గా తీర్మానించుకుని ఆలోచిస్తే, ఈ రెండు పదాల అర్థాల లోనూ, ఉద్దేశాలలో అంతరం చాలా దూరం వెళ్ళి, అసలు చర్చ తప్పుదారి పట్టే అవకాశం వుంది కాబట్టి, ఈ పాఠాంతర ‘బుధజ్ఞత’ను ఇక్కడితో వదిలేస్తున్నాను. 


‘పదజ్ఞత’ అనే పదం మన ప్రసిద్ధ నిఘంటువులైన శబ్దరత్నాకరం, వావిళ్ళవారి నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘంటువు, బ్రౌణ్య తెలుగు ఇంగ్లీషు నిఘంటువులలో దేనిలోనూ కనిపించదు. దీనిని బట్టి, ఈ ‘పదజ్ఞత’ అనే మాటను ‘ఒక స్పష్టమైన అర్థం చెప్పగలిగిన మాటగా’ ఆయా నిఘంటుకర్తలు భావించలేదేమోనన్న సందేహం కలుగుతుంది. 


కవిత్వంలో పదజ్ఞత ప్రాధాన్యాన్ని గురించి ఇంతగా చెప్పిన కొఱవి గోపరాజు, ఆ నిర్వచనానికి తగిన కవిత్వం చెప్పాడా? అంటే, చెప్పాడనడానికి ‘సింహాసనా ద్వాత్రింశిక’ కావ్యంలో వున్న ఎన్నో ఉదాహరణలలో, ఒక మంచి ఉదాహరణగా ఈ క్రింది పద్యం నిలుస్తుంది:

కడుపునకు కూడు గానక

పడి మిడిమిడి మిడుకునట్టి బడుగున కియ్యా

ఱడి అమరత్వం బేటికి?

కడుపిట కాలంగ కంట కాటుక యేలా! 

(ప్రథామాశ్వాసం, 86వ పద్యం)

ఒక ఊరిలో వేదవిదుడైన విప్రుడు ఉండేవాడు. కడు పేదవాడు కావడంతో సంసార భారాన్ని లాగలేక తంటాలు పడుతూండేవాడు. విత్తలేమినుంచి విముక్తి పొందడా నికై భద్రకాళి ఆలయానికి వెళ్ళి, ఘోరతపస్సు చేసాడు. కరుణించిన అమ్మ ప్రత్యక్షమ యింది. అమ్మ దివ్యరూపం చూసిన ఆనంద పరవశంలో సర్వం మరిచిపో యాడు. ‘ఏం కావాలో కోరుకో, ఇస్తాను’ అన్న అమ్మ మాటలకు బదులుగా, తప మాచరించిన కారణం మరచి, విత్తానికి బదులు, అమరత్వాన్ని కోరాడు. ‘సరే!’నని ఒక దివ్యఫలం ప్రసాదించింది అమ్మ. ఆ ఫలంతో ఇంటికి చేరుకున్న విప్రుడి తెలివి తక్కువతనానికి విస్తుపోయిన భార్య, తిన డానికి తిండి లేని వాళ్ళకు అమరత్వం ఎంత ‘ఆఱడి’ని కలగజేస్తుందో అర్థం చేసుకోలేని విప్రుని అవిజ్ఞతకు బాధపడుతూ, కర్తవ్యం బోధించే సందర్భంలోనిది పై పద్యం. 


ఇందులోనివన్నీ, అచ్చమైన తెలుగు అలతి అలతి మాటలు. పద్యంలో ధార చెడకుండా, ‘కడుపు కాలుతూండగా కంట కాటుక ఎందుకు?’ అనే నానుడిని కూడా పద్యంలో చివరిపాదంలో చేర్చి చెప్పిన కొఱవి గోపరాజుది పదజ్ఞత గల కవిత్వం అని చెప్పడానికి సందేహించ నక్కర లేదు కదా!

భట్టు వెంకటరావు

Updated Date - 2020-11-02T06:19:56+05:30 IST