ఆసిఫాబాద్‌లో భయపెడుతున్న విషజ్వరాలు

ABN , First Publish Date - 2022-09-03T04:33:32+05:30 IST

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజేన్సీని విషజ్వరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో వందలాది మంది విషజ్వరాలు బారిన పడి జిల్లాతోపాటు పొరుగుజిల్లాలో చికిత్స పొందుతున్నారు. నిన్న, మొన్నటి వరకు భారీ వర్షాలు కురియడంతో డయేరియా కేసులు పెరుగుతాయని జిల్లా అధికార యంత్రాంగం బయపడింది.

ఆసిఫాబాద్‌లో భయపెడుతున్న విషజ్వరాలు

-విజృంభిస్తున్న మలేరియా, టైఫాయిడ్‌

-అనారోగ్యంతో ఇప్పటికే నలుగురు మృతి

-చికిత్స కోసం పొరుగు జిల్లాకు పరుగులు

-వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యఆరోగ్యశాఖ 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజేన్సీని విషజ్వరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో వందలాది మంది విషజ్వరాలు బారిన పడి జిల్లాతోపాటు పొరుగుజిల్లాలో చికిత్స పొందుతున్నారు. నిన్న, మొన్నటి వరకు భారీ వర్షాలు కురియడంతో డయేరియా కేసులు పెరుగుతాయని జిల్లా అధికార యంత్రాంగం బయపడింది. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్దంగా కన్పిస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జ్వరాల బాధితుల్లో ఎక్కువ శాతం వైరల్‌ ఫీవర్స్‌, మలేరియా, టైపాయిడ్‌ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం సగటున రోజుకు 250 నుంచి 270కేసులు నమోదు అవుతున్నాయని చెబుతున్నా వాస్తవిక సంఖ్య ఇందుకు రెండు రెట్లు ఉంటుందని చెబుతున్నారు. చాలామంది బాధితులు ప్రభుత్వ వైద్యశాలకు రాకుండా స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే పరిస్థితి తీవ్రత పెరుగగానే పొరుగునే ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో వైద్యపరంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు వైద్యఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ బాధితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే పరిస్థితులు కన్పించడం లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఇటీవల కాలంలో నలుగురు యువకులు జ్వరాల బాధపడుతూ మృత్యువాత పడడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు బాధితులు వెనుకంజ వేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే వైద్యులు మాత్రం చని పోయిన నలుగురు కూడా ఇతర అనారోగ్య కారణాలతో మరణించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆసిఫాబాద్‌ ఏజేన్సీలోని కెరమెరి, జైనూరు, సిర్పూరు(యూ), లింగాపూర్‌, తిర్యాణి మండలాలతోపాటు ఆసిఫాబాద్‌, వాంకిడి మండలాల్లోని అటవీప్రాంత గ్రామాల్లో విషజ్వరాల తీవ్రత అధి కంగా కన్పిస్తోంది. ఇక్కడ ఏ గ్రామంలో చూసినా ప్రతి ఇంట్లో జ్వరపీడితులు ఉన్నట్టుచెబుతున్నారు. అటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల మరణించిన నలుగురిలో ముగ్గురు విద్యార్థులు ఈ ప్రాంతానికి చెందిన వారే కావటం గమనార్హం. 

వాతావరణ మార్పులే కారణం

జిల్లాలో ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పరిసరాలన్నీ చిత్తడిగా తయారై ఈగలు, దోమల బెడద అధికంగా కన్పిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం శానిటేషన్‌పై దృష్టి సారించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ దాఖాలు కన్పించడం లేదు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న జ్వరపీడితులు అత్యధికంగా మారుమూల గ్రామాలకు చెందిన వారే కావటం ఏజెన్సీలో నెలకొన్న శానిటేషన్‌ సమస్యకు అద్దం పడుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల, వాతావరణ మార్పులు కారణంగా సహజంగానే విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలటం సర్వసాధరణ విషయమని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. అయితే గతేడాది గణాంకాలను పోల్చిచూస్తే ఈ సారి జ్వరాల తీవ్రత ఇంకా అదుపులోనే ఉందని అంటున్నారు. గత మూడు రోజుల గణాంకాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మంగళవారం 250జ్వరం కేసులు నమోదయితే బుధవారం 197, గురువారం 271 కేసులు నమోదయినట్టు చెబుతున్నారు. దీన్ని బట్టి సగటున జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సీహెచ్‌సీల్లో కలిపి సగటున రోజుకు 250 జ్వర కేసులు రికార్డు అవుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ యేడాది జూలై 1 నుంచి సెప్టెంబరు 2వరకు విషజ్వరాలను మినహాయిస్తే 63మలేరియా పాజిటివ్‌ కేసులు, 735టైఫాయిడ్‌ కేసులు, 11డెంగీ కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. 

పరిస్థితి అదుపులోనే ఉంది

-ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా వైద్యాధికారి,ఆసిఫాబాద్‌

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజేన్సీతోపాటు నాన్‌ ఏజేన్సీ మండలాల్లోను విషజ్వరాల సంఖ్య అధికంగా ఉన్న మాట వాస్తవమే. అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. ఇప్పటివరకు జ్వరాల కారణంగా ఎవరూ మృత్యువాత పడలేదు. జ్వరాలను అదుపులోకి తేచ్చేందుకు క్షేత్రస్థాయిలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. సాధారణంగా వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. 

Updated Date - 2022-09-03T04:33:32+05:30 IST