మూగ జీవాలపాలిట విషం

ABN , First Publish Date - 2022-01-22T05:51:24+05:30 IST

పాడి పశువులను రైతులు వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు.

మూగ జీవాలపాలిట విషం

  • మోతాదుకు మించి బీర్‌దాణా తాగించి పాలు పిండుకుంటున్న రైతులు 
  • అధిక పాల ఉత్పత్తిపై శ్రద్ధ... పాడి పశువుల ఆరోగ్యం గాలికి
  • ప్రమాదకరమని హెచ్చరిస్తున్న పశువైద్యులు 


   పాడి పశువులను రైతులు వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు. అధిక పాల ఉత్పత్తే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం బీర్‌దాణా లాంటి విష పదార్థాలను ఆహారంగా ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ దాణాను అధిక మోతాదులో ఇచ్చి పాలిచ్చే గేదెలను రోగాల బారిన పడేస్తున్నారు. ఈ విషపూరిత పదార్థం ఇవ్వడం వల్ల జీవాలు మళ్లీ ఎదకు రాకుండా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. 


యాచారం, జనవరి 21 : మనిషి రెండు బీర్లు తాగితేనే ఊగిపోతాడు. అంతకుమించి సేవిస్తే మద్యం మత్తులో ఎవరిపై దాడి చేస్తున్నారో తెలియనంత మత్తులోకి వెళ్లిపోతారు. అలాంటిది బీర్‌ తయారు చేయగా వచ్చి వ్యర్థాలను (బీర్‌ దాణా) మోతాదుకు మించి పాడిపశువులకు తాగించి రైతులు పాలు పిండుకుంటున్నారు. పాల ఉత్పత్తి పెరుగుతుందన్న దురాశతో యాచారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు బీర్‌దాణా కొనుగోలు చేసి ఆవులు, గేదెలకు అందిస్తున్నారు. స్వార్థం కోసం తల్లిలాంటి  ఆవులకు విషతుల్యమైన బీర్‌దాణాను అధిక మోతాదులో తాగించి పాలు పిండుకుంటూ లాభాలు గడిస్తున్నారు. బీర్‌ దాణాను అందించడం వలన ఆవులు, గేదెలు రోగాల బారిన పడి కోలుకోవని పశుసంవర్దకశాఖ అధికారులు చెబుతున్నా రైతులు పెడచెవిన పెడుతున్నారు. 

ఈ బీర్‌దాణా కర్నూల్‌ జిల్లా కొత్తకోట, నిజామాబాద్‌ జిల్లాల నుంచి తీసుకొచ్చి యాచారం మండల పరిధిలో రైతులకు సరఫరా చేస్తున్నారు. ఒక్క డ్రమ్‌కు రూ 900నుంచి రూ. 1000వరకు తీసుకుంటున్నారు. లిక్విడ్‌ పలచగా ఉంటే రూ.900, చిక్కగా ఉంటే రూ1000కి విక్రయిస్తున్నారు. పాలిచ్చే ఆవులు, గేదెలకు పచ్చిగడ్డి, వరి గడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కిల్లి లాంటి పోషక విలువలు ఉన్న పదార్థాలు కలిపి ఇస్తే ఎలాంటి రోగాలు దరి చేరవని రైతులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. జీవాలకు బీర్‌దాణా తాగించడానికి మొగ్గుచూపుతున్నారు. నాలుగు ఆవులు లేదా గేదెలు ఉన్న రైతులు నెలకు రెండు డ్రమ్ముల వరకు బీర్‌దాణా కొనుగోలు చేస్తున్నారు. అయితే పాడి పశువులకు పొద్దున కిలో, సాయంత్రం కిలో బీర్‌దాణా ఇవ్వాల్సి ఉండగా, రైతులు అంతకు మించి అందిస్తున్నారు. ఈ దాణాను అందించే పాడిపశువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలలో పోషకపదార్థాలు చాలా తక్కువ ఉంటాయని పశువైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పాలు తీసుకోవడంతో మనిషి ఆరోగ్యం కూడా పాడవుతుందంటున్నారు. పాడిపశువులు ఈనిన తరువాత రెండు లేదా మూడు నెలలపాటు ఉదయం రెండు సాయంత్రం రెండు లీటర్ల పాలు ఇచ్చేవి. ఆ తరువాత పాల ఉత్పత్తి తగ్గడంతో బీర్‌దాణా పెడితే ఉదయం ఆరు, సాయంత్రం ఆరు లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో పంటపొలాలు, దొడ్ల వద్ద బీర్‌దాణాతో కూడిన బ్యారల్‌ డబ్బాలు దర్శనమిస్తున్నాయి. బీర్‌దాణ తాగుతున్న పాడిపశువులు మళ్లీ చూడికి రాకపోవడంతోపాటు రోగాల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసమే పాడిపశువులకు బీర్‌దాణా పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్కో పశువుకు ఉదయం లీటర్‌, సాయంత్రం లీటర్‌ దాణా పెడుతున్నామని, దీంతోపాటు పచ్చిగడ్డి, వరిగడ్డి కూడా పెడుతున్నామంటున్నారు. ఒక డ్రమ్‌ బీర్‌దాణా పది రోజులకు సరిపోతుందని పేర్కొంటున్నారు. యాచారం మండలంలో బీర్‌దాణాపై నెలకు సుమారు రూ.కోటి పైమాటే ఆదాయాన్ని బీర్‌కంపెనీలు పొందుతున్నాయి. కాగా ఈ లిక్విడ్‌ తాగిన పాడిపశువుల నుంచి ఉత్పత్తి అవుతున్న పాలను చిన్నపిల్లలు తాగిస్తే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

  • ఒక్క ఆవుకు రెండు పూటలకు రెండు లీటర్లు పెడుతున్నా : తిరుపతయ్య, రైతు 

నాకు పదిహేను పాడిపశువులున్నాయి. ఒక్కో ఆవుకు ఉదయం లీటర్‌, సాయంత్రం లీటర్‌ బీర్‌దాణా పెడుతున్నా. 15 ఆవులకు నెలకు రూ.15,000 ఖర్చవుతుంది. బీర్‌దాణాతోపాటు పచ్చిగడ్డి, పల్లిపట్టి, పొద్దుతిరుగుడు పిండి తినిపిస్తే చాలా మంచిది. బీర్‌దాణా పెట్టినా ఖర్చుకు తగ్గ ఆదాయం చేతికందడం లేదు. 

  • పాడి పశువులు రోగాలబారిన పడితే కోలుకోవు : కె.జోగిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి చైర్మన్‌

పాడిపశువులకు బీర్‌దాణా పెట్టితే అవి రోగాలబారిన పడితే కోలుకోలేవు. పాలు కూడా కల్తీ అయి మనుషులకు రోగాలు సోకి కోలుకోలేరు. పల్లిపట్టి, దాణా, కుసుమనూనె తయారవ్వగా మిగిలిన కిల్లీ పెడటం చాలా మంచిది. సహజసిద్ధంగా లభిస్తున్న పశుగ్రాసం పెట్టాలి. బీర్‌దాణా తిన్న పశువులు ఎదకు రావడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

  • బీర్‌దాణా పెట్టడం మంచిది కాదు : డాక్టర్‌ వనజకుమారి, మండల పశుసంవర్ధక  శాఖ అధికారి

బీర్‌దాణా పెట్టడం ద్వారా పాడిపశువులు రోగాల బారిన పడుతాయి. రోగాలు వస్తే కోలుకోవడం చాలా కష్టం. చాలాతక్కువ మోతాదులో పెట్టొచ్చు. ఒకవేళ బీర్‌దాణా పెడితే వెంటనే రకరకాల పోషకపదార్థాలుంటే ఆహార పదార్థాలు పెట్టాలి.

Updated Date - 2022-01-22T05:51:24+05:30 IST