పొగాకు ధర తగ్గించారు.. రైతు కడుపు మండింది!

ABN , First Publish Date - 2021-06-24T04:37:23+05:30 IST

ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది ధరలపై ఆశపెట్టిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు తమను నిట్టనిలువునా ముంచేశారని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొగాకు ధర తగ్గించారు..  రైతు కడుపు మండింది!
కలిగిరి-నెల్లూరు రహదారిపై బైఠాయించిన రైతులు

వేలం నిర్వహణాధికారిపై తీవ్ర అసంతృప్తి

బోర్డుకు తాళం వేసి రోడ్డెక్కిన రైతన్న


కలిగిరి, జూన్‌ 23 :  ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది  ధరలపై ఆశపెట్టిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు తమను నిట్టనిలువునా ముంచేశారని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏదాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభం నుంచి గరిష్ఠ ధర  రూ.180 రైతుకు అందుతోంది. అయితే, బుధవారం ఒక్కసారిగా రూ.160కి పడిపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొనుగోళ్లు నిలిపివేసి బోర్డుకు తాళం వేసి కలిగిరి-నెల్లూరు రహదారిపై బైఠాయించారు. వేలం నిర్వహణాధికారితోపాటు కంపెనీ ప్రతినిధులు నాణ్యత కలిగిన పొగాకును ప్రారంభం కొనుగోళ్ల సమయంలో తీసుకురావద్దన్నారని, ఇప్పుడు తీసుకువస్తే ధరలు అమాంతం తగ్గించి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొనుగోలు ప్రక్రియ సరిగా జరగడంలేదని, నిర్వహణాధికారి అలసత్వంతో కేవలం ఏడెనిమిది కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయన్నారు. బోర్డుకు వచ్చిన బేళ్లల్లో 80 నుంచి 90శాతం ఐటీసీ కొనుగోలు చేస్తుండగా కేవలం ఏడెనిమిది శాతం పొగకును మిగిలిన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఐటీసీ గుత్తాధిపత్యం వహిస్తూ ధరలు తగ్గించే విధానం అవలంబిస్తుండటం స్పష్టంగా తెలుస్తున్నా వేలం నిర్వహణాధికారి పట్టించుకోకపోవడంతో పొగాకు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడన్నారు. ప్రభుత్వం తరపున పొగాకు కొనుగోలు చేస్తేనే మద్దతు ధర అందుతుందని, ఆవిధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నామన్నారు.

Updated Date - 2021-06-24T04:37:23+05:30 IST