పద్యకవితా ‘పురుషోత్తముడు’

ABN , First Publish Date - 2021-09-07T05:50:57+05:30 IST

చిటిప్రోలు కృష్ణమూర్తి గారు మన తరం పండిత కవి. కాంతులీనే తెలుగుపద్యానికి కాలాతీత రేఖలా నిలిచారు. అజరామరమైన రచనలతో పద్యానికి పట్టాభిషేకం చేశారు....

పద్యకవితా ‘పురుషోత్తముడు’

చిటిప్రోలు కృష్ణమూర్తి గారు మన తరం పండిత కవి. కాంతులీనే తెలుగుపద్యానికి కాలాతీత రేఖలా నిలిచారు. అజరామరమైన రచనలతో పద్యానికి పట్టాభిషేకం చేశారు. పల్నాటి సీమలో ‘కవిగారు’గా గౌరవం పొందారు. ఈ నెల సెప్టెంబరు 2న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. కృష్ణమూర్తి చిటిప్రోలు వేంకటరత్నం, కనకమ్మ దంపతులకు 1932 డిసెంబర్ 26న పల్నాడులోని గామాలపాడు గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం మధ్య పెరుగుతూ స్వయంకృషితో తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో పాండిత్యం సంపాదించారు. సమకాలీన మహాకవులు ‘తెనుగులెంక’ తుమ్మల, జాషువా, ఏటుకూరి, కరుణశ్రీ, విశ్వనాథ, పల్నాటి సోదర కవులు మొదలైనవారితో సాన్నిహిత్యమున్న కవి. జాతిహితమే లక్ష్యంగా, దేశభక్తి ధ్యేయంగా, ప్రజాశ్రేయస్సు పరమార్థంగా రచనలు చేసిన కృష్ణమూర్తి గారు పద్యాన్ని పరమోత్కృష్ట భావవాహినిగా ఎంచుకున్నారు. చిటిప్రోలు కృష్ణమూర్తి కవితా మూర్తిమత్వానికి కీర్తిశిఖరంగా వెలిగిన కావ్యం ‘పురుషోత్తముడు’. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వల్ల మాత్రమే ఉత్తమ కావ్యం కాదు. గొప్ప కావ్యానికి ఉండవలసిన ఉత్తమ గుణాలన్నీ దీనికి ఉన్నాయి. చరిత్రపుటల్లో దాగిన పురుషోత్తముడి వీరగాథకు ఈ కావ్యం ద్వారా దేశవ్యాప్తమైన గుర్తింపు వచ్చింది. 


పద్యమంటే ఏమిటో తెలియకుండానే పద్యం రాస్తున్న కవులు తెలుగులో చాలామంది ఉన్నారు. యతులూ ప్రాసలూ గణాలూ మాత్రమే పద్యం అనుకుంటే అదొక రుచి లేని పదార్థమవుతుంది. గణాల కంటే గుణాలు ముఖ్యమనుకునే వారికి పద్యమంటే అమృతం కుమ్మరించిన కమనీయ కవితా రస ధార. చిటిప్రోలు వారు శిల్పప్రౌఢి ఎరిగిన, చేయి తిరిగిన పద్యకవి. దేశభక్తీ, వీరరస స్ఫూర్తీ, జాతీయసమైక్యతా ఆకరంగా 1100 పద్యాల్లో ‘పురు షోత్తముడు’ కావ్యాన్ని చిటిప్రోలు రాశారు. ప్రతిపద్యంలోనూ ఉదాత్తతనూ, భావుకతనూ, రసాత్మకతనూ నింపి పాఠకుల గుండెపొలాలను తడిమారు, తడిపారు, తనిపారు. 


‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ వంటి బిరుదులందిన చిటిప్రోలు వారు పురుషోత్తమ మహారాజు లాగే ధర్మవర్తనులు. సత్యమార్గానుయాయి. కవికి ఉండవలసిన ఉత్తమ గుణాలన్నీ కలిగిన సహజ పాండితీ సంపన్నులు. అభిమానధనులు. వ్యవసాయం వృత్తిగా, కవిత్వం ప్రవృత్తిగా పల్లెపట్టునే జీవితం కొనసాగించారు. చదువుకుని పల్లెలో స్థిరపడ్డ మరో వ్యక్తి లేకపోవటంవల్ల ఉన్న పోస్టాఫీసు మరో గ్రామానికి తరలిపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో గ్రామ శ్రేయస్సు దృష్ట్యా స్వీకరించిన పోస్టుమాస్టరు ఉద్యోగం ఆర్థికంగా సేద్యానికి కొంత చేదోడైంది. ఖడ్గపాండితి నెరపిన నాయకురాలు నాగమ్మ పుట్టిన గామాలపాడులో కవిగారి కవన పాండితి శోభించింది. తెలుగుపద్యానికి వెలుగుదారి చూపించిన ‘పద్యకవితా పురుషోత్తముడు’ చిటిప్రోలు కృష్ణమూర్తికి ఆత్మీయ అక్షరనివాళి. 

డా. బీరం సుందరరావు, చీరాల

Updated Date - 2021-09-07T05:50:57+05:30 IST