విశాఖపట్నంలోని పరిశ్రమల్లో ప్రమాదాలకు.. ప్రధాన కారణమిదే!

ABN , First Publish Date - 2020-07-01T09:30:00+05:30 IST

తప్పు చేస్తే దండిస్తారనే భయం ఉంటే...

విశాఖపట్నంలోని పరిశ్రమల్లో ప్రమాదాలకు.. ప్రధాన కారణమిదే!

ప్రాణాలు తీసిన ఫార్మా

‘సాయినార్‌’లో విషవాయువు లీక్‌

ఇద్దరి మృతి...

మరో నలుగురికి అస్వస్థత...

ఒకరి పరిస్థితి విషమం

గతంలోనూ ఇదే కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): తప్పు చేస్తే దండిస్తారనే భయం ఉంటే... ఎవరైనా భయపడతారు. ఎవరూ ఏమీ చేయరనే భావన ఉంటే... ఆ తప్పులు పునరావృతం అవుతూనే ఉంటాయి. విశాఖపట్నంలోని పరిశ్రమల్లో ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం. ఎన్ని ప్రమాదాలు జరిగినా... ఎంతమంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఒక కమిటీని వేసి చేతులు దులుపుకోవడం, ఒక్కరిపైనా కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు ఒకదాని తరువాత మరొకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ వరుసలోజరిగిందే... ‘సాయినార్‌’ ప్రమాదం.


ఇంకా ఆ వాసనలు పోక ముందే...

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. విషవాయువులు పీల్చి మొత్తం 15 మంది చనిపోయారు. వేయి మందికిపైగా ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్పష్టంచేసింది. అయినా ఆ కంపెనీపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. అంత పెద్ద ప్రమాదం జరిగితేనే ఏమీ చేయలేదు...ఇక చిన్న కంపెనీలపై ఏమి చర్యలు తీసుకుంటారులే...! అనే సందేశం పారిశ్రామిక వర్గాల్లోకి వెళ్లిపోయింది. దాంతో నిర్లక్ష్యం పెరిగిపోయింది. గతంలో ఒకసారి ప్రమాదం జరిగి ఇద్దరు మరణించినా సాయినార్‌ యాజమాన్యం గుణపాఠం నేర్చుకోకపోవడానికి కారణం.. వారిపై చర్యలు లేకపోవడమే. అదే ప్రమాదానికి దారితీసింది.


ఏమి జరిగిందంటే..?

సాయినార్‌లో 21 రియాక్టర్లు ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన మందు తయారవుతోంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలకు ఉపయోగించే ‘వాంపెర్‌జోల్‌’ మందును తయారుచేస్తుండగా సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ మందు నాలుగు దశల్లో తయారవుతుంది. మూడో దశలో ‘బెంజి మెడజోల్‌’ అనే రెసిడ్యూ వెలువడుతుంది. దానిని పైపుల ద్వారా ఎఫులియెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు పంపించాలి. దానికి అవసరమైన హోస్‌ పైపును బయట నుంచి అమర్చాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పైపును నేరుగా రియాక్టర్‌లోకి పెట్టేశారు. ఆ పని పూర్తికాగానే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అందులో రసాయనిక ప్రక్రియ మొదలై ప్రమాదకరమైన విషవాయువు ‘హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ ’ (హెచ్‌2ఎస్‌) తయారై బయటకు రావడం ప్రారంభమైంది.


పక్క రియాక్టర్‌లో పనిచేస్తున్న షిఫ్ట్‌ ఇన్‌చార్జి నరేంద్ర, కెమిస్ట్‌ గౌరీశంకర్‌ వాసన వస్తుండడంతో ఈ రియాక్టర్‌ దగ్గరకు వచ్చారు. ఆ వాయువు గాఢత ఎక్కువగా వుండడంతో దానిని పీల్చిన వెంటనే మగతలోకి వెళ్లిపోయారు. వారు ఎంతసేపటికీ రాకపోవడంతో వారి విభాగంలోని సహాయకులు వెదుక్కుంటూ అక్కడికి వచ్చారు. వారు కూడా ఆ వాయువును పీల్చి పడిపోయారు. అప్పుడు సిబ్బంది ప్రమాదం జరిగిన విషయం గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 


సమాచారం ఇవ్వడంలో జాప్యం

ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగించి, అందరినీ అప్రమత్తం చేయడం, జిల్లా అధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వాలనే నియమాలను పరిశ్రమల యాజమాన్యాలు పాటించడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు దానిని వీలైనంత వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు సాయినార్‌ కూడా అదే చేసింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు ప్రమాదం జరిగితే...జిల్లా అధికారులకు ఉదయం ఐదు గంటలకు సమాచారం చేరింది. 


విపక్షాలకు, మీడియాకు నో ఎంట్రీ

పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వివరాలు మీడియాలో వస్తే... చెడ్డపేరు వస్తుందని... ప్రభుత్వం వాటి తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. సాయినార్‌లోకి మంగళవారం మీడియాను అనుమతించలేదు. ఇక మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్‌ చేసి నగరమంతా తిప్పి హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌కు చుక్కలు చూపించారు. జనసేన నాయకులు కోన తాతారావు, సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తిలను అడ్డుకున్నారు. 


షట్‌డౌన్‌కు అనుమతి కోరాం..

సాయినార్‌ కంపెనీని మూసివేయాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే మందుల తయారీలో అనేక రకాల దశలు ఉంటాయి. వాటిని మధ్యలో ఆపేయడం కుదరదు. పూర్తయిన వాటిని ఒక్కొక్కటిగా ఆపుకుంటూ వెళ్లాలి. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతి రాగానే దశల వారీగా ఆ కంపెనీని షట్‌డౌన్‌ చేస్తాము.

- ప్రసాద్‌, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌

Updated Date - 2020-07-01T09:30:00+05:30 IST