పగడపు కన్నీరు

ABN , First Publish Date - 2020-06-15T05:48:55+05:30 IST

నిన్ను తనివి తీరా చూసుకుని పోదమనుకుంటిమి కడచూపుకైనా నోచుకోకపోతమా అనుకుంటిమి

పగడపు కన్నీరు

నిన్ను తనివి తీరా చూసుకుని పోదమనుకుంటిమి 

కడచూపుకైనా నోచుకోకపోతమా అనుకుంటిమి

పుడిమిలోనెంచగల బిడ్డవైనావనుకుంటిమి

నీరున పుట్టిన పొలములెక్క

నువ్వు పచ్చగుండాలనుకుంటిమి

మేడారంల బెల్లమిస్తిమి 

ఉప్పలమ్మకు కళ్ళు శాకపోస్తిమి

తొలిపొద్దు నుండి మలిపొద్దు దాక 

అరుగుమీద కూర్చొని 

పిట్టకుబెట్టినట్టు ఎదురుచూడబడ్తిమి

వానలేని పిడుగోలే ఎగిరొస్తవనుకుంటిమి 

మంచానికి ఒక పక్క నేను

మరో పక్క మీ నాయిన 

ఒకరికి తెల్వకుండ ఒకరం 

కన్నీళ్లు పెట్టుకుంటిమి

పండుగలకు రాకపోతివి 

పెళ్లిల్లకు రాకపోతివి 

పోనీ చావులకన్న వచ్చినవా ఎప్పుడైనా?

మీ పెద్దమ్మలు పాయే 

మీ పెద్దనాయినలు పాయే 

ఇప్పుడు మా వంతు వచ్చె!

ఉండొచ్చు బిడ్డా

నీ కథ నీకుండచ్చు 

మా కథ మాకుండచ్చు 

లాభమేమి జరిగెను చెప్పు 

బతకడానికి పోయినోడివి 

మేం బతికుండగ రాకపోతివి

ఉడుత చప్పుడు కూడా ఉప్పెన రీతిగా తోచె 

ఇక ఈ మాయ జీవముతో 

మా ఋణానుబంధం తీరిపోయింది 

అమర గాలి భస్మమైపోయింది 

అసుర సంధ్య వేళకు ముందే 

కట్టెలన్నీ కాలి బూడిదగుతాయి 

అయినా దుఃఖం దూరమవ్వదు 

ఆత్మలు నిర్మలం కావు 

నా మనవళ్లు మనవరాళ్ళను 

ఊరంతా వినబడేటట్టు గట్టిగట్టిగా ఏడ్వమను 

ముత్యపు కన్నీరు 

కంఠహారంగా రాల్చమను 

పగడపు కన్నీరు 

పూలపాన్పుగా వేయమను 

చుట్టాలను హత్తుకుని వలపోయమను 

లేదంటే గునహీనులనుకుందురు

చెప్పిన కాకి నెపముల చాలించి 

దింపుడుకళ్ళెం ఆశల్ని వధించు 

కాటికాడ మా చెవులల్లో ఎంతసేపు పిలిచినా 

మేమైతే రాము... 

ఎట్లోస్తమ్‌ చెప్పు

ఏ దిక్కునుండి రమ్మంటవ్‌ చెప్పు 

మేం పిలిచినప్పుడు నువ్వొచ్చినవా ఎప్పుడైనా?


వేణు ఊడుగుల

Updated Date - 2020-06-15T05:48:55+05:30 IST